Editorials

50వ సీజేఐ గా చంద్రచూడ్ ప్రమాణం

50వ సీజేఐ గా చంద్రచూడ్ ప్రమాణం

భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధనంజయ్‌ యశ్వంత్‌ చంద్రచూడ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. సీజేఐ జస్టిస్‌ యూయూ లలిత్‌ నవంబర్‌ 8న పదవీ విరమణ చేసిన క్రమంలో ఆయన వారసుడిగా జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ బాధ్యతలు స్వీకరించారు.

జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ 2024 నవంబర్‌ 10 వరకు రెండేళ్ల పాటు సీజేఐ పదవిలో కొనసాగనున్నారు. ఆయన తండ్రి జస్టిస్‌ వైవీ చంద్రచూడ్‌ కూడా సీజేఐగా చేయడం విశేషం! జస్టిస్‌ వైవీ చంద్రచూడ్‌ అత్యధిక కాలం 1978, ఫిబ్రవరి 22 నుంచి 1985, జులై 11 వరకు సీజేఐగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రగతిశీల భావాలున్న న్యాయమూర్తిగా పేరొందిన జస్టిస్‌ చంద్రచూడ్‌ న్యాయవాదుల కుటుంబం నుంచి వచ్చారు.
1959 నవంబర్‌ 11న జస్టిస్‌ యశ్వంత్‌ విష్ణు చంద్రచూడ్, ప్రభ దంపతులకు మహారాష్ట్రలో జన్మించారు.
ముంబైలోని కేథడ్రల్, జాన్‌కానన్‌లో పాఠశాల విద్య, 1979లో ఢిల్లీలో ఆర్థిక, గణిత శాస్త్రాల్లో ఆనర్స్‌ డిగ్రీ పూర్తి చేశారు. 1982లో ఢిల్లీలో న్యాయ పట్టా పొందారు.
1983లో హార్వర్డ్‌ లా స్కూల్‌ నుంచి ఎల్‌ఎల్‌ఎం పట్టా పొందారు. 1986లో హార్వర్డ్‌లో డాక్టరేట్‌ ఆఫ్‌ జ్యూరిడికల్‌ సైన్స్‌ చదివారు. బాంబే హైకోర్టులో, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు.
1998లో సీనియర్‌ న్యాయవాదిగా పదోన్నతి పొందడంతోపాటు సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా నియమితులయ్యారు.
2000లో బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013లో అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ కార్యనిర్వాహక చైర్మన్‌గా కూడా పని చేశారు. ఆయన ఇద్దరు కుమారులు అభినవ్, చింతన్‌ కూడా లాయర్లే.