NRI-NRT

Rishi Sunka: వెన్నుపోటు పొడిచాడు…ఓడిపోయాడు.

Rishi Sunka: వెన్నుపోటు పొడిచాడు…ఓడిపోయాడు.

నాయకత్వ పోటీలో తనను తాను ‘చిత్తశుద్ధి’ ఉన్న అభ్యర్థిగా నిలబెట్టుకోవాలని సునాక్ శతవిధాల ప్రయత్నించారు. కానీ, వెన్నుపోటుదారుడనే ముద్ర ఆయన్ని ముందుకు పోనివ్వలేదు. టోరీ సభ్యుల్లో ఎక్కువ మంది బోరిస్‌ జాన్సన్ విధేయులు కావడం.. పైగా ఛాన్సలర్‌గా రాజీనామా చేస్తూ రిషి సునాక్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించడంతో అసలు కథ మొదలైంది. రాజకీయ గురువు సమానుడు.. సీనియర్ రాజకీయ నాయకుడిగా ఎదిగేందుకు కారణమైన వ్యక్తిని(బోరిస్‌ జాన్సన్‌)కు వెన్నుపోటు పొడిచాడంటూ టోరీ సభ్యులు రిషి సునాక్‌పై ఆరోపణలు గుప్పించారు. అయితే.. దేశ ఆర్థిక విధానంపై తనకు, జాన్సన్‌కు మధ్య పెద్ద అభిప్రాయ భేదం ఉందని స్పష్టమైన తర్వాతే తనకు వేరే మార్గం లేకుండా పోయిందని రాజీనామాపై సునాక్ ప్రతిస్పందించారు. కానీ, ఆ సమయంలోనే దాదాపు రిషి సునాక్‌ ఓటమి ఖాయమైంది. రిషి సునాక్‌ మంచి సేల్స్‌మ్యాన్‌.. వెన్నుపోటుదారుడు.. మోసగాడు.. ఈ విమర్శలు చేసింది టోరీ సభ్యులే. తన రాజీనామా ప్రకటన తర్వాత తాత్కాలిక ప్రధానిగా ప్రకటించుకున్న బోరిస్‌ జాన్సన్‌.. ‘‘ప్రధాని ఎన్నికల్లో ఎవరికైనా ఓటేయండి.. సునాక్‌కు తప్ప’’ అంటూ ఇచ్చిన పిలుపు టోరీ సభ్యుల్లోకి బలంగా దూసుకెళ్లింది. ఒక్కసారి వెనక్కి వెళ్తే.. జులై నెలలో బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభ తలెత్తింది. ఆ సమయంలో విపక్షం నుంచే కాకుండా సొంత పార్టీ కన్జర్వేటివ్‌ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు బోరిస్‌. సాజిద్‌ జావిద్‌, రిషి సునాక్‌లాంటి వాళ్ల రాజీనామా తర్వాతే.. చాలామంది ఆ బాటలో పయనించారు. సుమారు 50 మంది రాజీనామాలు చేయడంతో.. ఒత్తిడికి తలొగ్గి రాజీనామా చేశారు బోరిస్‌ జాన్సన్‌. బ్రెగ్జిట్‌ సమయంలో, కరోనాను కంట్రోల్‌ చేయడం, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంలో కీలక పాత్ర పోషించడం లాంటి చర్యలతో బోరిస్‌పై సింపథీ క్రియేట్‌ అయ్యింది. అదే ఎన్నికల ప్రచారంలో రిషి సునాక్‌కు మైనస్‌ అయ్యింది. ప్రధాని పదవి రేసులోకి ఎంటర్‌ అయిన వెంటనే ఆలస్యం చేయకుండా.. ‘రెడీ ఫర్‌ రిషి’ నినాదంతో 10 డౌనింగ్‌ స్ట్రీట్‌(బ్రిటన్‌ ప్రధాని అధికారిక నివాసం) వైపు ఉరుకులు మొదలుపెట్టాడు. ఇది చూసి చాలామంది.. ‘‘తన లక్ష్యం(ప్రధాని కావాలనే..) కోసమే జాన్సన్‌ను రాజీనామా వైపు నెట్టేశాడని చర్చించారు టోరీలు. ఇది ద్రోహమని ఫిక్స్‌ అయిపోయారు. ఈ అభిప్రాయం వల్ల.. నలుగురు మాజీ చీఫ్‌ విప్‌లు ప్రచారం చేసినా రిషి సునాక్‌కు ప్రయోజనం లేకుండా చేసింది. అదే టైంలో.. ట్రస్‌ తనను తాను ‘నిజాయితీ పరురాల’నే ప్రచారం చేసుకుంది. బోరిస్‌ జాన్సన్‌కు నమ్మినబంటునని, తానే ప్రధానినైతే 2019 మేనిఫెస్టో అమలు చేస్తానని ఇచ్చిన హామీలు ట్రస్‌కు బాగా కలిసొచ్చాయి.

*** వివాదాలు..
బ్రిటన్‌ ప్రధాన మంత్రి పదవి అనే టాప్‌ జాబ్‌ రేసులోకి ఎంటర్‌ కాకముందే నుంచే.. సునాక్‌ చుట్టూ కొన్ని వివాదాలు నెలకొన్నాయి.
► ఆర్థిక మంత్రిగా ఉన్న టైంలో(ప్రత్యేకించి కరోనా సమయంలో..) ఆయన తీసుకున్న నిర్ణయాలు విమర్శలు దారి తీశాయి. ఎంతలా అంటే.. సొంత పార్టీ నేతలే ఆ నిర్ణయాలను తప్పుబట్టేంతగా.
► భార్య అక్షత మూర్తి ఆస్తులు, వ్యాపార లావాదేవీలు, పన్నుల చెల్లింపుల విషయంలో కూడా ప్రతిపక్ష లేబర్‌ పార్టీ విమర్శలు గుప్పిస్తూ వచ్చేది. ఇది సొంతపార్టీ కన్జర్వేటివ్‌కు విసుగు తెప్పించింది.
► కరోనా టైంలో శాస్త్రవేత్తలపై నోరు పారేసుకున్నారు రిషి సునాక్‌. వ్యాక్సిన్‌ తయారీ వంకతో సైంటిస్టులు ఎక్కువ అధికారం చెలాయిస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సైంటిస్టు కమ్యూనిటీల నుంచి తీవ్ర వ్యతిరేకతను కట్టబెట్టింది.
► నార్త్‌ యార్క్‌షైర్‌లో ఉన్న తన మాన్షన్‌లో భారీగా ఖర్చు చేపట్టి రిషి సునాక్‌ స్విమ్మింగ్‌ పూల్‌ నిర్మాణం చేపట్టడంపై దుమారం రేగింది. నీటి కొరత ఉన్న సమయంలో.. పైగా ఆ ప్రాంతంలో స్విమ్మింగ్‌పూల్స్‌ను మూసేసిన టైంలో సునాక్‌ చేసిన పని వివాదాస్పదంగా మారింది.