Health

కునుకే బంగారమాయెనా..

కునుకే బంగారమాయెనా..

నా వయసు పందొమ్మిది. కారణం తెలియదు కానీ, నిద్రలేమి సమస్య నన్ను వేధిస్తున్నది. తెల్లవారుజాము వరకూ కునుకు పట్టదు. మొదట్లో ఫ్రెండ్స్‌తో చాటింగ్‌ చేసేదాన్ని. ఫోన్‌తో కాలక్షేపం చేసేదాన్ని. నేను ఇంకెవరితోనో చాట్‌ చేస్తున్నాననే అనుమానంతో బాయ్‌ఫ్రెండ్‌ బ్రేకప్‌ చెప్పాడు. కడుపునిండా భోంచేస్తే నిద్రవస్తుందని ఎవరో సలహా ఇస్తే.. నాలుగు ముద్దలు ఎక్కువే తింటున్నాను. నిద్ర మాత్రలూ వాడుతున్నాను. ఇవేవీ నాపై ప్రభావం చూపడం లేదు. నిద్రలేమి నన్ను వెంటాడుతూనే ఉంది. మంచి సలహా ఇవ్వగలరు.నిద్ర లేమి ఓ రుగ్మత. దాన్ని నివారించేందుకు ప్రత్యేక నిపుణులు ఉన్నారు. అతిభయం, అపరాధభావం, చికాకులు, చింతలు ఎక్కువైనప్పుడు ఇలా జరుగుతుంది. మీ బాయ్‌ఫ్రెండ్‌ కోసం ఫోన్‌లో తలదూర్చారు. అతని కోసం రాత్రంతా చాటింగ్‌ చేశారు. ఆ మోజులో నిద్రా సమయాన్ని మార్చుకున్నారు. అతనేమో మిమ్మల్ని వదిలేశాడు. చక్కగా చదువుకుని జీవితంలో స్థిరపడాల్సిన వయసులో ఇలాంటివి పెట్టుకోవడం మంచిది కాదు. మీ సమస్యకు ఓ పరిష్కారం ఉంది. ముందుగా మీరు కొన్ని అలవాట్లకు దూరం కావాలి. మానసికంగా దృఢంగా ఉండాలి. పడకగది ప్రశాంతంగా, సౌకర్యవంతంగా ఉండేలా ప్లాన్‌ చేసుకోండి. వాకింగ్‌, యోగా, రిలాక్సేషన్‌ టెక్నిక్స్‌, ధ్యానం జీవితంలో భాగం చేసుకోండి. దేని గురించీ అతిగా ఆలోచించకుండా, మీ పనిపైనే దృష్టిపెట్టండి. రాత్రిళ్లు ఫోన్లు చూడటం, మితిమీరి తినడం, కాఫీ, టీ, ఆల్కహాల్‌ తీసుకోవడం, సినిమాలు చూడటం.. నిద్రను ప్రభావితం చేసే అంశాలే. ఇంతచేసినా మిమ్మల్ని నిద్రలేమి బాధిస్తుంటే నిపుణులను సంప్రదించండి. వారి సలహాలు, సూచనలు పాటించండి. ఆల్‌ ద బెస్ట్‌.