Devotional

నిగూడ కాశీపురిలో గంగాస్నానం…!! – TNI ఆధ్యాత్మికం

నిగూడ కాశీపురిలో  గంగాస్నానం…!! –  TNI ఆధ్యాత్మికం

ఈ భూమి ఆవిర్భవించిన సమయంలో సూర్యుని ప్రధమ కిరణం ప్రసరించిన స్ధలం కాశీ. అందువలన కాశీకి అశిముక్తం, ఆనందవనం, మహాశ్మశానం, వారణాశిమరియు బెనారస్ అనే పలు పేర్లు వున్నాయి. కాశీ అంటేనే ‘మహా ప్రకాశం’ అనే పేరు వుంది. దీపావళి రోజున కాశీలోని గంగానదిలో చేసే స్నానం వలన ఎంతో పుణ్యం లభిస్తుందని హైందవుల నమ్మకం. దీపావళికి మరుసటి రోజు వైభవంగా ఒక ఉత్సవం జరుపుతారు. ఆ రోజు కాశీ విశ్వనాధుని సన్నిధిలో, అన్నపూర్ణా దేవి సన్నిధిలో ధాన్యాలను, ప్రసాదాలను సమర్పిస్తారు. దీనిని ‘అన్న కుంభం’ అని అంటారు.
***కాశీ క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం.
ప్రళయకాలంలో పరమేశ్వరుడు ఈ నగరాన్ని తన శూలం మీద పెట్టి, రక్షిస్తాడని చెప్తారు.మోక్ష స్ధలాలుగా కీర్తిగాంచిన అయోధ్య, మధుర , మాయా, కాశీ , కాంచి , అవంతిక, ద్వారకా అని పలు పేర్లు చెప్పినా భగవంతుని లో లీనమయే ముక్తి కాశీలోనే లభిస్తుంది. ఇక్కడ, పరమేశ్వరుడు మరణించేవారి చెవిలో తారక మంత్రం ఉపదేశిస్తాడని చెప్తారు. బుధ్ధుడు జ్ఞానం పొంది శిష్యులకు ఉపదేశించినది సమీపంలో వున్న సారానాధ్ లోనే. కాశీ నుండి ఆరు కి.మీ దూరములో వున్నది.గంగోత్రిలో ఉద్భవించి, రుద్ర ప్రయాగలో, అలక్ నందా తో కలసి లక్ష్మణ ఝూలా వద్ద ప్రవేశించి, హరిద్వారలో ప్రవాహమై, ప్రయాగలో యమునతో కలసి త్రివేణి సంగమమై, కాశీకి ప్రవహించింది.దీపావళికి అన్నపూర్ణా దేవిని బంగారు అన్నపూర్ణగా అలంకరిస్తారు. ఒక హస్తంలో బంగారు పాత్ర మరియొక హస్తంలో బంగారుపు గరిటెతో యీ విశ్వానికే ఆహారాన్ని ప్రసాదించే ఆన్నపూర్ణాదేవికి ఇరుప్రక్కలా శ్రీ దేవి, భూదేవి స్వర్ణ విగ్రహ రూపాలలో దర్శనమిస్తుంటే, నవరత్నఖచిత కిరీటంతో అన్నపూర్ణా దేవి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ దర్శన భాగ్యాన్ని కలిగిస్తోంది.అన్నపూర్ణాదేవి చరణాల వద్ద ఆది శంకరాచార్యులవారు స్ధాపించిన శీ చక్ర మేరు యంత్రం వున్నది.
* ప్రక్కన భిక్షాటన మూర్తిరూపంలో వెండి విగ్రహంగా ఈశ్వరుడు చేతిలో కపాలంతో నిలబడిన దృశ్యం, అన్నపూర్ణాదేవి పరమేశ్వరునికి భిక్షను అందించినట్లు పురాణాలు చెప్తున్నాయి.అందువలననే విశ్వనాధుని ఆలయంలోను, అన్నపూర్ణా దేవి ఆలయంలోను, దీపావళి రోజున ఏ చోట చూసినా నవధాన్యాలు, పిండివంటలు దర్శనమిస్తాయి.ఉత్తమజాతి కలపతో చేసిన రధాన్ని పూర్తిగా లడ్డూలతో అలంకరించి, దానిపై అన్నపూర్ణాదేవిని ఆశీనురాలిని చేస్తారు. దీపావళినాడు భక్తులు,యాత్రీకులు దేవిని దర్శించడానికి అనేక ప్రాంతాల నుండి వస్తారు. కాశీ విశాలాక్షి ఆలయంలోను ఆ రోజు భక్తుల సందోహం ఎక్కువగానే వుంటుంది. దీపావళి నాలుగురోజులు మాత్రమే స్వర్ణ అన్నపూర్ణాదేవి దర్శనం భక్తులకు లభిస్తుంది.కాశీ విశ్వనాధునికి మనమే స్వయంగా పూజలు అభిషేకాలు చేయవచ్చును. ఈనాటి కాశీ విశ్వనాధుని ఆ‌లయం 1780వ సంవత్సరంలో , ఇండోర్ మహారాణి అహల్యాబాయి నిర్మించింది.1835వ సంవత్సరంలో పంజాబ్ మహారాజు ఒక టన్ను బంగారంతో గోపురానికి బంగార పూత పూయించాడు.
* 1841వ సంవత్సరంలో నాగపూర్ భోంస్లే కుటుంబంవారు గర్భగుడితో సహా మూడు ప్రవేశ ద్వారాలకి వెండి కవచం చేయించారు. పిదప నాలుగవ ద్వారానికి కవచం చేయించడమైనది.విశ్వనాథ ఆలయం గంటలు మ్రోగినప్పుడుఈ ఊరి జనులు తల వంచి వినయంగా వందనాలు ఆచరిస్తారు. నేపాల్ మహారాజు సమర్పించిన అతి పెద్ద గంట యీ ఆలయంలోవున్నది. కాశీకి వచ్చినవారు డుంఢి గణపతిని దర్శించి, తమరాకకి సాక్ష్యంగా వుండమని విన్నవించుకుంటారు. ఈ కాశీనగర రక్షణ దైవం కాలభైరవుడు. ఈ ఆలయంలో పూజారిభక్తుల చేతికి ఒక నల్ల త్రాడుకట్టి నెమలి ఈకలతో రాస్తాడు.కాశీలో అరవైనాలుగు స్నాన ఘట్టాలు వున్నా అసిఘాట్, దశాశ్వమేధ ఘాట్, పంచగంగా ఘాట్ మణికర్ణికాఘాట్, హనుమాన్ ఘాట్ మొదలైనవి ప్రసిధ్ధి చెందినవి. దశాశ్వమేధ ఘాట్ లో బ్రహ్మదేవుడు అశ్వమేధయాగం చేసి, ఈశ్వరునికి ఒక చిన్న ఆలయం నిర్మించినట్లు ఐహీకం. ఘాట్ లో దీపావళినాడు అనేక మంది యాత్రీకులు భక్తులు స్నానం చేస్తారు.గంగ ప్రవహించే స్ధలాల మధ్యలో మణికర్ణికా ఘాట్ వున్నది.
*త్రిపురభైరవి స్నాన ఘట్టానికి సమీపమున వారాహి అమ్మవారి ఆలయం వున్నది.కాశీలో గంగతో అసి, వారణ, దూధ్ పాప నది మరియు గిరానా నదులు కలుస్తున్నాయి. ఈ ఐదు నదులు కలసిన స్ధలాన్ని పంచగంగా తీర్ధం అని పిలుస్తారు. ఇక్కడే బిందు మాధవుని ఆలయం వున్నది.గంగ ఇక్కడ ప్రవహించడానికి ముందు శ్రీమహావిష్ణువు తన చక్రాయుధంతో, ఒక పెద్ద బావిని నిర్మించి, దానిని పవిత్ర జలంతో నింపాడు. పరమశివుడు వచ్చి, ఆ వేడుకను చూసినప్పుడు, ఆయన చెవి మకరకుండలం , ఆ గుండంలో పడిపోయింది.వవిష్ణువుల పేర్లతో ఖ్యాతి గాంచిన ఈ మణికర్ణికా ఘట్టంలో స్నానం చేయడం వలన మహా పుణ్యం లభిస్తుందని నమ్మకం. ఇక్కడ విష్ణుపాదాలు వున్నాయి.దీనికి సమీపమున శ్మశానం వున్నది. ఇక్కడ ఇరవై నాలుగు గంటలు శవాలను కాలుస్తారు. ఈ కార్యాన్ని విదేశీయులు వింతగా చూస్తారు.

2. రాజన్న సిరిసిల్ల వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయం మూతపడింది. చంద్రగ్రహణం కారణంగా మంగళవారం సాయంత్రం వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు. మధ్యాహ్నం 2.38 గంటల నుంచి చంద్రగహణం ప్రారంభంకానున్నది. ఈ క్రమంలో ఉదయం స్వామివారి ప్రాతఃకాల పూజలు నిర్వహించారు. ఆలయ ద్వారాలను మూసివేశారు.అలాగే అనుబంధ ఆలయాల్లోనూ పూజల అనంతరం ద్వారాలను మూసివేశారు. గ్రహణం ముగిసిన అనంతరం సాయంత్రం 6.18 గంటలకు ఆలయాన్ని తిరిగి తెరిచి పుణ్యహవచనం, సంప్రోక్షణ, నివేదన అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా రాత్రి ఆలయ ఆవరణలో జ్వాలాతోరణం నిర్వహించడంతో పాటు స్వామివారి మహాపూజ నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

3. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న తిరుమల శ్రీవారిని 74,094 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.4.52 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 21,475 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. కాగా.. నేడు చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని అధికారులు మూసివేయనున్నారు.