ScienceAndTech

ట్విట్టర్‌ ఉద్యోగులకు మస్క్‌ షాక్‌

ట్విట్టర్‌ ఉద్యోగులకు మస్క్‌ షాక్‌

ట్విట్టర్‌ను సొంతం చేసుకోగానే సంస్థ ఉద్యోగులకు ఎలాన్‌ మస్క్‌ పంపిన తొలి మెయిల్‌ ఏమిటో తెలుసా? వర్క్‌ ఫ్రం హోమ్‌ ఇక నుంచి ఉండబోదని. ప్రతి ఒక్క ఉద్యోగి వారానికి 40 గంటల పాటు ఆఫీస్‌లో ఉండాల్సిందేనని. ట్విట్టర్‌ రెవెన్యూను 50 శాతం పెంచేలా ఉద్యోగులు కష్టపడాలని ఆ మెయిల్‌లో మస్క్‌ ఆదేశాలు జారీ చేశారని ఓ నివేదిక తెలిపింది.

డిజిటల్‌ పేమెంట్లలోకి ట్విట్టర్‌
ట్విట్టర్‌ను డిజిటల్‌ పేమెంట్‌ వేదికగా మార్చేందుకు మస్క్‌ సిద్ధమవుతున్నారు. గత వారమే అమెరికా యంత్రాంగం వద్ద దీనికి సంబంధించిన పేపర్‌ వర్క్‌ అంతా పూర్తి చేసినట్టు తెలిసింది. డిజిటల్‌ పేమెంట్లపై అడ్వైర్టెజర్లతో సమావేశమై తన ప్రణాళికను వెల్లడించినట్టు సమాచారం. ఇది అందుబాటులోకి వస్తే ట్విట్టర్‌ యూజర్లు లావాదేవీలు చేసుకోవచ్చు. అవతలి వ్యక్తికి ట్విట్టర్‌ అకౌంట్‌ లేకపోతే సంబంధిత బ్యాంకుకు డబ్బు పంపొచ్చు. యూజర్లను ఆకర్షించేందుకు ట్విట్టర్‌ అకౌంట్‌లో ఉంచే డబ్బుకు ఎక్కువ వడ్డీ ఇచ్చేలా ప్లాన్‌ చేస్తున్నట్టు తెలిసింది.

భద్రంగానే ఎస్తర్‌ జాబ్‌
పనిగంటల కంటే ఎక్కువ సేపు పనిచేసి ట్విట్టర్‌ ఆఫీస్‌లోనే నిద్రపోయిన ఉద్యోగిని ఎస్తర్‌ క్రాఫర్డ్‌ ఫొటో ఎంత వైరల్‌ అయ్యిందో తెలిసిందే. ఇక ఆమెను ఎలాన్‌ మస్క్‌ ఇంటికే పంపిస్తారని, ఉద్యోగం ఊడినట్టేనని అంతా కామెంట్లు చేశారు. కానీ, ట్విట్టర్‌లో ఉద్యోగాల తొలగింపు నుంచి బతికిపోయిందామె. పైగా, ఆమెపై మస్క్‌ చర్యలు కూడా తీసుకోలేదు.

బ్లూటిక్‌ కొన్నారో, లేదో తెలుసుకోవచ్చు
8 డాలర్లు కట్టండి.. బ్లూటిక్‌ సొంతం చేసుకోండి అంటూ ట్విట్టర్‌ను మస్క్‌ వ్యాపార వనరుగా మార్చేశారు. అయితే, ఆ బ్లూటిక్‌ ట్విట్టర్‌ ఇచ్చిందా? లేక డబ్బు కట్టి సొంతం చేసుకొన్నారా? అన్న విషయాన్ని ఈజీగా తెలుసుకోవచ్చు. బ్లూటిక్‌ ఉన్న యూజర్‌ అకౌంట్‌పై క్లిక్‌ చేస్తే ఆ విషయం తెలిసిపోతుంది. డబ్బు పెట్టి కొంటే.. వెరిఫికేషన్‌ బ్యాడ్జిని సబ్‌స్ర్కైబ్‌ చేసుకొన్నారు అని చూపిస్తుంది. ట్విట్టరే స్వయం గా ఇస్తే.. వార్తలు, వినోదం, ఇతర రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తి అని చూపిస్తుంది.