NRI-NRT

అమెరికా రియల్ రంగంలో దూసుకెళ్తున్న తెలుగోళ్లు

అమెరికా రియల్ రంగంలో దూసుకెళ్తున్న తెలుగోళ్లు

అమెరికా రియల్ ఎస్టేట్ రంగంలో ఇటీవలికాలంలో తెలుగు వారి పెట్టుబడులు పెరుగుతున్నాయి. అమెరికాలో దశాబ్దాల కిందట స్థిరపడి, ఎంత సంపన్నులుగా ఎదిగిన తెలుగువారికైనా, తమ సంపాదనను పెట్టుబడులుగా పెట్టాల్సి వస్తే, తిరిగి స్వదేశంలో మాత్రమే మదుపు చేయడం ఇంతవరకూ అలవాటు. కానీ ఆ సాంప్రదాయానికి బీటలు వారుతున్నాయి. అమెరికాలోని తెలుగు సంపన్నులు అక్కడి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో అమెరికా రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను శాసించే స్థాయికి తెలుగువారు చేరుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు.

అమెరికాలో ఎన్నారైలు, తెలుగు వారి పరిస్థితి గతంలో ఇలా ఉండేది కాదు. ఇక్కడి సంపన్నులు తమ సంపదను రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టడంపై దృష్టి సారించడం చాలా తక్కువ. అందరూ ఆతిథ్యరంగం, ఐటీ, ఇతర రంగాలలో పెట్టుబడులు పెడుతూ వచ్చారు. ఐటీ రంగంలో కూడా ఇటీవలి కాలంలో విస్తరించిన పెట్టుబడులే ఎక్కువ. కొన్ని దశాబ్దాలకు ముందునుంచి కూడా తెలుగువారు ప్రధానంగా ఆతిథ్యరంగంలోనే స్థిరపడ్డారు. తెలుగు ప్రజల ఉనికి ఉండే అన్ని ప్రధాన నగరాల్లో తెలుగువారు నిర్వహించే తెలుగుదనపు భారతీయ హోటళ్లు మనకు దర్శనమిస్తుంటాయి. ఈ పోకడలకు భిన్నంగా మనవారు ఇటీవలి కాలంలో రియల్ ఎస్టేట్ రంగంలోకి కూడా ప్రవేశించారు.

ఇక్కడి తెలుగు సంపన్నులు తమకోసం ఇల్లు కొనుక్కోవడం, అద్దెల ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని మరికొన్ని ఇళ్లు కొనడం ఎప్పటినుంచో ఉన్నది. అంతే తప్ప స్థలాల కొనుగోలు, విక్రయం, ఇళ్ల నిర్మాణం, విక్రయం లాంటి పనులను ఒక వ్యాపారంగా భావించి అందులోకి దిగిన వారు స్వల్పం. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు అనగానే వారి దృష్టి స్వదేశం మీదనే ఉండేది. అమెరికాలో ఆర్జించినా ఆ పెట్టుబడులను భారతదేశంలోనే పెట్టేవారు. తెలుగువాళ్లందరూ తెలుగు ప్రాంతాల్లోని రియల్ ఎస్టేట్ రంగంలో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. దానికి తగ్గట్టుగానే హైదరాబాదు, విశాఖ, తిరుపతి, గుంటూరు, అమరావతి తదితర అనేక ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం బాగా వర్ధిల్లింది.

ఇప్పుడు తెలుగువారి ‘రియల్’ పెట్టుబడులను అమెరికానే ఆకర్షిస్తోంది. తెలుగువారు, భారతీయులు ఎక్కువగా ఉండే హ్యూస్టన్, ఆస్టిన్, డాలస్ తదితర ప్రాంతాల్లో స్థానిక రియల్ వ్యాపార దిగ్గజాలకు పోటీగా వీరి రియల్ పెట్టుబడులు సాగుతున్నాయి. డాలస్‌లో 15వేల ఎకరాలు, ఆస్టిన్‌లో 20 నుంచి 30 వేల ఎకరాలు, హ్యూస్టన్‌లో 10వేల ఎకరాలకు పైగా ఇవాళ తెలుగువారి చేతుల్లో ఉన్నాయి. నాష్ విల్, అట్లాంటా, తాంపా, ర్యాలీ, మయామి, బోస్టన్, ఫీనిక్స్ వంటి పెద్దనగరాలలో సైతం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తెలుగువారు తమ సత్తా చూపుతున్నారు.

గతంలో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొందరు తెలుగువాళ్లు ప్రవేశించే ప్రయత్నం చేశారు. అయితే భారతీయులు డీల్ క్లోజ్ చేయరన్న ఒక అపప్రధ అమెరికా రియల్ రంగంలో ఉండేది. ఇప్పుడు భారతీయులు, ప్రత్యేకించి తెలుగువాళ్లు వేల ఎకరాలు కొంటూ రియల్ రంగంలో దూసుకుపోతూ ఉండడంతో అమెరికా వ్యాపార రంగంలో మన విలువ పెరిగింది. తెలుగువారి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది, అస్తిత్వం ఏర్పడింది. నిర్మాణ రంగంలో కూడా వీరి జోరు బాగుంది. గతంలో నిర్మాణం పూర్తయినవి ఒకటి రెండు యూనిట్లు కొనేవాళ్లు మాత్రమే ఉండేవాళ్లు. ఇప్పుడు వంద, రెండు వందల యూనిట్లు సొంతంగా నిర్మిస్తూ దూసుకుపోతున్నారు.

గతంలో తెలుగువారి పెట్టుబడులు ఎక్కువగా స్వదేశంలో తెలుగు ప్రాంతాల్లోనే ఉండేవి. ప్రత్యేకించి రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ వైపు చాలా మంది దృష్టి సారించారు. హైదరాబాద్ రియల్ రంగంలో ఒక దశ సంతృప్త స్థితి వచ్చిందని భావించిన వారంతా కూడా అమరావతిలో రాజధాని అనే సంగతి వెల్లడైన నాటినుంచి ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులకు ఉత్సాహం చూపించారు. అమరావతిలో రాజధాని నిర్మాణం పనులు కొద్దికొద్దిగా అయినా సాగుతూ ఉంటే వీరి పెట్టుబడులు ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు, ఏపీలోని ఇతర ప్రాంతాలకు కూడా అనేకం వచ్చి ఉండేవి. ఒక అంచనా ప్రకారం, సుమారు నలభై యాభై వేల కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు అమెరికాలోని తెలుగువారు సిద్ధంగా ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది. మూడు రాజధానుల ఆలోచనను ముందుకు తీసుకురావడంతో, ఎన్నారైల్లో పునరాలోచన వచ్చింది. పెట్టుబడుల ప్రవాహం ఆగిపోయింది. ఆ మూడు రాజధానులు కూడా సందిగ్ధంలో పడిన తర్వాత, అసలు ఏపీలో ఏ ప్రాంతంలో భూములు కొనాలన్నా కూడా వెనుకాడడం మొదలైంది. దానికితోడు అప్పటికే భూములు కొన్న వారికి కూడా కొత్త భయాలు, ఇబ్బందులు ఎదురయ్యాయి. భూములు ఆక్రమణలకు గురికావడం, బెదిరింపులు, హఠాత్తుగా ఎవరో తెరమీదకు వచ్చి తమ భూములను అడిగిన ధరకు అమ్మాలని బలవంత పెట్టడం వంటి ఇబ్బందులు మొదలయ్యాయి. మొత్తంగా చూసినప్పుడు, భారత్‌లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పెట్టుబడి అంటేనే అమెరికాలోని తెలుగువారు వణికిపోయే వాతావరణం ఏర్పడింది. తత్ఫలితంగానే, తమ వద్ద ఉన్న సంపదను ఎక్కడో ఒకచోట పెట్టుబడి పెట్టే ఆలోచనలో భాగంగా వారి దృష్టి అమెరికా రియల్ రంగంపై పడింది.

అమెరికాలో ఇవాళ భారతీయుల, తెలుగువారి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఈ స్థాయిలో వర్ధిల్లుతుండడానికి ప్రధాన కారణం ఏపీలో మారిన రాజకీయ స్థితి గతులే. నిన్నటి వరకు ఈ అస్థిరత, రాజధాని విషయంలో ముసుగులో గుద్దులాట లాంటి పోకడలతో స్తబ్ధంగా ఉండిపోయారు. కానీ.. ఇవాళ అమెరికాలో సమృద్ధిగా తమకు లాభసాటి వ్యాపార అవకాశాలను అందించినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. ఏపీ అభివృద్ధి మందగిస్తున్నదనే వేదన ఒక్కటే ఇప్పుడు వారికి మిగిలింది. అమరావతి రాజధానిగా స్థిరపడి, అభివృద్ధి జరుగుతూ ఉండిఉంటే.. ఎన్నారై పెట్టుబడులు అమరావతి పరిసర ప్రాంతాలతో పాటు, చాలా సహజంగా ఏపీలోని ఇతర ప్రధాన నగరాలకు కూడా వెల్లువెత్తి ఉండేవి. ఆ రకంగా, రియల్, నిర్మాణ, అనుబంధ రంగాలు గొప్పగా వర్ధిల్లుతుండేవి. కానీ, ఇప్పుడంతా స్తబ్ధతే ఆవరించింది. ఇష్టంతో నిమిత్తం లేకుండా అమెరికా రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ప్రవేశించిన వారు కూడా ఇవాళ వేల కోట్ల రూపాయల పెట్టుబడులు, టర్నోవర్‌లతో దూసుకెళుతున్నారు. రానున్న దశాబ్ద కాలంలో, యావత్ అమెరికాలోని రియల్ ఎస్టేట్ రంగంలో తెలుగువారు చాలా కీలకమైన పాత్ర పోషించే అవకాశం ఉంది. ఒకటి రెండు నిర్ణయాలు కేవలం ఒక రాష్ట్రంలోనే కాదు, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కూడా తెలుగువారి జీవన ముఖచిత్రాన్ని మార్చివేస్తుంటాయనడానికి ఇది చక్కని ఉదాహరణ!