NRI-NRT

హాంగ్ కాంగ్ లో వైభవంగా దసరా-బతుకమ్మ

హాంగ్ కాంగ్ లో వైభవంగా దసరా-బతుకమ్మ

ప్రపంచవ్యాప్తంగా భారతీయులు దసరా శరన్నవరాత్రులు ఎంతగానో ఇష్టంగా ఎదురుచూసే పండుగా అని చెప్పవొచ్చును . లలితా పారాయణం, బొమ్మల కొలువు, పేరంటాలు, గర్భాలు, దాండియా ఆటలతో పాటు బతుకమ్మ సంబరాలు కూడా విశిష్ట స్థానాన్ని పొందాయి. ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు శరన్నవరాత్రులు – దసరా (విజయ దశమి) మరియు బతుకమ్మ పండుగలు జరుపుకుంటారు.

శరన్నవరాత్రులు, తొమ్మిది రోజులలో, రోజు ఉదయం మరియు సాయంత్రం, ఎవరిoటీలో లలిత పారాయణం చేస్తారు అంటూ, ఈ నవరాత్రులలో అమ్మవారు ఏ రోజు ఏ రూపంలో దర్శనమిస్తారు, ఏ రంగు అమ్మవారికి ఇష్టం.. ఎలాంటి నైవేజ్యం పెట్టాలి..ఇటువంటి వివరాలతో ఒక పట్టికను తయారు చేస్తారు, హాంగ్ కాంగ్ లాంటావ ద్వీపంలోని తుంగ చుంగ్ ‘లలిత సహస్రనామం చాoటింగ్ గ్రూప్’. ఆ ప్రకారంగా వారు ప్రతి ఇంటా ఘనంగా అమ్మవారిని అందంగా అలంకరించి, మనసారా కొలిచి, అమ్మకు ప్రీతికరమైన నైవేద్యాలు  పెడతారు. విచ్చేసిన ఆడపడుచులందరు పారాయణానికి వెళ్తూ, పూలు పండ్లు కాకుండా వారి శక్తికొలది ఒక డొనేషన్ బాక్స్ లో ధనాన్ని వేస్తారు. నవరాత్రులు పూర్తయ్యాక ఆ డబ్బులని మన దక్షిణ రాష్ట్రాలలోని ఏదైనా ఒకటి రెండు వృద్ధాశ్రమానికి లేదా అనాధ పిల్లల ఆశ్రమానికి విరాళంగా ఇస్తారు. ఈ గ్రూప్ ను ప్రారంభించిన శ్రీమతి సంధ్య గోపాల్ మాట్లాడుతూ ఇలా తామందరు కలసి మానవ సేవ – మాధవ సేవ చేసుకోగల్గుతున్నందుకు ఎంతో తృప్తిగా ఆనందంగా అనిపిస్తోందని అన్నారు. బతుకమ్మ (గౌరి) పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. అంటే బెంగాలీ వారు దుర్గాష్టమి నాడు ఘనంగా వేడుక చేసుకున్నట్లు, తెలుగింటి ఆడపడుచులు సద్దులబతుకమ్మ వేడుకలు జరుపుకొంటారు.

ఈ శుభకృత నామ సంవత్సరం, ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య  ఆడపడుచులు, స్థానికంగా ఉన్న కఠినమైన కోవిడ్ నిబంధనలను పాటిస్తూ, ఎంతో వుత్సాహంగా సద్దుల బతుకమ్మను ఆరాధిస్తు బతుకమ్మ ఆడారు అని సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి జయ పీసపాటి తెలిపారు. తమ సమాఖ్య మహిళా విభాగం “సఖియా” సంయుక్త కార్యదర్శి శ్రీమతి కొండ నాగ మాధురి, శ్రీమతి జెఖ అశ్విని రెడ్డి, మరియు సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి రమాదేవి సారంగా, శ్రీమతి హర్షిణీ పచ్ఛంటి అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించారని తమ సంతోషాన్ని వ్యక్త పరుస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సద్దుల బతుకమ్మ పండుగ మరియు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. హైద్రాబాద్ లో బతుకమ్మ సంబరాలు ఎంతో వైభావంగా రాష్ట్ర వ్యాప్తంగా జరగడం తనకి మరింత ఉత్సాహాన్నిచ్చిందని, తన బంధు మిత్రులతో కలిసి ఆనందంగా బతుకమ్మ ఆడారని, అందమైన బొమ్మల కొలువులు చూశానని, లలిత దేవి పారాయణం – పేరoటాలకి వెళ్లానని చెప్పారు. చాలా కాలం తరువాత హైద్రాబాద్ లో ఈ పండుగ చేసుకోవడం ఒక మరపురాని మధుర జ్ఞాపకంగా ఉంటుందని ఆనందoగా తెలిపారు. త్వరలో తమ సమాఖ్య దీపావళి వేడుకలని ఘనంగా చేసే ఏర్పాట్లు చేస్తోందని సంతోషంగా ప్రకటించారు.