Movies

అవార్డ్‌ ఇస్తే.. కేసు వేస్తా..!

అవార్డ్‌ ఇస్తే.. కేసు వేస్తా..!

ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులపై న్యాయ పోరాటం చేస్తానని అంటున్నది బాలీవుడ్‌ తార కంగనా రనౌత్‌. పురస్కారాలు ఇవ్వడంలో నిజాయితీ, కనీస విలువలు పాటించని ఈ అవార్డులకు తాను ఎనిమిదేళ్లుగా దూరంగా ఉంటున్నానని ఆమె చెప్పింది. ఈ ఏడాది ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డుల కార్యక్రమం కోసం ఇటీవల నామినేషన్స్‌ ప్రకటించారు. అందులో ‘తలైవీ’ చిత్రానికి ఉత్తమ నటిగా కంగనా నామినేట్‌ అయ్యింది. ఈ విషయాన్ని ఫిల్మ్‌ ఫేర్‌ నిర్వాహకులు ఆమెకు తెలియజేశారు. తాను వద్దంటున్నా ఈ అవార్డులకు ఎందుకు నామినేట్‌ చేస్తున్నారంటూ కంగనా మండిపడింది. ఇష్టంలేని అవార్డ్‌ ఇచ్చి తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారంటూ ఆగ్రహించింది. ఆ సంస్థ ధోరణిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నట్లు చెప్పింది. మరోవైపు కంగనా ఆరోపణలు ఫిల్మ్‌ ఫేర్‌ ఖండించింది. ‘నిష్పక్షపాతంగా పురస్కారాలను అందించడంలో ఫిల్మ్‌ ఫేర్‌కు దశాబ్దాల చరిత్ర ఉంది. మా అవార్డుల కార్యక్రమానికి రాకున్నా, ఏ పర్‌ఫార్మెన్స్‌ చేయకున్నా కంగనాకు ఇప్పటికి ఐదుసార్లు పురస్కారాన్ని అందించాం. ఇదే మా సంస్థ నిజాయితీకి నిదర్శనం. ఇప్పుడు ‘తలైవీ’ నామినేషన్‌ వెనక్కి తీసుకుంటున్నాం. మా సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తే మేమూ కోర్టును ఆశ్రయిస్తాం’ అని ఫిల్మ్‌ ఫేర్‌ తాజా ప్రకటనలో పేర్కొంది. 2014 నుంచి తాను ఈ అవార్డును బ్యాన్‌ చేసినట్లు కంగనా చెప్పుకుంటున్నది.