Devotional

కార్తీక పౌర్ణమి విశిష్టత ఇదే!

కార్తీక పౌర్ణమి విశిష్టత ఇదే!

కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని హిందువులకు పరమ పవిత్రమైన రోజు. ఇది మహా శివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని ”త్రిపురి పూర్ణిమ”, ”దేవ దీపావళి” అని కూడా అంటారు. ఆశ్వయుజ అమావాస్య అంటే దీపావళి వెళ్ళిన మర్నాడు కార్తీకమాసం ప్రారంభమౌతుంది. ఇక ఆరోజు నుండి కార్తీకమాసం ముగిసేవరకూ ప్రతిరోజూ సాయంవేళ దీపాలు వెలిగించి సంరంభం చేస్తారు. ముఖ్యంగా కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ నెల అంతా కార్తీక మహా పూరాణాన్ని పారాయణం చేస్తారు. దేవాలయాల్లో కార్తీక పురాణ శ్రవణం ఏర్పాటు చేస్తారు. మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి. ప్రజలను నానారకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు. వెయ్యేళ్ళ రాక్షసుల పాలన అంతరించిన శుభసందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తున్నాయి. కార్తీక పౌర్ణమి అటు శివునికి, ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఈరోజున దీపం వెలిగిస్తే మనం తెలిసీ తెలీక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి. కార్తీక సోమవారాల్లో, కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు. ఈ విశిష్ట దినాన సత్యన్నారాయణ వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్ఠం. ప్రధానంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారు జామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయానే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.
*రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు. కొందరు దీపాలను అరటిదొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు. ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆ వీలు లేనివారు ఇంట్లోనే దేవునిముందు లేదా తులసికోట ఎదుట దీపం వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే. సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. కార్తీక పౌర్ణమినాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖసౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి. కార్తీక పౌర్ణమి జైనులకు, పంజాబీలకు కూడా విశిష్ట పర్వదినం. గురునానక్ జయంతి కూడా ఈరోజే. ఈ విశేష పర్వదినాన గంగా మహోత్సవం కూడా నిర్వహిస్తారు.

కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు ఎందుకు వెలిగిస్తారో తెలుసా?
కార్తీక మాసాన్ని ఎంతో పరమపవిత్రమైన మాసంగా భావిస్తారు.ఈ కార్తీకమాసం అంటే ఆ శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన నెల.ఈ నెలంతా దేవాలయాలలో మొత్తం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంటుంది.కార్తీకమాసంలో శివాలయాలలో ప్రత్యేక పూజలను నిర్వహించి శివనామస్మరణతో మారుమోగుతుంటాయి.ఈ నెల మొత్తం పూజలు, హోమాలు, వ్రతాలు, ఉపవాసాలు శుభకార్యాలకు ఎంతో ప్రసిద్ధి చెందినది.ఈ నెలలో వచ్చే పౌర్ణమి ఎంతో పవిత్రమైన పౌర్ణమి గా భావిస్తారు.కార్తీక పౌర్ణమి రోజు ఉదయం స్నానమాచరించి పెద్ద ఎత్తున భక్తులు దేవాలయాలను సందర్శించి దీపాలను వెలిగిస్తూ ఉంటారు.అయితే కార్తీక పౌర్ణమి రోజు రోజంతా ఉపవాసం ఉండి సంధ్యా సమయంలో 365 వత్తులను వెలిగించడం ద్వారా ఎంతో పుణ్య ఫలం దక్కుతుంది.సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి కాబట్టి, కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులను ఆవు నెయ్యి వేసి వెలిగించడం ద్వారా సంవత్సరం మొత్తం దీపారాధన చేసినంత పుణ్యఫలం దక్కుతుంది.
అయితే కార్తీక పౌర్ణమి రోజు దీపాలను కొందరు శివాలయంలో వెలిగిస్తారు.ఆ అవకాశం లేనివారు తులసికోట ముందు ఈ దీపాలను వెలిగించిన పుణ్య ఫలం దక్కుతుంది.అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.కార్తీక పౌర్ణమి రోజు శివాలయాలలో దీపారాధన చేయడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు మనకు దక్కుతాయి.శివాలయాలలో సహస్ర లింగార్చన, మహాలింగార్చన లు చేసినవారికి సర్వ శుభాలు కలుగుతాయని మన పురాణాలు తెలియజేస్తున్నాయి.స్త్రీలు కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసంతో సాయంత్రం దీపాలను ఆవు నెయ్యి తో వెలిగించి నదిలో వదిలి, ఒకరికొకరు తాంబూలాలను ఇచ్చిపుచ్చుకుంటారు.తరువాత చంద్ర దర్శనం చేసుకొని ఉపవాస దీక్ష విరమించుకుంటారు.ఇలా చేయడం ద్వారా దీర్ఘ సుమంగళీ ప్రాప్తి కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం.