NRI-NRT

వేడెక్కుతున్న యూరప్‌… ఏడాదిలో 15వేల మంది మృత్యువాత..

వేడెక్కుతున్న యూరప్‌… ఏడాదిలో 15వేల మంది మృత్యువాత..

ఐరోపాలో వేడి విపరీతంగా పెరిగిపోతున్నది. ఫలితంగా ఈ సంవత్సరంలో 15వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. స్పెయిన్‌, పోర్చుగల్‌లో సుమారు 4వేల మంది, యూకేలో వెయ్యికిపైగా, బ్రిటన్‌లో 3,200, జర్మనీలో 4,500 మందికిపై మరణాలు నమోదయ్యాయని యూరప్ ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ హన్స్ హెన్రీ క్లూగే పేర్కొన్నారు. పలు దేశాల్లో మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఫ్రాన్స్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ అండ్‌ ఎకనామిక్స్‌ స్టడీస్‌ (INSEE) 2019లో (కరోనా మహమ్మారికి ముందు) జూన్‌ 1 – 22 ఆగస్టు 2022 మధ్య కాలంలో పోలిస్తే 11వేలు ఉన్నట్లు పేర్కొంది. జూన్‌ మధ్య హీట్‌వేవ్‌ కారణంగా మొదలైనట్లు ఐఎన్‌ఎస్‌ఈఈ గణాంకాలు పేర్కొన్నాయి. సాధారణంగా హీట్‌వేవ్స్‌ జూలైలో సంభవిస్తుంటాయి.

**వేడెక్కుతున్న యూరప్‌
ఐరోపాలో ఉష్ణోగ్రతలు 1961-2021 మధ్య కాలంలో గణనీయంగా పెరుగుతున్నాయి. సగటున దశాబ్దానికి 0.5 డిగ్రీల చొప్పున వేడి పెరుగుతున్నది. ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) ఈ వారం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. అత్యంత వేగంగా వేడెక్కుతున్న ప్రాంతం ఐరోపానే. ఈ ప్రాంతంలో గత 50 ఏళ్లుగా విపరీతమైన ఉష్ణోగ్రతల కారణంగా 1.48లక్షల మంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరప్‌ ప్రాంతీయ డైరెక్టర్‌ హన్స్‌ హెన్రీ పేర్కొన్నారు. ఒక్క ఈ ఏడాదిలో కనీసం 15వేల మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.

మరో వైపు వాతావరణ మార్పు సంఘటనలతో వందలాది మరణాలు నమోదవుతుండగా.. అర మిలియన్‌ కంటే ఎక్కువ మంది ప్రజలు నేరుగా ప్రభావితమయ్యారని చెప్పారు. ఈ ఘటనలో 84శాతం వరదలు, తుఫానులు కారణమని వెల్లడించారు. మారుతున్న వాతావరణ మార్పుల దృష్ట్యా, భవిష్యత్తు గురించి మనం అప్రమత్తంగా ఉండాలని ఇది ఒక సంకేతమని పేర్కొన్నారు. గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలను తక్షణమే తగ్గించేందుకు గతంలో జరిగిన ఒప్పందాలను అమలు చేసేందుకు ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పు సదస్సు (COP27) ఈజిప్టులోని షర్మ్‌ ఎల్‌ షేక్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రతినిధులు సమావేశమైన నేపథ్యంలో ఈ గణాంకాలు వెలుగులోకి వచ్చాయి.