DailyDose

TNI నేటి తాజా వార్తలు

TNI  నేటి తాజా  వార్తలు

*ఇబ్రహీంపట్నంలోని గురునానక్ కాలేజ్‌లో బీటెక్ చదువుతున్న విద్యార్థి వంశీ పటేల్ నాలుగు రోజుల క్రితం పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. కాంచన బాగ్ అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించాడు. ఈ సంఘటన చాలా దురదృష్టకరం. గురు నానక్ కాలేజీలో తరచుగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. దీనిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

*తెలంగాణలో బీజేపీకి నవంబర్ నెల సెంటిమెంట్ ఉంది. ఎందుకంటే.. 2020 నవంబర్ 10న జరిగిన ఉపఎన్నికలో దుబ్బాక ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థి రఘునందనరావు గెలుపొందారు. అలాగే 2021 నవంబర్ 2న హుజురాబాద్ బైపోల్స్‌లో ఈటల రాజేందర్ విజయం సాధించారు. దీంతో తాజాగా మునుగోడు ఉప ఎన్నిక ఫలితంపై తెలంగాణ బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేసిన విషయం తెలిసిందే.

*పరిగి మండలంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో కన్న కొడుకు తల్లిని తీవ్రంగా గాయపరిచి, తండ్రిని హత్య చేశాడు. నస్కల్‌ గ్రామానికి చెందిన మహేష్ మద్యానికి బానిసయ్యాడు. డబ్బుల కోసం నిత్యం కుటుంబసభ్యులను వేధించేవాడు.శనివారం తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. మొదట తల్లిపై దాడి చేశాడు. అనంతరం మల్లయ్య (65) తలపై కర్రతో విచక్షణా రహితంగా కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావంతో మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య జరిగిన విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే ఘటన స్థలికి చేరుకుని మల్లయ్య మృతదేహాన్ని శవపరీక్ష కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన మహేష్ తల్లిని ఆస్పత్రికి పంపారు. నిందితుడిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. మహేష్ గంజాయితో పాటు పలు వ్యసనాలకు బానిసగా మారి నిత్యం తల్లిదండ్రులతో గొడవ పడేవాడని స్థానికులు చెబుతున్నారు.

*దేశంలో ప్రజస్వామ్యం ప్రమాదంలో పడిందని, మోదీ ప్రభుత్వం దేశంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నదని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది, సామాజిక కార్యకర్త ప్రశాంత్‌ భూషణ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌లో ‘భారత వజ్రోత్సవాలు- సామాజిక మార్పు, ప్రజాస్వామ్య పురోగతి’ అనే అంశంపై సెమినార్‌ నిర్వహించారు. ఈ సెమినార్‌ను భారత ఆర్థికవేత్త సీహెచ్‌.హన్మంతరావు వర్చువల్‌గా ప్రారంభించారు. ప్రశాంత్‌ భూషణ్‌ మాట్లాడుతూ.. దేశంలో సమైక్యత స్ఫూర్తి దెబ్బతింటున్నదని, 75 శాతానికి పైగా అధికారాలు కేంద్రానికి ఉంటే 20 శాతం రాష్ట్రాలకు, ఐదు శాతమే స్థానిక సంస్థలకు ఉన్నాయన్నారు.

*కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో 11వ రోజు కొనసాగుతోంది. ఆదివారం మెదక్ జిల్లా, అల్లాదుర్గం మండలం, రాంపూర్ పెద్దమ్మ గుడి నుంచి ప్రారంభమైంది. ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి కామారెడ్డి జిల్లాలోకి ప్రవేశించనున్నారు. ఇవాళ అల్లాదుర్గం మండలం నుంచి పెద్దశంకరంరంపేట మండలంలోని చింతల్ లక్ష్మపూర్ వరకు రాహుల్ పాదయాత్ర సాగనుంది. చింతల్ లక్ష్మపూర్‌లో భోజన విరామం తీసుకుంటారు. తిరిగి నాలుగు గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది. సాయంత్రం 7 గంటలకు ఉమ్మడి మెదక్ జిల్లా దాటి కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం, పెద్దకొడపగల్‌కు చేరుకుంటారు. రాత్రి ఇక్కడే రాహుల్ బసచేస్తారు.

*రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వైఖరి అనుమానాస్పదంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ప్రెస్ నోట్ విడుదల చేశారు. టీఆర్ఎస్ లీడ్ వస్తే తప్ప సీఈవో రౌండ్ల వారీగా ఫలితాలను (munugode elections results) అప్ డేట్ చేయడంలేదని ఆరోపించారు. బీజేపీ లీడ్ వచ్చినప్పటికీ ఫలితాలను వెల్లడించడంలేదన్నారు. మొదటి, రెండు రౌండ్ల తరువాత మూడు, నాలుగు రౌండ్ల ఫలితాలను ( అప్ డేట్ చేసేందుకు జాప్యానికి కారణాలేమిటో సీఈవో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాల వెల్లడిలో ఎన్నడూ లేనంత ఆలస్యం ఇప్పుడే ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. మీడియా నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను ఎందుకు వెల్లడించడం లేదని నిలదీశారు. ఫలితాల విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు

*టర్ నొయిడాలో జరుగుతున్న ఇండియా ఎక్స్‌పో మార్ట్ ముగింపు రోజైన శనివారంనాడు ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్‌ (Jagdeep Dhankar)కు కల్పించాల్సిన భద్రత విషయంలో లోపం తలెత్తింది. ముగింపు వేడుకకు హాజరయ్యేందుకు వచ్చిన సమయంలో ఆయనకు సెక్యూరిటీ కల్పించాల్సిన 15 మంది పోలీసు సిబ్బంది ఆబ్సెంట్ (Absent) అయ్యారు. సెక్యూరిటీ విధుల్లో ఉండాల్సిన సిబ్బంది విషయంలో డీసీపీ అభిషేక్ వర్మ వెంటనే ఆరా తీయగా, ఐటీ సెల్‌కు చెందిన ఒక ఇన్‌స్పెసక్టర్, ఒక సబ్ ఇన్‌స్పెక్టర్, ఒక మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్, ఆరుగురు హెడ్ కానిస్టేబుళ్లు, నలుగురు మహిళా కానిస్టేబుళ్లు గైర్హాజరయ్యారని తెలిసింది. నిర్దేశిత సమయం కంటే ఆలస్యంగా వారు విధుల్లోకి రావడం గుర్తించారు. వెంటనే వీరికి కఠిన ఆదేశాలివ్వడంతో పాటు అబ్సెంటీస్ జాబితాను రిజిస్టర్ చేశారు.ఉపరాష్ట్రపతి రాక సందర్భంగా ఉన్నతాధికారులు గ్రేటర్‍ నొయిడాలో భారీ భధ్రతా ఏర్పాట్లు చేశారు. ఇండియా ఎక్స్‌పో మార్ట్ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. వాటర్ వీక్ ప్రోగ్రాంను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించగా, ముగింపు కార్యక్రమంలో జగ్‌దీప్ ధన్‌కర్, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు

* కైకలూరులో విద్యుధాఘాతంతో వ్యవసాయ కూలీ మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు మండవల్లి మండలం కొవ్వాడలంకకు చెందిన సైదు నాగరాజు (30)గా గుర్తించారు. కైకలూరు మండలం, నరసాయపాలెం ఓ రైతుకు చెందిన చేపల చెరువులో పట్టుబడికి కొవ్వాలంక కూలీలు వెళ్లారు. కూలీలకు చెందిన వ్యాన్‌లోని ఇనుప రాడ్డు తీస్తుండగా పైనున్న సర్వీస్ విద్యుత్ తీగలు తగిలి ఈ ప్రమాదం జరిగింది. సహచరులు హుటాహుటిన గుడివాడ ఆసుపత్రికి తరలిస్తుండగా నాగరాజు మృతి చెందాడు. మరో వ్యక్తి సైదు కుమార్ కాలికి తీవ్ర గాయం అవడంతో కైకలూరు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మృతుడు నాగరాజుకు భార్య, ఐదేళ్ల కుమార్తె, మూడేళ్ల కుమారుడు ఉన్నారు. కాగా ప్రమాద బాధితులు ఇద్దరు సొంత అన్నదమ్ములు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

*నందిగామలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పర్యటనలో రాళ్ల దాడిపై పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల స్వౌమ్య, టీడీపీ నాయకులు నందిగామ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా తంగిరాల సౌమ్య మాట్లాడుతూ పోలీసులు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని, దీని వేనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. తాడేపల్లి ఆదేశాలప్రకారం పోలీసు వ్యవస్థ నడుస్తోందని విమర్శించారు. సోషల్ మీడియా చిన్న పోస్ట్ పెడితేనే స్పందించే సిఐడి అధికారులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్‌పై జరిగిన రాళ్లదాడిపై ఎందుకు స్పందించరని తంగిరాల సౌమ్య ప్రశ్నించారు

*వరదల కారణంగా మూడు నెలలుగా నిలిచిపోయిన పాపికొండల విహారయాత్ర ఆదివారం తిరిగి పునఃప్రారంభమైంది. అధికారులు అనుమతి ఇచ్చారని ఏపీ టూరిజం టోటింగ్ అసిస్టెంట్ మేనేజర్ గంగబాబు ఈ మేరకు తెలిపారు. గండిపోశమ్మ ఆలయం వద్ద ఉన్న రెండు పర్యాటక బోట్లలో 106 మంది పర్యాటకులు పాపికొండల విహారయాత్రకు బయలుదేరారు. గోదావరి నదిలో ప్రయాణిస్తూ ప్రకృతి అందాలను వీక్షిస్తూ సాగే పాపికొండల విహారయాత్ర పర్యాటకులకు ఓ మధురానుభూతి కలుగుతుంది.

*మునుగోడు ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపు దిశగా వెళ్తున్నారు. మునుగోడులో విజేత ఎవరో దాదాపుగా తెలిసిపోయింది. ప్రభాకర్‌రెడ్డికే మునుగోడు ఓటర్లు జై కొట్టారు. ప్రతి రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. 12వ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 7440 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ 5398 ఓట్లు వచ్చాయి. 12వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ 2042 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఇక మూడు రౌండ్లు మాత్రమే ఉన్నాయి. ఈ మూడు రౌండ్లు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఓట్లు వస్తాయని గులాబీ పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు. మునుగోడులో గెలుపు దిశగా టీఆర్ఎస్ దూసుకుపోతోంది. దీంతో తెలంగాణ భవన్‌లో బాణాసంచా కాల్చి టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

* రామ కుప్పం మండలం, పీఎం తండాలో ఏనుగుల గుంపు స్వైర విహారం చేశాయి. రాగి, వరి పంటలను తిని.. తొక్కి పంటను నాశనం చేశాయి. ఏనుగుల గుంపు పంట పొలాలను నాశనం చేస్తున్నా.. అటవిశాఖ అధికారులు నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం గ్రామాల వైపు గానీ, దెబ్బతిన్న పంట పొలాలను చూడడానికి ఏ ఒక్క అధికారి రాలేదన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన పంట పొలాలకు నష్ట పరిహారం చెల్లించాలని పీఎం తండా గ్రామస్తులు డిమాండ్ చేశారు.
*గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారంనాడు వల్సద్ జిల్లాలో జరిగే రోడ్‌షో పాల్గొన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత స్వరాష్ట్రంలో మోదీ పర్యటించనుండటం ఇదే ప్రథమం. ప్రధాని తన పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 5.45 గంటలకు సామూహిక వివాహ కార్యక్రమంలో పాల్గొంటారు. భావ్‌నగర్‌లో జరుగనున్న ‘Papa NI Pari’ లగ్నోత్సవ్-2022కు హాజరవుతారు. తండ్రులు లేని 500 మందికి పైగా అమ్మాయిలకు ఇక్కడ సామూహిక వివాహాలు జరుగనున్నాయి.కాగా, గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. అక్టోబర్ 13న అహ్మదాబాద్‌లో జరిగిన ‘గుజరాత్ గౌరవ్ యాత్ర’లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పాల్గొనగా, దీనికి ఒకరోజు ముందు మెహ్సానాలో ‘గుజరాత్ గౌరవ్ యాత్ర’కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జెండా ఊపి ప్రారంభించారు. అక్టోబర్ 12న ప్రధాన మంత్రి రాజ్‌కోట్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలవో పాల్గొని, ర్యాలీ అనంతరం రోడ్‌షో నిర్వహించారు. అమోద్, బరౌచ్‌లో రూ.8,000 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. జంబుసార్‌లో బల్క్ డ్రగ్ పార్క్‌కు శంకుస్థాపన చేశారు.

*మునుగోడులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపు ఖరారైంది. రెండు, మూడు రౌండ్లు మినహా ప్రతి రౌండ్‌లోనూ కారు గుర్తుకు స్పష్టమైన ఆధిక్యం లభించింది. ఇప్పటి వరకు 12వ రౌండ్లకు సంబంధించి కౌంటింగ్‌ పూర్తయ్యింది. ఇప్పటి వరకు దాదాపు 7వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో టీఆర్‌ఎస్‌ కొనసాగుతున్నది. మరో మూడు రౌండ్ల కౌంటింగ్‌ మిగిలి ఉండగా.. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కౌంటింగ్‌ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.

*తెలంగాణ భ‌వ‌న్‌లో టీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు మొద‌ల‌య్యాయి. మునుగోడు ఉప ఎన్నిక ఫ‌లితంలో టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయ‌మ‌వ‌డంతో.. పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు సంబురాలు చేసుకుంటున్నారు. ప‌టాకులు కాల్చుతూ ఆనందోత్స‌హాల్లో మునిగి తేలుతున్నారు. స్వీట్లు పంచుకుని ఎంజాయ్ చేస్తున్నారు. జై తెలంగాణ నినాదాలు, జై కేసీఆర్, జై బీఆర్ఎస్, జై భార‌త్ నినాదాల‌తో తెలంగాణ భ‌వ‌న్ ద‌ద్ద‌రిల్లిపోతోంది. గులాబీ జెండాలు రెప‌రెప‌లాడుతున్నాయి. బీఆర్ఎస్ బ్యాన‌ర్లు ఆక‌ర్షిస్తున్నాయి.

* కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. మండలంలోని రామచంద్రాపురం గ్రామానికి చెందిన గంగాధర్‌ అలియాస్‌ సుధీర్‌ అనే యువకుడు బెంగళూరులో ఉద్యోగం చేస్తు రెండు రోజుల సెలవుల సందర్భంగా స్వగ్రామానికి వచ్చాడు. పొలం వద్దకు వెళ్లి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లిన కుమారుడు ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.

*బీజేపీ పాలిత కర్ణాటకలో దారుణం జరిగింది. మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారిని కారుతో ఢీకొట్టి హత్య చేశారు. సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. 82 ఏళ్ల మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి ఆర్‌కే కులకర్ణి శుక్రవారం సాయంత్రం మైసూరు విశ్వవిద్యాలయంలోని మానసగంగోత్రి క్యాంపస్‌లో ఈవినింగ్‌ వాక్‌ చేస్తున్నారు. ఇంతలో వేగంగా వచ్చిన ఒక కారు ఆయన మీదకు దూసుకెళ్లి ఢీకొట్టి వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆయన మరణించారు.

*రాష్ట్రంలో 24 ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీ కోసం సోమవారం పరీక్ష జరుగనుంది. దీనికోసం టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 56 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష ఉంటుంది. కంప్యూటర్‌ ఆధారిత రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (CBRT) పద్ధతిలో పరీక్ష జరుగుతున్నది.

* ‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వడ్లు కొనుమంటే చేతకాదు.. కానీ వందల కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను కొంటదట. ఎమ్మెల్యేలను కొంటం మీ ప్రభుత్వాన్ని పడగొడతామని బీజేపీ వాళ్లు కుట్రలు చేస్తున్నారు. ఇదంతా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. వారికి ప్రజలే తగిన గుణపాఠం, బుద్ధి చెప్తారు. ప్రభుత్వాలు ప్రజల కోసం పని చేయాలి తప్ప ఎమ్మెల్యేలను కొనే పని కాదు’ అంటూ బీజేపీపై ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. శనివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం సిద్దన్నపేట మార్కెట్‌ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం సిద్దిపేట పట్టణంలోని మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ చేశారు.

* ‘వద్దే వద్దు.. ఈ బీజేపీ సర్కారు. ఆ పార్టీకి ఓటేస్తే ధనవంతులకే లాభం. మాకు కాదు. అవినీతి సర్కారు అది. రైతులు, పేదలు, మధ్య తరగతికి ఆ పార్టీ చేసిందేమీ లేదు. వేరే పార్టీ అధికారం చేపట్టాల్సిందే’.. ఇదీ గుజరాత్‌లోని సగటు సామాన్య ఓటరు అభిప్రాయం. ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్‌లో డబుల్‌ ఇంజిన్‌ సర్కారు పట్ల పేదలు, మధ్య తరగతి ప్రజలు, గ్రామీణులు అనుకూలంగా లేరు. ఇటీవల ‘బీజేపీ సర్కారు’ పనితీరుపై గుజరాత్‌లో లోక్‌నీతి-సీఎస్‌డీఎస్‌ సంస్థ ప్రజాభిప్రాయం సేకరించింది. అందులో గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజల్లో మెజారిటీ ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నట్టు తేలింది. బీజేపీ సర్కారు సంపన్నులకే లాభం చేకూర్చేలా ఉందని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
* గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పుకొంటే జైల్లో ఉన్న తమ నేతను విడుదలచేస్తామని బీజేపీ ఆఫర్‌ ఇచ్చిందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్‌) జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ బాంబు పేల్చారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం వెల్లడించారు. ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌ను ఈడీ జైల్లో పెట్టిన విషయం తెలిసిందే. లిక్కర్‌ కుంభకోణంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాపై కూడా సీబీఐ కేసు నమోదుచేసింది.

*రాష్ట్రంలోని సాంఘిక, గిరిజన సంక్షేమ పాఠశాలలకు చెందిన 27 మంది విద్యార్థులు మాస్‌ మ్యూచువల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో ఉద్యోగాలు పొందారు. వారి విజయంపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు.ఆ విద్యార్థులతోపాటు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను, ఆ శాఖ కార్యదర్శి రొనాల్డ్‌ రోస్‌ను, సిబ్బందిని, మాస్‌ మ్యూచ్‌వల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ అధిపతి తంగిరాల రవిని ట్విట్టర్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌ అభినందించారు.

*దేశవ్యాప్తంగా ఉన్న కేవీ స్కూళ్లలో ఖాళీగా ఉన్న టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ (KVS) దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆసక్తి, అర్హత కలిగినవారు ఈనెల 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 4014 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో ప్రిన్సిపల్‌, వైస్‌ ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, సెక్షన్‌ ఆఫీసర్‌, ఫైనాన్స్‌ ఆఫీసర్‌ తదితర పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలను డిపార్ట్‌మెంట్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ (LDCE) ద్వారా ఎంపిక చేయనున్నారు.

*జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో పాటు చంద్ర‌బాబుపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అదిరిపోయే పంచ్‌లు విసిరారు…! రూ.250 కోట్ల సుపారీ ఇచ్చి ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను అంత‌మొందించే క్ర‌మంలో రెక్కీ నిర్వ‌హించార‌నే ప్ర‌చారంపై కొడాలి నాని సూప‌ర్ పంచ్ వేశారు…! అంత పెద్ద మొత్తంలో డ‌బ్బు ఇచ్చి ఏదైనా చేయ‌డం కంటే, ఆ మొత్తాన్ని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ప్యాకేజీ ఇస్తే ఈయ‌న వ‌చ్చి త‌మ ప‌క్క‌నుంటాడ‌ని సెటైర్ విసిరారు…! త‌మ కోసం తిరుగుతాడ‌ని ఘాటు విమ‌ర్శ చేశారు…!!గుడివాడ‌లో శ‌నివారం కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ చంద్ర‌బాబు… ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై విరుచుకుప‌డ్డారు…! ప‌వ‌న్‌, చంద్ర‌బాబు పొలిటిక‌ల్ టూరిస్టుల‌ని మండిప‌డ్డారు…! హైద‌రాబాద్‌లో రెక్కీ డ్రామా జ‌రిగినా సీఎం వైఎస్ జ‌గ‌న్‌కే సంబంధ‌మా…? అని ఆయ‌న ప్ర‌శ్నించారు…!రెక్కీ పేరుతో ప‌వ‌న్ గాలి మాట‌లు మాట్లాడాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. అప్పుడు విశాఖ‌లో, నేడు ఇప్ప‌టంలో ప‌వ‌న్ నానా హంగామా చేశార‌ని విమ‌ర్శించారు…!మునుగోడులో కేఏ పాల్ మాదిరిగా ఇప్ప‌టంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌రుగులు పెట్టార‌ని వెట‌క‌రించారు. మునుగోడులో కేఏ పాల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో ర‌క్తి క‌ట్టించిన‌ట్టు నాని చెప్పుకొచ్చారు. కేఏ పాల్ కంటే వెనుక‌బ‌డిపోయాన‌ని ప‌వ‌న్ ఇప్ప‌టం వెళ్లాడ‌ని చ‌మ‌త్క‌రించారు. షో అయిపోగానే రెండు గంట‌ల‌క‌ల్లా వెళ్లిపోయార‌ని ఆయ‌న అన్నారు…!ఏపీలో సంక్షేమ పాల‌న సాగుతుందే చంద్ర‌బాబుకు నిద్ర‌ప‌ట్ట‌డం లేద‌ని విమ‌ర్శించారు. రాష్ట్రంలో లేని స‌మ‌స్య‌ల‌ను ప‌వ‌న్‌, చంద్ర‌బాబు సృష్టిస్తున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ప‌వ‌న్‌, చంద్ర‌బాబు సొంత స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ని అన్నారు. వాళ్లిద్ద‌రికీ త‌మ రాజ‌కీయ జీవితం ఏమ‌వుతుంద‌నే అభ‌ద్ర‌తా భావం, భ‌యం, ఆందోళ‌న ఉన్నాయ‌న్నారు. జ‌గ‌న్ 30 ఏళ్లు ముఖ్య‌మంత్రిగా వుంటానంటున్నార‌ని, అదే జ‌రిగితే త‌మ ప‌రిస్థితి ఇక అంతేన‌ని భ‌య‌మ‌న్నారు..!!రాజ‌కీయంగా త‌మ‌ను తాము కాపాడుకునేందుకు జ‌గ‌న్‌తో పాటు వైసీపీ ప్ర‌భుత్వం మీద నింద‌లే వేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ప‌వ‌న్ ఇంటి వ‌ద్ద తాగుబోతులు హ‌డావుడి చేస్తే రెక్కీ అన్నార‌ని కొడాలి నాని చెప్పుకొచ్చారు. అలాగే చంద్ర‌బాబు త‌న‌పై గుల‌క‌రాయి విసిరార‌ని డ్రామా చేస్తున్నాడ‌ని మండిపడ్డారు. చంద్ర‌బాబే త‌న కార్య‌క‌ర్త‌ల‌తో రాయి వేయించుకున్న‌ట్టు కొడాలి విమ‌ర్శించారు. గుల‌క‌రాయితో కొడితే పోవ‌డానికి చంద్ర‌బాబు ఏమైనా పావుర‌మా..? పిట్టా..? అని ప్ర‌శ్నించారు…!! నువ్వు పోతే ద‌రిద్రం వ‌దులుతుంద‌ని సొంత పార్టీ వాళ్లే రాయి విసిరి వుంటార‌ని ఆయ‌న అన్నారు.ప‌వ‌న్‌క‌ల్యాణ్ రెక్కీ దెబ్బ‌కి చంద్ర‌బాబు క‌న‌ప‌డ‌కుండా పోయార‌న్నారు. దీంతో చంద్ర‌బాబు త‌న‌పై గుల‌క‌రాయి రెక్కీ చేశార‌ని గ‌గ్గోలు పెడుతున్నాడ‌ని మండిప‌డ్డారు. ప‌వ‌న్‌పై ప‌బ్ రెక్కీ అని అన్నారు. రూ.250 కోట్ల‌తో రెక్కీ అంటూ ప‌వ‌న్ గాలి మాట‌లు మాట్లాడుతున్నార‌ని త‌ప్పు ప‌ట్టారు. త‌మ‌ను తిర‌గ‌నివ్వ‌డం లేద‌ని, ప్ర‌జాస్వామ్యం ఖూనీ చేశార‌ని విమ‌ర్శించే చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌… ఇద్ద‌రూ క‌లిసి ఓ ప్ర‌జాస‌మ‌స్య‌పై పోరాటం చేసి వుంటే చెప్పాల‌ని కొడాలి నాని డిమాండ్ చేశారు.చంద్ర‌బాబు బాదుడే బాదుడ‌ని ఓ ప‌నికి మాలిన కార్య‌క్ర‌మం పెట్టార‌న్నారు. త‌న‌నే బాద‌మ‌న్నార‌నే ఉద్దేశంతో ఎవ‌రో రాయితో కొట్టార‌ని దుమ్ము రేపే సెటైర్‌ను విసిరారు. పెట్రోల్‌, గ్యాస్‌ ధరల పెంపుపై ప్రధాని మోదీని అడిగే దమ్ము పవన్‌, చంద్రబాబుకు లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఇడుపులపాయలో హైవే వేయాలంటే పవన్‌ ప్రధాని అవ్వాల‌ని ప‌వ‌న్‌కు కొడాలి సూచించారు. ప్రధాని అయ్యేందుకు పవన్‌.. కేఏ పాల్‌తో పోటీ పడుతున్నాడా..? అని వ్యంగ్యంగా ప్ర‌శ్నించారు…!!

* శాసనమండలి ఎన్నికల్లో సైతం వైసిపి ప్రభుత్వం అక్రమాలకు పాల్పడాలని చూస్తోందని టిడిపి ఎమ్మెల్సీ పి అశోక్‌ బాబు విమర్శించారు. టిడిపి కార్యాలయంలో శనివారం ఆ పార్టీ నేత ఎఎస్‌ రామకృష్ణతో కలిసి అశోక్‌బాబు మాట్లాడారు. ఈ ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్ల వ్యవస్థను ఉపయోగించరాదని ఎన్నికల సంఘం ఆదేశించినా ..దానికి విరుద్ధంగా రాష్ట్ర మంత్రి ఉషశ్రీ చరణ్‌ బహిరంగ ప్రకటనలు చేయడం దుర్మార్గమని ఆయన అన్నారు. చిత్తూరు ఓటర్ల నమోదుపై కూడా సిఎం కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేస్తూ అధికారులను ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు. ఈ అక్రమాలపైనా, అనంతపురం, నెల్లూరు డిఇఒల బదిలీపైనా ఇసికి ఫిర్యాదు చేస్తామన్నారు.
*హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ ఆదివారం విడుదల చేసింది. బీజేపీ తిరిగి మళ్లీ అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని బీజేపీ వాగ్దానం చేసింది. ఈ మేరకు సిమ్లాలో జరిగిన ‘బీజేపీ సంకల్ప్ పాత్ర2022’ కార్యక్రమంలో 11-పాయింట్ల మేనిఫెస్టోను బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ.నడ్డా విడుదల చేశారు. ఉమ్మడి సమాజం, యువత, రైతులకు సాధికారత, తోటల పెంపకానికి చేయూత, ప్రభుత్వ ఉద్యోగులకు తగిన న్యాయం, పర్యాటకానికి మరింత ఊతమివ్వడమే లక్ష్యంగా మేనిఫెస్టోని రూపొందించామని ఆయన చెప్పారు. గత ఐదేళ్ల పాలనలో వాగ్ధానం చేయని లక్ష్యాలను కూడా బీజేపీ సాధించిందని అన్నారు.