Politics

నిన్న గోడ దూకాడు.. నేడు పదవి కొట్టేశాడు.

నిన్న గోడ దూకాడు.. నేడు పదవి కొట్టేశాడు.

అదృష్టం అంటే గంజి చిరంజీవిదే: అలా పార్టీలో చేరాడు.. ఇలా కీలక పదవి

ఆంధ్ర రాష్ట్ర చేనేత విభాగ అధ్యక్షుడు గా నియామకం

గుంటూరు:
గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గంజి చిరంజీవి నిజంగా అదృష్టవంతుడే. మొన్నటికి మొన్న తీవ్ర ఆవేదనతో తెలుగుదేశం పార్టీని వీడిన ఆయన అధికార పార్టీలో చేరారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌పై తనను అన్యాయం చేశారంటూ అప్పట్లో ఘాటు విమర్శలు గుప్పించారు. వెనుకబడిన సామాజిక వర్గ నాయకుడినైనప్పటికీ, సుదీర్ఘకాలంగా పార్టీలో పని చేస్తోన్నప్పటికీ- తనను రాజకీయంగా ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు.
సొంత పార్టీలో నిరాదరణ..
2014 అసెంబ్లీ ఎన్నికల్లో సొంత టీడీపీ నాయకులే తనను ఓడించారని, రాజకీయంగా హత్య చేశారని కన్నీరు పెట్టుకున్నారాయన అప్పట్లో. 2019లో నారా లోకేష్ కోసం తాను టికెట్‌ను త్యాగం చేశానని, అయినప్పటికీ కనీస గౌరవం దక్కట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో తనకు ఎలాంటి చెడ్డ పేరు లేదని, వివాదారహితుడిగా ఉన్నానని వ్యాఖ్యానించారు. తనను కాదని- మంగళగిరిలో స్థానికేతరులను చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ప్రోత్సహించారని విమర్శించారు. పార్టీకి దూరం..
మంగళగిరిలో తనకు రాజకీయంగా ఎలాంటి భవిష్యత్ లేకుండా చేశారని మండిపడ్డారు. బీసీలకు కంచుకోటగా ఉంటూ వచ్చిన మంగళగిరి నియోజకవర్గంలో చేనేత వర్గాలకు స్థానం లేకుండా చేశారని ధ్వజమెత్తారు. అయినా తాను ఎంతో ఓర్పుగా ఉన్నానని, రాజకీయాల్లో ఇవన్నీ సహజమేనని భరిస్తూ వచ్చానని చెప్పారు. పదవులు ఆశించకుండా మంగళగిరి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడానికి కష్టపడి పని చేశానని, అయినా తనను చంద్రబాబు, నారా లోకేష్ దూరంగా ఉంచారని అన్నారు.

జగన్ సమక్షంలో..
టీడీపీకి గుడ్‌బై చెప్పిన అతి కొద్దిరోజుల్లోనే ఆయన తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆయన సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. బీసీలతో పాటు అన్ని సామాజిక వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పని చేస్తోందని, కులం, మతం, ప్రాంతం.. చివరికి పార్టీ అనే తేడా కూడా లేకుండా సంక్షేమ పథకాల ఫలాలను అందిస్తోందని చిరంజీవి చెప్పారు. అందుకే తాను వైఎస్ఆర్సీపీలో చేరాననీ వివరించారు. కీలక పదవి..
అప్పట్లో ఇచ్చిన హామీ మేరకు వైఎస్ జగన్.. గంజి చిరంజీవికీ కీలక బాధ్యతలను అప్పగించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షుడిగా నియమించారు. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఆయనను చేనేత విభాగం అధ్యక్షుడిగా నియమించడం పట్ల ఓ మంచి గుర్తింపు లభించిందనే అభిప్రాయం మంగళగిరిలో వ్యక్తమౌతోంది. శుభాకాంక్షలు తెలుపుతూ గంజి చిరంజీవి పేరు మీద మంగళగిరిలో విస్తృతంగా బ్యానర్లు వెలిశాయి.

గట్టిపట్టు..
మంగళగిరి నియోజకవర్గం పరిధిలో బీసీ సామాజిక వర్గం ఓటర్లు పెద్ద సంఖ్యలో నివసిస్తోన్నారు. వారిలో మెజారిటీలు పద్మశాలీయులే. ఇప్పుడదే సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవి రాకతో వైఎస్ఆర్సీపీ మరింత బలోపేతమైనట్టే. అదే సమయంలో ఆయనను పార్టీ చేనేత విభాగం అధ్యక్షుడిగా నియమించడం అదనపు బలంగా మారినట్టయింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ పోటీ చేసి, ఓడిపోయిన ఈ నియోజకవర్గంలో వైసీపీ పట్టు మరింత పెరిగినట్టయింది.