Movies

నాకో స్నేహితుడు దొరికాడు

నాకో స్నేహితుడు దొరికాడు

నాకో స్నేహితుడు దొరికాడు‘రొమాంటిక్‌’, ‘లక్ష్య’ చిత్రాలలో కథానాయికగా మంచి పేరు తెచ్చుకొంది కేతికా శర్మ. ఇప్పుడు ‘రంగ రంగ వైభవంగా’లో వైష్ణవ్‌ తేజ్‌ సరసన నటించింది. గిరీశాయ దర్శకత్వం వహించిన చిత్రమిది. సెప్టెంబరు 2న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో కేతిక విలేకరులతో మాట్లాడింది. ‘‘రొమాంటిక్‌, లక్ష్య.. ఈ రెండు సినిమాలూ నాకు గొప్ప అనుభవాన్ని అందించాయి. సెట్లో ఎలా ఉండాలి? కెమెరా ముందు ఎలా ప్రవర్తించాలి? అనే విషయాలు అర్థమయ్యాయి. ‘రంగ.. రంగ’ పూర్తిగా కొత్త అనుభూతి ఇచ్చింది. మంచి మనుషుల మధ్య పని చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాతో నాకు తెలిసింది. వైష్ణవ్‌ తేజ్‌ రూపంలో నాకు మంచి స్నేహితుడు దొరికాడు. తను చాలా మంచి నటుడు. వినయంగా ఉంటాడు. మంచి సలహాలు అందిస్తాడు. ఈ సినిమాలో నేను రాధ అనే అమ్మాయి పాత్రలో కనిపిస్తా. ఆ పాత్రని తీర్చిదిద్దిన విధానం నాకు బాగా నచ్చింది. ఈ సినిమాలో స్టెప్పులు వేసే అవకాశం పెద్దగా రాలేదు. కాకపోతే… మంచి పాటలు దొరికాయి. అరకులో తెరకెక్కించిన పాట చాలా బాగా వచ్చింది. నాకు ఫలానా పాత్రలే చేయాలని అని లేదు. ఎలాంటి కథలొచ్చినా చేయడానికి సిద్ధమే. జయాపజయాల గురించి పట్టించుకోను. నా పని నేను చేసుకుంటూ వెళ్తా. ఏదైనా బయోపిక్‌లో నటించాలని ఉంది. చూద్దాం.. ఆ అవకాశం ఎప్పుడు వస్తుందో’’ అని చెప్పుకొచ్చింది కేతిక.