Sports

యూఏఈ చేరుకున్న టీమిండియా

యూఏఈ చేరుకున్న టీమిండియా

ఆసియాకప్‌ 2022 ఆడేందుకు టీమిండియా యూఏఈలో అడుగుపెట్టింది. రోహిత్‌ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఈసారి ఆసియాకప్‌లో ఫెవరెట్‌గా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో రోహిత్‌, కోహ్లి, పంత్‌, అశ్విన్‌ సహా ఇతర ఆటగాళ్లు ప్రత్యక్షమయ్యారు. ఈ నేపథ్యంలో విరాట్‌ కోహ్లి.. తన భార్య అనుష్క శర్మ, కూతురు వామికాతో దర్శనమివ్వడం స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. కోహ్లి ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇక ఆగస్టు 27న శ్రీలంక, అఫ్గనిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ ద్వారా 15వ ఆసియాకప్‌కు తెరలేనుంది. మరుసటి రోజు అంటే (ఆగస్టు 28) ఆదివారం రోజున టీమిండియా.. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో హైవోల్టేజ్‌ మ్యాచ్‌లో తలపడనుంది. చెప్పాలంటే ఈసారి టీమిండియాతో పాటు పాకిస్తాన్‌ కూడా ఫెవరెట్‌గా కనిపిస్తోంది.

ఇక ఆసియా కప్‌లో కోహ్లికి మంచి రికార్డు ఉంది. మరి ఆసియాకప్‌లోనైనా కోహ్లి సెంచరీ మార్క్‌ అందుకుంటాడా లేదా అనేది వేచి చూడాలి. కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ చేసి వెయ్యి రోజులు పూర్తయింది. ఆసియాకప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లోనే కోహ్లి 71వ సెంచరీ అందుకుంటాడని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్‌తో కోహ్లి ఆడబోయే టి20 మ్యాచ్‌ అతనికి వందోది కావడమే. ఇప్పటివరకు కోహ్లి 99 టి20ల్లో 50 సగటుతో 3308 పరుగులు సాధించాడు. ఇక జింబాబ్వేతో వన్డే సిరీస్‌ ముగించుకున్న టీమిండియా జట్టులోని కేఎల్‌ రాహుల్‌ సహా మరికొంత మంది క్రికెటర్లు నేరుగా యూఏఈకి చేరుకోనున్నారు.