DailyDose

TNI నేటి తాజా వార్తలు

TNI  నేటి తాజా  వార్తలు

*అయోధ్య లో రామాలయ నిర్మాణం పనులు 2023 చివరికల్లా పూర్తవుతాయని, ప్రస్తుతం నిర్మాణం పనులు సగానికి పైగా పూర్తయ్యాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఆలయ నిర్మాణానికి సంబంధించిన బీజేపీ తొలి తీర్మానం పాలంపూర్‌లోనే ఆమోదించడం జరిగిందని గుర్తుచేశారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలంపూర్‌లో బీజేపీ అభ్యర్థి త్రిలోక్ కపూర్ తరఫున యోగి ఆదిత్యనాథ్ మంగళవారంనాడు ప్రచారం సాగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, అయోధ్యలో సగానికి పైగా పూర్తయిన ఆలయ నిర్మాణం 2023 చివరికల్లా పూర్తవుతుందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉందని అన్నారు. 500 ఏళ్లుగా ఎదురుచూస్తున్న భవ్య రామాలయ నిర్మాణం కల త్వరలోనే సాకారం కాబోతోందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్టుదల, పటిష్ట నాయకత్వంలో చరిత్రలో గుర్తిండిపోయేలా అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుతోందని అన్నారు.

*తమ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. దీనికి కారణం సంస్కరణలను జనం అర్థం చేసుకోలేకపోవడమేనని చెప్పారు. సంస్కరణలు చేసేవారికి వ్యతిరేకత ఎక్కువ ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. సంస్కరణలకు ముందే ఫలితాలురావు.. అందుకే ప్రజల ఆమోదం రాదన్నారు. సంస్కరణలతో ప్రజల్లో తొలుత వ్యతిరేకత వస్తుందని తెలిసినా… సీఎం జగన్ సంస్కరణల బాట పట్టారని పేర్కొన్నారు..

*రైతుల మహాపాదయాత్రలో పోలీసులు నమోదు చేసిన నాన్‌ బెయిలబుల్ కేసులో ముగ్గురు సెక్యూరిటీ గార్డులకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తూర్పుగోదావరి జిల్లా, రామచంద్రాపురంలో మహాపాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన సమయంలో వెంకటేశ్వరస్వామి మహారథంకు సెక్యూరిటీగా ఉన్న ముగ్గురు గార్డులపై పోలీసులు దాడి చేసి, తిరిగి వారిపైనే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని అమరావతి పరిరక్షణ సమితి హైకోర్టును ఆశ్రయించింది. న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ పరిరక్షణ సమితి తరపున వాదనలు వినిపించారు. సెక్యూరిటీ గార్డులపై పోలీసులు దాడి చేయడమే కాకుండా, హార్డ్ డిస్క్‌ కూడా తీసుకెళ్లారని, తిరిగి వారిపైనే కేసులు మోపారని వాదించారు. వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం ముగ్గురు సెక్యూరిటీ గార్డులకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

*సుల్తానాబాద్ మండలం, తోగర్రయి శివారులో కొండచిలువలు కలకలం రేపాయి. వరి పంట కోస్తున్న సమయంలో కొండచిలువలు ప్రత్యక్షమయ్యాయి. దాంతో రైతులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. వెంటనే వాటిని పట్టుకుని సమీప అటవీ ప్రాంతంలో వదిలేశారు. గ్రామ శివారులో గుట్టలు ఉండడంతోనే పొలాల్లోకి కొండచిలువలు వచ్చాయని రైతులు భావిస్తున్నారు. రైతులు జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు

*గుంటూరు జిల్లా ఇప్పటంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లు కూల్చివేతకు గురైన బాధితులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేయూతనందించారు. స్వయంగా ఇప్పటం వెళ్లి బాధితులను పరామర్శించి, వారి ఆవేదనను విన్న పవన్ తాజాగా వారికి లక్ష రూపాయాల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ విషయాన్ని జనసేన నేత నాదెండ్ల మనోహర్ మీడియాకు తెలియజేశారు. నాదెండ్ల మాట్లాడుతూ.. ఇప్పటం గ్రామంలో వైసీపీ ప్రభుత్వం దాష్టీకానికి ఇళ్ళు దెబ్బ తిన్నవారు, ఆవాసాలు కోల్పోయారన్నారు. పవన్ కళ్యాణ్ బాధితులకు లక్ష రూపాయలు సాయం ప్రకటించారని తెలిపారు. తన వంతున ఆర్ధికంగా అండగా నిలబడాలని తమ అధినేత నిర్ణయించారని అన్నారు. జనసేన ఆవిర్భావ సభకు ఇప్పటం వాసులు సహకరించారని, సభా స్థలిని ఇచ్చారని కక్షగట్టి ఇళ్లను కూల్చడం దుర్మార్గమని మండిపడ్డారు. జె.సి.బి.లను పెట్టి, పోలీసులను మోహరింప చేసి అరెస్టు చేయించారన్నారు. ఈ సంఘటన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని ఆయన తెలిపారు.

*నందిగామ రోడ్ షోలో చంద్రబాబుపై రాళ్లు వేసిన ఘటనపై టీడీపీ నేత వర్ల రామయ్య ఏపీ డీజీపీకి లేఖ రాశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల లోపాన్ని తమ దృష్టికి అనేకమార్లు తీసుకొచ్చామని, ప్రత్యేకించి ప్రతిపక్ష నేతలపై అధికారపార్టీ వైసీపీ చేస్తున్న దాడులపై పలుమార్లు ఫిర్యాదు చేశామన్నారు. భద్రతా లోపాలకు కారణమైన అధికారులు, దాడులకు పాల్పడిన వారిపై గానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆ లేఖలో పేర్కొన్నారు.2019 ఆగష్టులో జెడ్ ప్లస్ క్యాటగిరి భద్రతలో ఉన్న నారా చంద్రబాబు ఇంటిపై డ్రోన్ కెమేరాలు ఎగురవేశారని, 2019 నవంబర్‌లో అమరావతి రాజధాని బస్సు యాత్రపై రాళ్లు, కర్రలు రువ్వారని వర్ల రామయ్య పేర్కొన్నారు. 2021 నవంబర్‌లో అధికారపార్టీ ఎమ్మెల్యే చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నించారన్నారు. తాజాగా నవంబర్ 4న ఎన్టీఆర్ జిల్లా, నందిగామలో పర్యటించిన చంద్రబాబు రోడ్ షోపై రాళ్లు వేశారని, రోడ్ షోకు ముందుగానే అనుమతులు తీసుకున్నప్పటికీ తగినంత భద్రత ఏర్పాట్లు చేయలేదని విమర్శించారు. ఈ ఘటనలో సెక్యూరిటీ చీఫ్ మధుకు గాయాలయ్యాయన్నారు. రూట్ మ్యాప్ పోలీసులకు ముందే ఇచ్చినప్పటికీ రోడ్ షో జరిగే చుట్టు ప్రక్కల ఇళ్లను ఎందుకు తనిఖీ చేయలేదని ప్రశ్నించారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్షనేతను ప్రజాస్వామ్యబద్దంగా ఎదుర్కోలేక అధికారపార్టీ గూండాలు ఇలా దాడులకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

*నందిగామ రోడ్ షోలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాహనంపై రాళ్ల దాడి ఘటనకు నిరసనగా టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య టీడీపీ నాయకులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. నందిగామ గాంధీ సెంటర్లో గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. తంగిరాల సౌమ్య గాంధీ సెంటర్‌లో బైటాయించి ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.

*వాషర్‌మెన్‌పేటలోని మెట్రోరైలు స్తంభాలపై వివిధ రంగుల్లో రాసిన తమిళ అక్షరాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. తమిళుల సంస్కృతి, సంప్రదాయాలు యువకులు తెలుసుకొనేలా నగరంలోని మెట్రోరైల్‌ స్థలాల్లో రంగుల చిత్రాలు వేస్తున్నారు. ఆ ప్రకారం వాషర్‌మెన్‌పేట నుంచి వింకో నగర్‌ వరకు ఫ్లై ఓవర్‌ స్తంభాలకు పలు రంగుల్లో తమిళ అక్షరాలు రాసారు. కొంతమంది ఈ స్తంభాల దగ్గర సెల్ఫీ తీసుకుంటున్నారు.

*తాజా టీ20 ప్రపంచకప్‌ ముగిశాక భారత స్టార్‌ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ వివాహం చేసుకోనున్నట్టు సమాచారం. కొంతకాలంగా బాలీవుడ్‌ నటి అతియా శెట్టితో అతడు ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఈ ఏడాది చివర్లో లేక జనవరి మొదటి వారంలో వీరి పెళ్లి జరిగే అవకాశం ఉంది. గత సెప్టెంబరులోనే అతియా తండ్రి, నటుడు సునీల్‌ శెట్టి కూడా వీరి వివాహంపై స్పష్టతనిచ్చాడు. అలాగే రాహుల్‌ కోరిక మేరకే బీసీసీఐ అతడిని న్యూజిలాండ్‌తో జరిగే టీ20, వన్డే సిరీ్‌సలకు ఎంపిక చేయలేదు. మరోవైపు ఈనెలాఖరులో రాహుల్‌, అతియాల ఎంగేజ్‌మెంట్‌ జరగనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

*మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ గెలిచిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం సభ్యులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సోమవారం కలిశారు. కురుమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేషం ఆధ్వర్యంలో ప్రగతిభవన్‌కు వచ్చి సీఎం కేసీఆర్‌తోపాటు మునుగోడు ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డిని సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం నాయకులు క్యామ మల్లేష్‌, సెవెల్లి సంపత్‌, రాష్ట్ర యూత్‌ అధ్యక్షులు తూంకుంట అరుణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. కురుమల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ విశేష కృషి చేస్తున్నారని యెగ్గె మల్లేషం ఈ సందర్భంగా అన్నారు.

*మ‌జ్లిస్ పార్టీ చీఫ్ అస‌దుద్దీన్ ఓవైసీతో పాటు ఇత‌ర పార్టీ నేత‌లు ప్ర‌యాణిస్తున్న వందేభార‌త్ రైలుపై దాడి జ‌రిగింది. గుజ‌రాత్ రాజ‌ధాని అహ్మాదాబాద్ నుంచి సూర‌త్ వెళ్తున్న రైలుపై గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు రాళ్ల‌తో దాడి చేశారు. ఓవైసీ కూర్చున్న బోగీపై రాళ్లు రువ్వ‌డంతో ఆ బోగీలోని అద్దాలు ప‌గిలాయి. ఈ విష‌యాన్ని ఆ పార్టీ నేత వారిస్ ప‌ఠాన్ తెలిపారు. త‌న ట్విట్ట‌ర్‌లో ఆయ‌న ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన ఫోటోల‌ను పోస్టు చేశారు. సూర‌త్‌కు 25 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న స‌మ‌యంలో ఈ దాడి జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.

*గుజరాత్‌ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నడపడం లేదని.. ఢిల్లీ నుంచి నడుస్తోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పీ చిదంబరం విమర్శించారు. గుజరాత్‌ మోర్బీ ఘటన నేపథ్యంలో.. బీజేపీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. మోర్బీ వంతెన ఘటన గుజరాత్‌కే తలవంపులు తెచ్చిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వంతెన ప్రమాదంపై ఇప్పటి వరకు ఎవరూ ప్రభుత్వం పక్షాన క్షమాపణలు చెప్పలేదని, దానికి ఎవరూ బాధ్యత వహించక పోవడం అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయమన్నారు. ఇటీవల మోర్బీలో వంతెన కూలిన ఘటనలో 135 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మరో వైపు చిదరంబరం ఆమ్‌ ఆద్మీ పార్టీపై సైతం విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో గాలి నాణ్యతపై నమ్మకం ఉంటే.. గుజరాత్‌లో అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఓటు వేయరన్నారు.

*బోధన్‌ మండలంలోని అమ్దాపూర్‌ గ్రామంలో గల కస్తూర్బా పాఠశాల విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిని చికిత్స నిమిత్తం బోధన్‌ ఆసుపత్రికి తరలించారు. బోధన్‌ ఆర్డీవో రాజేశ్వర్‌ విద్యార్థినుల అస్వస్థతకు గల కారణాలపై ఆరాతీశారు. ఏరియా ఆసుపత్రిలోని విద్యార్థినులను సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలకు వెళ్లి అస్వస్థతకు గల కారణాలను తెలుసుకున్నారు.

* మీర్‌పేట్‌లో దారుణం జరిగింది. మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన కలకలం రేపుతోంది. 9వ తరగతి విద్యార్థినిపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ నిందితులు బాలికను బెదిరించారు. నిందితులపై కిడ్నాప్, పోక్సో చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్నేహితురాలు నివాసానికి వెళుతున్న సమయంలో మైనర్ బాలికను కొంతమంది యువకులు కిడ్నాప్ చేసి, అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికను దాదాపు మూడు గంటలపాటు బైక్‌పై పలు ప్రాంతాలకు నిందితులు తిప్పినట్లు బాధితురాలు స్టేట్‌మెంట్ ఇచ్చింది. పరారీలో ఉన్న నిందితులు కూడా దొరికినట్లయితే ఈ కేసులో మరికొన్ని అంశాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. మొత్తం ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆ ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తే పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

*గుజరాత్‌లోని మోర్బి వద్ద తీగల వంతెన కూలిపోయి, దాదాపు 135 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఆ రాష్ట్రానికి సిగ్గు చేటు అని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం అన్నారు. ఈ సంఘటనకు బాధ్యతవహిస్తూ ప్రభుత్వ పెద్దలు ఎవరూ రాజీనామా చేయకపోవడాన్ని ప్రశ్నించారు.

* హర్యానాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను మెరుగుపరిచేందుకే బాండ్ విధానాన్ని తీసుకొచ్చామని ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తార్ చెప్పారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివిన వైద్యులు ఏడేళ్ళపాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేయాలని తెలిపారు. ఈ గడువు కన్నా ముందుగానే వెళ్లిపోవాలనుకుంటే, వారు బాండ్లను సమర్పించవలసి ఉంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైద్య విద్యార్థుల నిరసనల నేపథ్యంలో ఆయన సోమవారం కర్ణాల్‌లో విలేకర్లతో మాట్లాడారు.ప్రభుత్వోద్యోగులు ప్రజల కోసం పని చేయాలని, లాభాల కోసం కాదని అన్నారు. పేద ప్రజలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోలేరని, కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలను మెరుగుపరిచేందుకు ఈ బాండ్ పాలసీ దోహదపడుతుందని తెలిపారు. ప్రతిపక్షాలు వైద్య విద్యార్థులను తప్పుదోవపట్టిస్తున్నాయని మండిపడ్డారు. ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత ఉద్యోగం రాకపోతే, బాండ్ ఫీజును చెల్లించవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు.

*హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ షాక్ ఇచ్చింది. పోలింగ్ తేదీ సమీపిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 26 మంది నాయకులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి తమ బీజేపీలో చేరారని హిమాచల్ బీజేపీ నేతలు తాజాగా ప్రకటించారు. హిమాచల్ కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధానకార్యదర్శి ధర్మపాల్ ఠాకూర్ తోపాటు 26మంది నేతలు సోమవారం బీజేపీ తీర్థం స్వీకరించారు. హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాంఠాకూర్, బీజేపీ నేత సుధాన్ సింగ్, బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి, సిమ్లా బీజేపీ అభ్యర్థి సంజయ్ సూద్ ల సమక్షంలో పలువురు కాంగ్రెస్ నేతలు కాషాయ కండువాను కప్పుకున్నారు. బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేతలకు స్వాగతం పలికిన సీఎం జైరాం ఠాకూర్ ఎన్నికల్లో చారిత్రక విజయం కోసం తామంతా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. హిమాచల్ ప్రదేశ్ ప్రజలు మోదీపై విశ్వాసంతో ఉన్నారని బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పారు. సీఎం అమలు చేస్తున్న విధానాల వల్ల ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని బీజేపీ నేతలు చెప్పారు. హిమాచల్ లో నవంబర్ 12వతేదీన పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 8వతేదీన ఓట్లను లెక్కించనున్నారు.

*రేడియంట్ భూముల విషయంలో వైసీపీ ఎంపీ వేంరెడ్డి ప్రభాకర్ టీడీపీపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కుటుంబ సభ్యులను రాజకీయ వివాదాల్లోకి తీసుకురావద్దని నీతి వ్యాఖ్యలు చెపుతున్నారని, ఆనాడు చంద్రబాబు సతీమణిని దూషించినపుడు వేమిరెడ్డి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. వైఎస్ భారతి గృహణి కాదని.. సాక్షి ఛైర్మన్ అని, అ పత్రికలో దొంగ వార్తలు రాయిస్తుంది భారతియేని ఆయన ఆరోపించారు. అలాగే భారతి సిమెంట్ ఎవరిదని నిలదీశారు.

*కరీంనగర్: జిల్లాలోని సైదాపూర్ మంలడం ఆకునూర్‌లో దారు హత్య చోటుచేసుకుంది. శ్రీనివాస్‌(31)ను దుండగులు హత్య చేసి పూడ్చి పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. హత్యకు డబ్బులు, వివాహేతర సంబంధమే కారణమని అనుమానం బంధువులు, స్థానికులు, కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

* ఇటీవల నమీబియా నుంచి భారత్‌కు వచ్చిన రెండు మగ చీతాలు తమ తొలి వేటను విజయవంతంగా పూర్తి చేశాయి. కార్వంటైన్‌ ప్రాంతం నుంచి అక్లిమటైజేషన్‌ ఎన్‌క్లోజర్‌లోకి విడుదల చేసిన 24 గంటల్లోపే ఈ చీతాలు తమ తొలి వేటను ముగించాయని అధికారులు సోమవారం వెల్లడించారు. మచ్చల జింకను ఇవి వేటాడి తిన్నాయని తెలిపారు. సెప్టెంబర్‌లో నమీబియా నుంచి భారత్‌కు మొత్తంగా ఎనిమిది చీతాలు వచ్చిన సంగతి తెలిసిందే. వీటిని మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌లో సెప్టెంబరు 17 నుంచి కార్వంటైన్‌లో ఉంచారు. ఇందులో రెండింటిని శనివారం కార్వంటైన్‌ నుంచి విడిచిపెట్టారు. ఇన్ని రోజులుగా క్వారంటైన్‌లో వుండడం వల్ల వాటి కండరాలు బలహీనపడతాయేమోననే ఆందోళన అధికారుల్లో వుంది. కానీ, విడుదల చేసిన 24 గంటల్లోనే వేటాడడంతో అధికారులు వాటి సామర్థ్యంపై సంతృప్తి వ్యక్తం చేశారు. వేటాడిన రెండు గంటల్లోపు చీతాలు తమ ఆహారాన్ని తింటాయని చెప్పారు. మిగిలిన ఆరు చీతాలను కూడా దశలవారీగా క్వారంటైన్‌ నుండి విడుదల చేస్తామని చెప్పారు. ఎనిమిది చీతాల్లో ఐదు ఆడవి కాగా, మూడు మగవి.

*అన్నాడీఎంకే నేతృత్వంలోనే కూటమి ఏర్పాటవుతుందని, కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై స్పష్టం చేశారు. నగరంలో సోమవారం ‘ప్రధాని మోదీ-తమిళగం’ అనే పుస్తకాన్ని అన్నామలై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమిలో పెద్ద పార్టీ అయిన అన్నాడీఎంకే నేతృత్వం వహించడంలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పలు పార్టీలతో కూటమి ఏర్పాటుకానుందని, ఫలితాల తర్వాత ఎవరి బలం ఎంతో అర్ధమవుతుందని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. కూటమిలో టీటీవీ దినకరన్‌ నేతృత్వంలోని ఏఎంఎంకే చేరికపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఆర్ధికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల ఎవరికీ నష్టం లేదన్న సుప్రీంకోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామన్నారు. ఓబీసీ, బీసీ, ఎంబీసీ వర్గాలకు సీట్లు కేటాయింపులో ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. 10 శాతం సీట్ల రిజర్వేషన్‌పై డీఎంకే అసత్య ప్రచారాలు చేస్తోందని ఆరోపించారు. పాల ధరలు పెంచిన రాష్ట్రప్రభుత్వ తీరును ఖండిస్తూ, ధరల పెంపు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 15న రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టనున్నట్లు అన్నామలై వెల్లడించారు.

*గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీపై రాళ్ల దాడి జరిగిందా? అంటే అవునంటున్నారు ఆ పార్టీ నాయకుడు వారిస్ పఠాన్. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అహ్మదాబాద్ నుంచి సూరత్(Surat) నగరానికి వందేభారత్ రైలులో ప్రయాణిస్తున్న అసదుద్దీన్ ఒవైసీపై ఆగంతకులు రాళ్లతో దాడి చేశారని(Stones thrown) మజ్లిస్ నాయకుడు వారిస్ పఠాన్ ఆరోపించారు. వందేభారత్ రైలు సూరత్ నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో నడుస్తుండగా అసదుద్దీన్ కూర్చున్న బోగీపై ఆగంతకులు రాళ్లు విసిరారని వారిస్ పఠాన్ సూరత్ ర్యాలీలో ఆరోపించారు. ‘‘నేను అసదుద్దీన్ పక్కన కూర్చొని రైలులో ప్రయాణిస్తుండగా రాయి దాడికి రైలు అద్దం పగిలింది, మరో నిమిషంలో మరో రాయి అసద్ ప్రయాణిస్తున్న రైలు బోగీపై ఆగంతకులు విసిరారు’’ అని వారిస్ పఠాన్ చెప్పారు. తమపై రాళ్ల వర్షం కురిపించినా, అగ్ని వర్షం కురిపించినా తాము మాత్రం హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాడుతూనే ఉంటామని వారిస్ పఠాన్ చెప్పారు.

*హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ షాక్ ఇచ్చింది. పోలింగ్ తేదీ సమీపిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 26 మంది నాయకులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి తమ బీజేపీలో చేరారని హిమాచల్బీ జేపీ నేతలు తాజాగా ప్రకటించారు. హిమాచల్ కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధానకార్యదర్శి ధర్మపాల్ ఠాకూర్ తోపాటు 26మంది నేతలు సోమవారం బీజేపీ తీర్థం స్వీకరించారు. హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాంఠాకూర్, బీజేపీ నేత సుధాన్ సింగ్, బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి, సిమ్లా బీజేపీ అభ్యర్థి సంజయ్ సూద్ ల సమక్షంలో పలువురు కాంగ్రెస్ నేతలు కాషాయ కండువాను కప్పుకున్నారు. బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేతలకు స్వాగతం పలికిన సీఎం జైరాం ఠాకూర్ ఎన్నికల్లో చారిత్రక విజయం కోసం తామంతా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. హిమాచల్ ప్రదేశ్ ప్రజలు మోదీపై విశ్వాసంతో ఉన్నారని బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పారు. సీఎం అమలు చేస్తున్న విధానాల వల్ల ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని బీజేపీ నేతలు చెప్పారు. హిమాచల్ లో నవంబర్ 12వతేదీన పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 8వతేదీన ఓట్లను లెక్కించనున్నారు.

*‘యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని బీజేపీ రాష్ట్ర అఽధ్యక్షుడు బండి సంజయ్‌ హేళన చేశాడు. తడి దుస్తులతో డ్రామా చేశాడు. మునుగోడులో టీఆర్‌ఎస్‌ విజయంతో భగవంతుడు సంజయ్‌ను పెక్కున తన్నాడ’ని పంచాయతీరాజ్‌ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడిని దర్శించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. అమిత్‌ షా చెప్పులు మోసిన సంజయ్‌ను ప్రస్తుతం ఎవరు చెప్పులతో కొట్టారనేది నిర్ణయించుకోవాలన్నారు. రూ.18 వేల కోట్ల కాంట్రాక్టును రాజగోపాల్‌ రెడ్డికి ఇచ్చి, ఉప ఎన్నికకు బీజేపీ తెరలేపిందని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి కొనే ప్రయత్నం చేసిందన్నారు. వారి ప్రయత్నాలను ఎమ్మెల్యేలు, ప్రజలు తిప్పికొట్టారని, ఇప్పటికైనా బీజేపీ బుద్ధి తెచ్చుకుని మంచి మార్గంలో నడవాలన్నారు. హుజూరాబాద్‌, దుబ్బాకలో తప్పుడు వాగ్దానాలు చేసి బీజేపీ నేతలు గెలిచారని ప్రజలు గమనించారని తెలిపారు. బీజేపీ నేతలు భగవంతుడిని కూడా మోసం చేస్తున్నారన్నారు. కార్పొరేషన్‌ ఎన్నికల సందర్భంగా వరంగల్‌లో భద్రకాళి అమ్మవారిని, హైదరాబాద్‌లో భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని తప్పుడు వాగ్దానాలు చేయడంతో ప్రజలు తిప్పికొట్టారన్నారు.

* మునుగోడులో టీఆర్‌ఎస్‌ విజయం బీజేపీకి చెంపపెట్టు అని పలువురు టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. బీజేపీ ఎత్తుగడలను మునుగోడు ప్రజలు చిత్తు చేశారని కొనియాడారు. టీఆర్‌ఎ్‌సఎల్పీ కార్యాలయంలో సోమవారం ఎంపీలు వెంకటేష్‌ నేత, మాలోతు కవిత, మన్నె శ్రీనివా్‌సరెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌, ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌ విలేకరులతో మాట్లాడారు. మునుగోడు ఫలితం తర్వాత బీజేపీ నాయకులు సోయి తప్పి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. డబ్బులు పంచి టీఆర్‌ఎస్‌ గెలిచిందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. చిన్నపిల్లోడిలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

*ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌కు సోమవారం సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనకు వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యాలకు విచారణార్హత లేదని తెలిపింది. గనుల శాఖ మంత్రిగా ఉండగా తనకు తాను మైనింగ్‌ లీజును ఇప్పించుకున్నారని ఆరోపిస్తూ తొలుత ఝార్ఖండ్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరపవచ్చని హైకోర్టు ఈ ఏడాది జూన్‌ 3న తీర్పు ఇచ్చింది. దాన్ని సవాలు చేస్తూ హేమంత్‌ సొరేన్‌తో పాటు, రాష్ట్ర ప్రభుత్వం వేరువేరుగా సుప్రీంకోర్టులో అప్పీలు చేశాయి. వాటిని పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ ఎస్‌.రవీంద్ర భట్‌, జస్టిస్‌ సుధాంశు ధులియా ధర్మాసనం హైకోర్టు ఆదేశాలను పక్కన పెట్టింది. నిర్దిష్టంగా కేసులు నమోదు కానప్పటికీ, ఈడీ దర్యాప్తు కోరడం సరికాదని పేర్కొంది.

*తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి చాలా లిటిగేషన్లు వస్తున్నాయని, రాజకీయ ప్రయోజనాల కోసం కోర్టులను రణరంగంగా మారుస్తున్నారని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. మీ రాజకీయాల్లో మేం తలదూర్చదలచుకోలేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం కేసులో… తమను రిమాండ్‌కు పంపడాన్ని సవాలు చేస్తూ నిందితులు రామచంద్ర భారతి, నంద కుమార్‌, సింహయాజి దాఖలుచేసిన పిటిషన్‌పై సోమవారం న్యాయమూర్తులు జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ బీవీ నాగరత్న ధర్మాసనం విచారణ జరిపింది.

* ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని ఆమోదిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ, కాంగ్రె్‌సలు స్వాగతించాయి. దేశంలోని పేదలందరికీ సామాజిక న్యాయం అందాలన్న ప్రధాని మోదీ ‘మిషన్‌’కు లభించిన చరిత్రాత్మక విజయమంటూ హర్షం వ్యక్తం చేసింది. తీర్పు స్వార్థపర శక్తులకు చెంపపెట్టు అంటూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ట్వీట్‌ చేశారు. తప్పుడు ప్రచారంతో సమాజంలో విభజన తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన వారి ఆటలు బందయ్యాయని తెలిపారు. సామాజిక న్యాయం, సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌ అన్న విధానం మరింత బలపడుతుందని చెప్పారు. దీని ద్వారా అందరికీ సమాన అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ప్రధాని ‘విజన్‌’ అయిన గరీబ్‌ కల్యాణ్‌ సాధనకు మరింత శక్తిని ఇస్తుందని బీజేపీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) బి.ఎల్‌.సంతోష్‌ తెలిపారు. బీజేపీ సరల్‌ ఇన్‌చార్జ్‌ నూనె బాలరాజు మాట్లాడుతూ పండిత్‌ దీనదయాళ్‌ ఉపాధ్యాయ అంత్యోదయ, మోదీ సబ్‌ కా సాఽథ్‌ సబ్‌ కా వికాస్‌ సిద్ధాంతాల సమ్మేళనాల ఫలితమే ఈ తీర్పు అని అన్నారు.

* మునుగోడులో బీజేపీ నుంచి గట్టి సవాల్‌ ఎదురైన నేపథ్యంలో ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. వారంలో మూడు రోజుల పాటు నియోజకవర్గ కేంద్రాల్లోనే ఉండేలా కార్యాచరణను రూపొందించుకోవాలని టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్లు తెలిసింది. ఆపరేషన్‌ ఆకర్ష్‌కు కూడా పదును పెట్టాలని సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు నెల రోజుల పాటు మునుగోడులో మకాం వేసి, అహోరాత్రులు శ్రమించినా.. క్షేత్రస్థాయిలో బీజేపీ పునాదులు పటిష్ఠం కావడం ఆషామాషీ వ్యవహారం కాదనే భావనలో అధికార పార్టీ ఉంది. శాసనసభకు మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే ఇంటిని చక్కదిద్దుకోవాలని పార్టీ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. చేసిన పనులకు డబ్బులు రాకపోవడం, కష్టపడి పని చేసినా పదవులు దక్కలేదనే అసంతృప్తితో ఉన్న టీఆర్‌ఎస్‌ ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని బుజ్జగించి దారిలోకి తెచ్చుకోవాలని అధినేత కేసీఆర్‌ ఆదేశించినట్లు సమాచారం. వామపక్షాల ఓటు బ్యాంకు ఉన్న నియోజకవర్గాల్లో.. ఆయా పార్టీల నేతలతో సఖ్యతగా మెలగాలని, ఇతర పార్టీల నాయకులను ఆకర్షించేందుకు అన్ని మార్గాలను అన్వేషించాలని సూచించినట్లు తెలిసింది. నియోజవకర్గాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేయాలని ఆదేశాలు అందాయి. కొత్త జిల్లాల్లో కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాల భవనాలను పూర్తి చేయడంతోపాటు టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవాన్ని చేపట్టాలని టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం యోచిస్తోంది.

* నకిలీ కుల ధ్రువీకరణ పత్రం కేసులో లోక్‌సభ ఎంపీ నవనీత్‌ రాణా, ఆయన తండ్రిపై ముంబై కోర్టు సోమవారం నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేసింది. ఇంతకు ముందు సెప్టెంబర్‌లోనూ కోర్టు ఎంపీతో పాటు ఆమె తండ్రిపై వారెంట్‌ జారీ అయ్యింది. ఈ క్రమంలో కొనసాగుతున్న కేసుపై సోమవారం మరోసారి కోర్టులో విచారణ జరిగింది. వారెంట్‌ అమలు కోసం మరింత సమయం కావాలని పోలీసులు కోరారు.

* వరంగల్‌ జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృత్యువాతపడ్డారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. వర్ధన్నపేట పట్టణ శివారు డీసీ తండా వద్ద దుర్ఘటన చోటు చేసుకున్నది. మృతులను కృష్ణారెడ్డి, వరలక్ష్మి, వెంకటసాయిరెడ్డిగా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు నుంచి వరంగల్‌ వస్తుండగా డీసీ తండా వద్ద ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

* గర్భిణుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న 56 అత్యాధునిక ‘టిఫా’ స్కానింగ్‌ యంత్రాలను ఈ నెల 18న ప్రారంభించనున్నట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. వీటితోపాటు కంటి చికిత్సలకు ఉపయోగించే 26 ఆపరేటివ్‌ మైక్రోస్కోప్‌లను కూడా ప్రారంభించనున్నట్టు తెలిపారు. వీటన్నింటినీ ఆన్‌లైన్‌ ద్వారా ఒకేసారి ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

* ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో సీబీఐ దర్యాప్తును కోరే అర్హత బీజేపీకి ఉన్నదో లేదో మంగళవారం తేల్చుతామని హైకోర్టు ప్రకటించింది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేసేలా తీర్పు వెలువరించాలంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు. ప్రభుత్వం తరపున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జే రామచందర్‌రావు వాదిస్తూ.. క్రిమినల్‌ కేసులో నిందితులు కానివారికి రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసే అర్హత లేదని, బీజేపీ వేసిన రిట్‌కు విచారణార్హత లేదని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిన కేసులో నిందితులు రామచంద్రభారతి, కోరె నందకుమార్‌(నందు), సింహయాజిలపై బీజేపీకి అంత ఆసక్తి ఎందుకని ప్రశ్నించారు.

* మునుగోడు గెలుపుతో టీఆర్‌ఎస్‌ (బీఆర్‌ఎస్‌)కు తిరుగులేదనే విషయం మరోసారి నిరూపితమైందని ముంబై టీఆర్‌ఎస్‌శాఖ నాయకులు బొల్లే శివరాజ్‌, బడ్డి హేమంత్‌కుమార్‌ పేర్కొన్నారు. మునుగోడు విజయం నేపథ్యంలో సోమవారం ముంబైలోని చెంబూర్‌ నాకా పరిధిలోని ఏకవీరా టూర్స్‌ ట్రావెల్స్‌ కార్యాలయం వద్ద సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు జాషువ, బర్నబాస్‌, సుక్క నర్సింహులు, సంజయ్‌ లొండే, భీం రత్నమాల, బీ సురేందర్‌, అడ్వకేట్‌ నర్సయ్య, బీ సుజిత్‌ రవన్‌, సీ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

* తెలంగాణ స్టేట్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ కో ఆపరేటివ్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌గా సోమ భరత్‌కుమార్‌ నియమితులయ్యారు. సీఎం కేసీఆర్‌ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ నుంచి నియామక ఉత్తర్వులు అందుకున్న భరత్‌కుమార్‌.. తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

* రాజ్యసభ బీఏసీ సభ్యుడిగా టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు మరోసారి నియమితులయ్యారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటేరియట్‌ సోమవారం బులెటిన్‌ను విడుదల చేసింది. బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ(బీఏసీ)లో పది మందిని సభ్యులుగా నియమించారు. ఈ కమిటీకి రాజ్యసభ చైర్మన్‌ అధ్యక్షుడిగా ఉంటారు. కాగా, రాజ్యసభలో వివిధ కమిటీలను చైర్మన్‌ పునర్‌వ్యవస్థీకరించారు.

* రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని రీకాల్‌ చేయాలని రాష్ట్రపతిని కోరనున్నట్లు డీఎంకే ఎంపీ కనిమొళి తెలిపారు. నగరంలో ఆదివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కనిమొళి విలేఖరులతో మాట్లాడుతూ, బీజేపీ యేతర రాష్ట్రాల గవర్నర్లు ఆయా రాష్ట్రప్రభుత్వాలకు సమస్యలు సృష్టించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పలు సందర్భంగా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులను అవమానించేలా గవర్నర్లు వ్యాఖ్యానిస్తున్నారన్నారు. ఇలాంటి చర్యలు రాష్ట్ర హక్కుల ఉల్లంఘన అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయపార్టీలు ఏకమయ్యే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఆ క్రమంలో సీఎం స్టాలిన్‌, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీ ముఖ్యమైన అంశంగా పరిగణిస్తున్నామన్నారు. గవర్నర్‌ రవి రీకాల్‌ విషయమై రాష్ట్రపతితో అపాయింట్‌మెంట్‌ అడిగామని, అందుకు అనుకూలంగా నిర్ణయం వస్తుందని కనిమొళి ఆశాభావం వ్యక్తం చేశారు.

* డెల్టా సహా ఇతర జిల్లాల్లో ఈ నెల 10,11 తేదీల్లో భారీవర్షాలు కురిసే అవకాశముందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. శ్రీలంక సముద్రతీరం వెంబడి నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 9న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, అది వాయువ్య దిశగా పయనించి తమిళనాడు, పుదుచ్చేరి తీరం వైపు వెళ్లే అవకాశముందన్నారు. అల్పపీడనం ప్రభావంతో మంగళవారం తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్‌లోని అనేక ప్రాంతాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. 10వ తేది కన్నియాకుమారి, తిరునల్వేలి, తెన్‌కాశి, తూత్తుకుడి, రామనాధపురం, శివగంగ, పుదుకోట, తంజావూరు, తిరువారూర్‌, నాగపట్టణం, మైలాడుదురై, కడలూరు, విల్లుపురం జిల్లాల సహా పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాల్లో ఒకటి, రెండు ప్రాంతాల్లో భారీవర్షం కురిసే అవకాశముందని తెలిపింది. 11న చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూర్‌, రాణిపేట సహా పలు జిల్లాల్లో ఒకటి, రెండు ప్రాంతాల్లో భారీవర్షం కురిసే అవకాశముందని వెల్లడించింది. రాజధాని నగరం చెన్నైలో రానున్న 48 గంటల్లో ఆకాశం మేఘావృతమై కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశముందని, పగటి ఉష్ణోగ్రతలు 31-32 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 24-25 డిగ్రీల సెల్సియ్‌సగా నమోదయ్యే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలియజేసింది.

* ఫెస్టివ్ సీజ‌న్ ముగియ‌డంతో టాటా మోటార్స్ స‌హా ప‌లు కార్ల త‌యారీ సంస్థ‌లు కార్ల ధ‌ర‌లు పెంచేశాయి. టాటా మోటార్స్ ఎంపిక చేసిన మోడ‌ల్‌.. వేరియంట్‌ను బ‌ట్టి 0.9 శాతం వ‌ర‌కు ధ‌ర‌లు పెంచేసింది. ఒక‌వైపు కార్ల ధ‌ర‌లు పెంచేసి, మ‌రోవైపు కొన్ని మోడ‌ల్స్‌పై ఇన్సెంటివ్‌లు ప్ర‌క‌టించాయి. కానీ, టాప్ మోడ‌ల్స్ కార్ల‌పై రాయితీలు ఇవ్వ‌క పోవ‌డం గ‌మ‌నార్హం.