NRI-NRT

ఇక భారతీయ విద్యార్థులకు చైనీస్ వీసాలు

ఇక భారతీయ విద్యార్థులకు చైనీస్ వీసాలు

కరోనా పరిమితులు ఉన్నప్పటికీ కనీసం 1,300 మంది భారతీయ విద్యార్థులు చైనీస్ వీసాలు పొందినట్లు సోమవారం ఆ దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఫారిన్ మినిస్ట్రీ అధికార ప్రతినిధి ఝావో లిజియన్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలియజేశారు. మహమ్మారి కారణంగా ఇరు దేశాల సరిహద్దుల వద్ద ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ 1,300 మంది భారత విద్యార్థులకు వీసాలు మంజూరు చేశామని అన్నారు. చైనీస్ విశ్వవిద్యాలయాలు భారతీయ విద్యార్థులకు ‘నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు (NOCs)’ ఆలస్యం చేస్తున్నాయి అని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు లిజియన్ ఇలా సమధానం చెప్పారు. అలాగే భారతీయ విద్యార్థులు తమ విశ్వవిద్యాలయాలతో ఎల్లప్పుడు కాంటాక్ట్‌లోనే ఉండాలని, వీలైనంత త్వరగా క్యాంపస్‌కు తిరిగి రావాలని ప్లాన్ చేసుకోవాలంటూ ఆయన సూచించారు.

“భారత విద్యార్థులు, చైనీస్ విశ్వవిద్యాలయాల మధ్య కమ్యూనికేషన్ కోసం ఛానెల్‌లు తెరిచి ఉన్నాయి. భారతీయ విద్యార్థులు వారి విశ్వవిద్యాలయాలతో ఎప్పుడూ టచ్‌లో ఉండాలి. వారి విశ్వవిద్యాలయాల ఏర్పాట్ల ప్రకారం క్యాంపస్‌కు తిరిగి రావడానికి ప్లాన్ చేసుకోవాలని మేము సూచిస్తున్నాము” అని లిజియన్ అన్నారు. ఇదిలాఉంటే.. అధికారిక నివేదికల ప్రకారం 40 చైనీస్ విశ్వవిద్యాలయాలు ఇప్పటికీ భారతీయ విద్యార్థులకు చైనీస్ వీసాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన ఎన్ఓసీలను (NOC) జారీ చేయలేదు. ఇది వేలాది మంది భారతీయ విద్యార్థులపై ప్రభావం చూపుతోంది. వీటిలో చాలా విశ్వవిద్యాలయాలు తమ అభ్యర్థనలకు సమాధానం ఇవ్వడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. అయితే, కొన్ని విశ్వవిద్యాలయాలు మాత్రం తమ ప్రాంతీయ ప్రభుత్వం (NOC)లు జారీ చేయకుండా ఆపివేస్తున్నాయని ఆరోపిస్తున్నాయి.