NRI-NRT

అమెరిక వీసా.. జీవితకాలం ఆలస్యం

అమెరిక వీసా.. జీవితకాలం ఆలస్యం

అమెరికా వెళ్లాలని ప్లాన్‌ చేసుకొంటున్నారా? మీరిప్పుడు వీసాకు దరఖాస్తు చేసుకొంటే ఓ ఏడాదిన్నర తర్వాత గానీ వీసా అపాయింట్‌మెంట్‌ దొరక్కపోవచ్చు. అంతకంటే ఎక్కువ సమయమూ పట్టొచ్చు. వచ్చే క్రిస్‌మస్‌ అక్కడే చేసుకొందామని ప్లాన్‌ చేసుకొన్నా! అంటే కష్టమే. ఆ ప్లాన్‌ వచ్చే ఏడాది క్రిస్‌మస్‌కు పోస్ట్‌పోన్‌ కావటం పక్కా. అవును! వీసాకు దరఖాస్తు చేసుకొన్నవారికి అపాయింట్‌మెంట్‌ దాదాపు 500 రోజుల తర్వాతే దొరుకుతున్నది. అమెరికా వీసా వెబ్‌సైట్‌ ప్రకారం న్యూఢిల్లీలోని యూఎస్‌ కాన్సులేట్‌ ఆఫీస్‌లో.. సగటు వీసా అపాయింట్‌మెంట్‌ టైం 522 రోజులు (విజిటింగ్‌ వీసా). స్టూడెంట్‌ వీసా అయితే 471 రోజులు పడుతున్నది. ముంబై యూఎస్‌ కాన్సులేట్‌లో అయితే విజిటింగ్‌ వీసాకు 517 రోజులు, స్టూడెంట్‌ వీసాకు 10 రోజులు పడుతున్నది.
*ఇతర దేశాల్లోనూ..
ఒక్క అమెరికానే కాదు.. కెనడా, యూకే లాంటి దేశాల్లోనూ అనుకొన్న సమయానికి వీసా దొరకటం కష్టంగా మారిందని ట్రావెల్‌ ఏజెంట్లు అంటున్నారు. చాలా యూరోప్‌ దేశాలు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వటం లేదని తెలిపారు. స్వీడన్‌ లాంటి కొన్ని దేశాలే అపాయింట్‌మెంట్లు ఇస్తున్నాయని వివరించారు.
*ఎందుకీ పరిస్థితి?
కరోనా తర్వాత ట్రావెల్‌ డిమాండ్‌ పెరగటం, వీసాకు దరఖాస్తు చేసుకొనేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం వల్లే వీసా అపాయింట్‌మెంట్లలో ఆలస్యం అవుతున్నదని నిపుణులు చెప్తున్నారు. కరోనా సమయంలో సొంత ప్రదేశాలకు వెళ్లిన వీసా సిబ్బంది ఇప్పటికీ రాకపోవటంతో, మానవ వనరుల కొరత ఏర్పడి అపాయింట్‌మెంట్‌కు సమస్యగా మారిందని అంటున్నారు.