Movies

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ జపాన్‌లో జైత్ర యాత్ర

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ జపాన్‌లో జైత్ర యాత్ర

జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన అద్భుత దృశ్యకావ్యం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఎన్నో వాయిదాల త‌ర్వాత మార్చి 25న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం వ‌సూళ్ళ ప్ర‌భంజ‌నం సృష్టించింది. ‘బాహుబ‌లి-2’ పేరిట ఉన్న ఎన్నో రికార్డుల‌ను బ్రేక్‌ చేసింది. ఒక్క తెలుగులోనే కాకుండా రిలీజైన ప్రతి భాషలో డబుల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో రామ్‌చ‌ర‌ణ్, ఎన్టీఆర్‌ల న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. రాజ‌మౌళి టేకింగ్, విజ‌న్‌తో మ‌రోసారి మాయ చేశాడు. ఈ సినిమాతో ఇండియాలో రెండు సార్లు 1000కోట్ల మార్కును ట‌చ్ చేసిన ఏకైక ద‌ర్శ‌కుడిగా రాజ‌మౌళి రికార్డు సృష్టించాడు. ఇక నైజాంలో 100కోట్ల షేర్ సాధించిన మొదటి సినిమాగా ‘ఆర్ఆర్ఆర్’ సరికొత్త రికార్డు సృష్టించింది. ఒక్క‌టేమిటీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రికార్డుల‌ను ట్రిపుల్ఆర్ సాధించింది.

ఇక ఇటీవలే ఈ చిత్రం జపాన్‌లో విడుదలైన విషయం తెలిసిందే. రిలీజ్‌కు వారం రోజుల ముందు నుండి ఆర్‌ఆర్‌ఆర్ బృందం ప్రమోషన్‌లు పెద్ద ఎత్తున జరపడంతో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి వారంలోనే 75M Yen(రూ.4 కోట్లను) కలెక్ట్‌ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. కాగా ఈ చిత్రం 17 రోజుల్లో 185M YEN(రూ.10 కోట్లకు పైగా) కలెక్షన్‌లు సాధించింది. జపాన్‌లో అతి తక్కువ సమయంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్‌ సినిమాగా సరికొత్త రికార్డు క్రియేట్‌ చేసింది. ఇక జపాన్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో ‘ముత్తు’ మొదటి స్థానంలో ఉండగా.. ‘బాహుబలి’ రెండో స్థానంలో ఉంది. మరి ఈ సారైనా ముత్తు రికార్డును ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బ్రేక్‌ చేస్తుందో లేదో చూడాలి.

బిగ్గెస్ట్‌ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం ఇండియాలో రూ.1200 కోట్ల వరకు కలెక్ట్‌ చేసింది. ఈ చిత్రంలో జూ.ఎన్టీఆర్‌ కొమురం భీమ్ పాత్ర‌లో న‌టించగా, చ‌ర‌ణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర‌లో న‌టించాడు. బాలీవుడ్ స్టార్ అజ‌య్ దేవ‌గ‌న్ కీల‌క‌పాత్ర‌లో న‌టించాడు. డివివి దాన‌య్య నిర్మించిన‌ ఈ చిత్రంలో అలియాభ‌ట్, ఒలీవియా మొర్రీస్‌లు కథానాయిక‌లుగా న‌టించారు.