Business

విప్రో బాట‌లో ఇన్ఫోసిస్… వేరియ‌బుల్ వేత‌నంలో కోత‌ – TNI వాణిజ్య వార్తలు

విప్రో బాట‌లో ఇన్ఫోసిస్… వేరియ‌బుల్ వేత‌నంలో కోత‌ –  TNI  వాణిజ్య వార్తలు

* మ‌ధ్య‌, సీనియ‌ర్ లెవెల్ ఉద్యోగుల‌కు వేరియ‌బుల్ వేత‌నంలో విప్రో ఇటీవ‌ల కోత పెట్ట‌గా తాజాగా మ‌రో టెక్ దిగ్గ‌జం ఇన్ఫోసిస్ త‌మ ఉద్యోగులంద‌రి అస్ధిర వేత‌నాల్లో 30 శాతం త‌గ్గించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఉద్యోగుల‌కు పంపిన ఈమెయిల్‌లో సిబ్బందికి స‌గ‌టున 70 శాతం వేరియ‌బుల్ పే ఇస్తామ‌ని ఐటీ కంపెనీ పేర్కొంది. జూన్ 2022 క్వార్ట‌ర్‌లో స‌గ‌టు వేరియ‌బుల్ చెల్లింపుల్లో కంపెనీ 30 శాతం కోత విధించింది. వేత‌న పెంపు వంటి ఉద్యోగుల వ్య‌యాలు పెర‌గ‌డం, నూత‌న నియామ‌కాల‌కు పెద్ద మొత్తంలో ఆఫ‌ర్ చేస్తుండ‌టంతో వేరియ‌బుల్ పేలో కోత విధించాల్సి వ‌చ్చింద‌ని ఇన్ఫోసిస్ చెప్పుకొచ్చింది. వేరియ‌బుల్ పేలో స‌గ‌టున 70 శాతం చెల్లిస్తామ‌ని అయితే తుది వేరియ‌బుల్ పే ఆయా డిపార్ట్‌మెంట్ల మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ఉంటుంద‌ని కంపెనీ తెలిపింది.ఆగ‌స్ట్ వేత‌నంతో క‌లిపి వేరియ‌బుల్ పే చెల్లించ‌నున్న‌ట్టు ఇన్ఫోసిస్ వెల్ల‌డించింది. ఇక గ‌త వారం విప్రో ఉద్యోగులకు షాకిచ్చింది. మార్జిన్ల ఒత్తిడి కారణంగా పనితీరు ఆధారంగా ఇచ్చే అదనపు చెల్లింపులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వేరియబుల్‌ పేలో కోత పెట్టిన విషయాన్ని సంస్థ ఉద్యోగులకు ఈ-మెయిల్‌ ద్వారా సమాచారం ఇచ్చినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

*దేశ ఆర్థిక భవిష్యత్‌పై కంపెనీలు, వినియోగదారుల దృక్పధంలో స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ముందు ముందు లాభాలకు ఢోకా ఉండదని కంపెనీలు భావిస్తుంటే, వినియోగదారులు మాత్రం ఆదాయాలు, కొలువులు అంత ఆశాజనకంగా ఉండవని భావిస్తున్నారు. కన్స్యూమర్‌ కాన్ఫిడెన్స్‌ సర్వే (సీసీఎస్‌), ఇండస్ట్రియల్‌ ఔట్‌లుక్‌ సర్వే (ఐఓఎస్‌) పేరుతో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ఇటీవల నిర్వహించిన రెండు సర్వేల్లో ఈ విషయం తేలినట్టు మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ సంస్థ పేర్కొంది. పారిశ్రామిక, వినియోగదారుల అభిప్రాయాల్లో గతంలో ఎన్నడూ ఇంత తేడా లేదని తెలిపింది. కొవిడ్‌కు ముందుతో పోలిస్తే సీసీఎస్‌ గత ఏడాది సెప్టెంబరు నాటికి సగానికి పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) జూన్‌ త్రైమాసికానికి ఇది కోలుకుని 76.6 పాయింట్లకు చేరింది. గత ఏడాది కాలంగా ఐఓఎస్‌ మాత్రం 110 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. లాభాలపై పారిశ్రామిక రంగం గత రెండు దశాబ్ధాల్లో ఎన్నడూ ఇంత ఆశాజనకంగా లేదు.

*అల్లాటప్పా కంపెనీలకు చెక్‌పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక చర్య తీసుకుంది. ఇక రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్‌ఓసీ) నేరుగా కంపెనీలు ఇచ్చిన చిరునామాలకు వెళ్లి, ఆ చిరునామా నిజమా? కాదా? అనే విషయాన్ని ఇద్దరు స్థానిక సాక్షుల సమక్షంలో చెక్‌ చేయవచ్చు. ఇందుకోసం అవసరమైతే స్థానిక పోలీసుల సహాయమూ తీసుకోవచ్చు. ఆ తర్వాత కంపెనీ నమోదిత కార్యాలయం ఆర్‌ఓసీకి తెలిపిన అడ్రస్‌లో ఉందీ లేనిదీ ఫోటో తీసుకుని అప్‌లోడ్‌ చేయవచ్చు. ఈ విషయంలో ఏ మాత్రం తేడా ఉన్నా, ఆయా కంపెనీలకు నోటీసులు జారీ చేసి.. వాటి పేర్లను నమోదిత కంపెనీల జాబితా నుంచి తొలగించవచ్చు. ఇందుకు సంబంధించి కంపెనీల చట్టంలో ప్రభుత్వం మార్పులు చేసింది. త్వరలోనే దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

*హిందూజా గ్రూప్‌ కంపెనీ అశోక్‌ లేలాండ్‌ ఏవీటీఆర్‌లో 4825 టిప్పర్‌ను మార్కెట్లో విడుదల చేసింది. నిర్మాణం, గనుల రంగానికి ఉపయోగపడే విధంగా తయారుచేసిన ఈ టిప్పర్‌లో హెచ్‌6 4వీ ఇంజన్‌ అమర్చారు. 250 హెచ్‌పీ హెచ్‌-సీరీస్‌ 4వీ 6 సిలిండర్‌ ఇంజన్‌ ఈ ట్రక్కుల ప్రత్యేకత అని కంపెనీ మీడియం, హెవీ వాణిజ్య వాహనాల విభాగం హెడ్‌ సంజీవ్‌ కుమార్‌ అన్నారు.

*హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా.. మార్కెట్లోకి ఆల్‌ న్యూ 2022 యాక్టివా ప్రీమియం ఎడిషన్‌ను విడుదల చేసింది. మ్యాట్‌ సాంగ్రియా రెడ్‌ మెటాలిక్‌, మ్యాట్‌ మార్షల్‌ గ్రీన్‌ మెటాలిక్‌, పెరల్‌ సిరెన్‌ బ్లూ.. ఆప్షన్లతో ఇది అందుబాటులో ఉండనుంది. ఈ ప్రీమియం ఎడిషన్‌ స్కూటర్‌ ధర రూ.75,400 (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌).

*హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే కేఎ్‌సకే మహానది పవర్‌ కంపెనీ మొండి బకాయిల (ఎన్‌పీఏ) ఖాతా నుంచి భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) బయటపడింది. ఈ కంపెనీ నుంచి అసలు, వడ్డీల రూపంలో రావాల్సిన రూ.3,815.04 కోట్ల ఎన్‌పీఏ ఖాతాను 58 శాతం డిస్కౌంట్‌తో రూ.1,622 కోట్లకు విక్రయించింది. ఈ నెల 12న ఆదిత్య బిర్లా ఏఆర్‌సీ ఈ ఎన్‌పీఏ ఖాతాను కొనుగోలు చేసింది. చత్తీ్‌సగఢ్‌ రాష్ట్రంలో కేఎ్‌సకే మహానది పవర్‌ ప్రమోట్‌ చేసిన ఈ విద్యుత్‌ ప్రాజెక్టు రెండేళ్ల నుంచి దివాలా పరిష్కార ప్రక్రియలో ఉంది.

*దేశీయ విక్రయాలను బలోపేతం చేసుకోవడానికి ఆస్తులు లేదా కంపెనీని కొనుగోలు చేయాలని నాట్కో ఫార్మా యోచిస్తోంది. దేశీయంగా ఫార్ములేషన్ల వ్యాపారం స్థిరంగానే ఉంది. అయితే.. కంపెనీ వద్ద నిధులు ఉన్నాయి. కంపెనీ కొనుగోలు ద్వారా దేశీయ వ్యాపారాన్ని బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నామని నాట్కో ఫార్మా సీఈఓ రాజీవ్‌ నన్నపనేని అన్నారు. రూ.100 నుంచి రూ.200 కోట్ల టర్నోవర్‌ కలిగిన కంపెనీని కొనుగోలు చేయడానికి నాట్కో ఆసక్తి చూపుతోంది. భిన్న ఆప్షన్లు నాట్కో ముందు ఉన్నాయి. అన్నీ అనుకూలిస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కంపెనీని కొనుగోలు చేసే ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు.

*పెళ్లిళ్ల సీజన్.. తప్పనిసరిగా బంగారం కొనుగోలు చేయాల్సిందే అనుకునే వారికి ఇది కాస్త ఊరటనిచ్చే వార్తే. దాదాపు వారం రోజులుగా బంగారం ధరలు స్థిరంగా ఉండటమో లేదంటే స్వల్పంగా తగ్గడమో జరుగుతోంది కానీ పెరిగిందైతే లేదు. ఆగస్టు 13వ తేదీ నుంచి పరిస్థితి ఇలాగే ఉంది. ప్రస్తుతం 22 క్యారెట్ల(22 carots) బంగారం ధర(10 గ్రాములు) రూ. 47,900 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,250గా ఉంది. అయితే దేశంలోని ప్రధాన నగరాల్లో మాత్రం బంగారం, వెండి ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. గడిచిన మూడు రోజులుగా వెండి ధర మాత్రం తగ్గుతూనే ఉంది. మూడు రోజుల్లో కిలో వెండిపై ఏకంగా రూ.2400 తగ్గింది.