Devotional

ఇక తిరుపతిలోనే వసతి బుకింగ్. శ్రీవారి హుండీ ఆదాయం ₹122కోట్లు.

ఇక తిరుపతిలోనే వసతి బుకింగ్. శ్రీవారి హుండీ ఆదాయం ₹122కోట్లు.

తిరుమలలో వసతి గదులు దొరకడం లేదని చాలా మంది భక్తులు ఫిర్యాదు చేశారని, అడ్వాన్స్‌డ్ దర్శన టికెట్లు, బ్రేక్‌ దర్శన టికెట్లు పొందిన భక్తులు తిరుపతిలో బసచేసి స్వామివారి దర్శనానికి రావాలని తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ ఉదయం తిరుమల అన్నమయ్య భవన్‌లో డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 28 మంది భక్తులు తమకు ఎదురైన సమస్యలను ఈవో దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తిరుమలలో ఉన్న గదుల కేటాయింపు వ్యవస్థను తిరుపతిలో చేపట్టాలని నిర్ణయించాం. తద్వారా తిరుమలలో గదులు దొరకని భక్తులు తిరుపతిలోనే వసతి పొందే అవకాశం ఉంటుంది. త్వరలో ప్రయోగాత్మకంగా ఈవిధానాన్ని మొదలు పెడతాం. శ్రీవారి దర్శనార్థం కంపార్ట్‌మెంట్లలో రాత్రి వేళ నుంచి వేచి ఉండే సామాన్య భక్తులకు ఉదయం త్వరగా దర్శనం కల్పించేందుకు వీలుగా ఉదయం ఉన్న వీఐపీ బ్రేక్‌ దర్శన సమయాన్ని ఉదయం 10గంటలకు మార్పు చేసి ప్రయోగాత్మకంగా అమలు చేస్తాం. త్వరలో టైమ్‌స్లాట్‌ టోకెన్లను ప్రారంభిస్తాం, టోకెన్లు తీసుకున్న భక్తులు తిరుపతిలో గదులు పొంది రావాలి. పెరటాసి మాసం మూడో శనివారంతో పాటు వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. తిరుమలకు వచ్చే భక్తులకు దర్శనానికి దాదాపు 48 గంటల సమయం పడుతోంది. భక్తులు ఈవిషయాన్ని గమనించి సహకరించాలని కోరుతున్నాం. తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో సేవలందించే శ్రీవారి సేవకులు ఆయా మార్గాలను తెలుసుకునేందుకు వీలుగా రూపొందించిన క్యూ ఆర్‌ కోడ్‌ విధానం విజయవంతమైంది. భక్తుల కోసం త్వరలోనే తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తాం. లడ్డు విక్రయశాలలో కొన్నింటిలోనే లడ్డులు ఇవ్వడం వల్ల భక్తులకు సమయం పడుతోంది. అన్నింటిలోనూ లడ్డు విక్రయాలు చేసేలా చర్యలు చేపట్టాం. సెస్టెంబరు నెలలో 21.12 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. సెప్టెంబరు నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.122.19 కోట్లు కాగా, 98.44లక్షల లడ్డు ప్రసాదాల విక్రయం జరిగింది. 44.7లక్షల మంది అన్న ప్రసాదాలు స్వీకరించారు. గరుడ సేవ నాడు దాదాపు 3లక్షల మందికి పైగా భక్తులకు వాహనసేవ దర్శనభాగ్యం కల్పించాం. తితిదేలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, జిల్లా యంత్రాంగం, పోలీసులు, శ్రీవారి సేవకుల సమష్టి కృషి, భక్తుల సహకారంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతమయ్యాయి.