Food

ఆహార శుభ్రత చాలా ముఖ్యం

ఆహార శుభ్రత చాలా ముఖ్యం

మనం తినే ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఆహారం జీవ ఇంధనంలాంటిదని నిపుణులు చెబుతుంటారు. అది కలుషితమైతే మన పాలిట శాపంగా మారుతుంది. ఆకు, కాయకూరలు శుభ్రం చేయడం, వాటి నిల్వ, వంటల్లో జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు తలెత్తుతాయి. ఆహార పదార్థాల శుచీ శుభ్రతల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పోషకాహార నిపుణురాలు డాక్టర్‌ అంజలీదేవి వివరించారు. ఆకు, కాయగూరల్లో ఉండే సూక్ష్మక్రిములు శరీరంలోకి రాకుండా అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. కూరగాయలు, మాంసం, పాలు మార్కెట్‌ నుంచి తీసుకొస్తాం. కూరలు వండే సమయంలో ముందుగా మంచినీటితో శుభ్రం చేయాలి. కత్తి, గిన్నెలు చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. లేకపోతే సూక్ష్మజీవులు ఆహారంలోకి వస్తాయి. వంట గదిలో దుమ్ము, ధూళి లేకుండా చూసుకోవాలి. బ్యాక్టీరియా, వైరస్‌, ఫంగస్‌లతో ఆహారం కలుషితమవుతుంది. ఇంట్లో ఈగలు, బొద్దింకలు లేకుండా చేసుకోవాలి. మంచినీటిని వాడుకోవాలి. బియ్యం, పప్పులు మూత బిగుతుగా ఉండే వాటిలో నిల్వ చేయాలి. ఫ్రిజ్‌లో పెట్టే ఆహార పదార్థాలను తరచూ తీసి పెడుతుండటంతో కూడా సూక్ష్మజీవులు చేరే అవకాశం ఉంటుంది.

ఈ జాగ్రత్తలు తీసుకోండి
* సాధ్యమయినంత వరకు ఏ రోజు కూరగాయలు, ఆకుకూరలు అదే రోజు తెచ్చుకొని వండుకోవాలి. వారానికి సరిపడా నిల్వ చేయడంతో వాటిలో ఉండే రసాయనాలు, బ్యాక్టీరియా విస్తరించే వీలుంది.

* ఫ్రిజ్‌లో మరీ చల్లగా ఉంచడం కూడా సరికాదు. ఆహార పదార్థాలు కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. తిన్నా కూడా జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది.

* ఆకు, కూరగాయలు చాలా రోజుల పాటు నిల్వ చేయడంతో విటమిన్లు కోల్పోతాయి. వాటిని భుజించినా పెద్దగా ప్రయోజనం ఉండదు.

* పెంపుడు జంతువులతో ఆడుకొని అలాగే తినుబండారాలు, ఆహారం తీసుకోవడంతో అనారోగ్యం పాలయ్యే వీలుంది.

* ఆహారం ఎప్పటికప్పుడు వండుకొని తినాలి. నిల్వ చేసిన ఆహారం తినడం మంచిది కాదు.