WorldWonders

రాబందుల పాలిట “రాబందు”…మనిషి

రాబందుల పాలిట “రాబందు”…మనిషి

అస్సాం రాష్ట్రంలోని కామరూప జిల్లాలో ఈ ఏడాది మార్చిలో సుమారు వంద రాబందులు మూకుమ్మడిగా మరణించడం కలకలం రేపింది. పురుగుమందుల ప్రభావానికి లోనైన పశు కళేబరాలను తినడం వల్ల అవి మృతి చెందినట్లు తేలింది. భారత్‌లో 1980ల్లో నాలుగు కోట్ల రాబందుల జనాభా ఉండేది. 2015 నాటికి అది పందొమ్మిది వేలకు చేరినట్లు మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. భారత్‌లోని రాబందుల్లో మొత్తం తొమ్మిది జాతులున్నాయి. వాటిలో తెల్లవీపు రాబందు, పొడుగు ముక్కు, సన్న ముక్కు, ఎర్రతల రాబందు జాతుల మనుగడ పెను ప్రమాదంలో పడింది. ఆవరణ వ్యవస్థలో రాబందుల పాత్ర కీలకమైంది. ఆరు బయట వదిలేసిన మృత కళేబరాలు కుళ్ళిపోక ముందే వాటిని రాబందులు ఆహారంగా స్వీకరిస్తాయి. అలా సహజ పారిశుద్ధ్య పనిని అవి నిర్వర్తిస్తాయి. లేకుంటే కళేబరాలు కుళ్ళిపోయి బ్యాక్టీరియా, వైరస్‌లు విజృంభించి ప్రజలు, ఇతర ప్రాణులు కలరా, ఆంత్రాక్స్‌ లాంటి భయంకరమైన వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. భారత ఉపఖండంలో రాబందుల అంతర్థానానికి డైక్లోఫినాక్‌ అనే ఔషధం కారణమని 2003లో కనుగొన్నారు. 2006లో కేంద్రం దాన్ని నిషేధించింది. ప్రపంచంలో 23 రాబందు జాతులున్నాయి. వాటన్నింటినీ అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంస్థ అంతరించే ప్రమాదం ఉన్న జాబితాలో చేర్చింది. ఆఫ్రికా, యురేషియాలలో విష ప్రభావం, గాలి మరలను ఢీకొట్టడం వల్ల అత్యధిక సంఖ్యలో రాబందులు మృత్యువాత పడుతున్నాయి. ఆఫ్రికాలో వేటగాళ్లు చంపిన ఏనుగుల జాడను రాబందుల కదలికల ద్వారా అటవీ అధికారులు గుర్తిస్తారు. దాన్ని నివారించడానికి ఏనుగుల కళేబరాలపై విషాన్ని చల్లుతున్నారు. వాటిని భక్షించిన రాబందులు మృత్యువాత పడుతున్నాయి. బోట్స్‌వానా ఉత్తర ప్రాంతంలో 2019లో వెయ్యికి పైగా రాబందులు, కొన్ని గద్దలు మృతి చెందడానికి వేటగాళ్ల విష ప్రభావమే కారణమన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. డైక్లోఫినాక్‌కు ప్రత్యామ్నాయంగా వాడుతున్న కీటొప్రోఫెన్‌, ఎసిక్లొఫినాక్‌ వంటివి సైతం రాబందులకు హాని కలిగిస్తున్నాయని, వాటినీ నిషేధించాలని బాంబే నాచురల్‌ హిస్టరీ సొసైటీ ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

భారత ఉపఖండంలో రాబందులపై పరిశోధనకు, వాటికి పెను ముప్పుగా పరిణమిస్తున్న ఔషధాల నివారణకు పరస్పరం సహకరించుకోవాలని భారత్‌, పాకిస్థాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌ ఈ ఏడాది మేలో నిర్ణయించాయి. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో ‘ప్రాంతీయ ప్రకటన’ చేశాయి. జాతీయ వన్యప్రాణి బోర్డు రాబందుల సంరక్షణ ప్రణాళిక-2020-22ను ఆమోదించింది. ఉత్తర్‌ ప్రదేశ్‌, త్రిపుర, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడుల్లోనూ రాబందుల ప్రత్యుత్పత్తి కేంద్రాలను నెలకొల్పాలని ఆ ప్రణాళిక సూచించింది. ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక రాబందు భద్రతా జోన్‌ను ఏర్పాటు చేయాలని తెలిపింది. రాబందుల సంఖ్యను పెంచడానికి హరియాణా రాష్ట్రం పింజార్‌లోని జటాయు సంరక్షణ, ప్రత్యుత్పత్తి కేంద్రంలో బాంబే నేచురల్‌ హిస్టరీ సొసైటీకి చెందిన విభు ప్రకాష్‌, నిఖిత దంపతులు మూడు దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు. ‘వల్చర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా పేరొందిన విభు ప్రకాష్‌ను 2021లో ప్రతిష్ఠాత్మక ప్రాణిమిత్ర అవార్డుతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. ఆసియా రాబందుల పరిరక్షణ (సేవ్‌)సంస్థ సైతం వాటి భద్రతకు కృషి చేస్తోంది.