Movies

ఆ పరుగుకు అలుపేది ..

ఆ పరుగుకు అలుపేది ..

బాలీవుడ్‌ అగ్ర కథానాయిక దీపికాపడుకోన్‌ సినీ ప్రయాణం ప్రతి ఒక్కరిలో స్ఫూర్తినింపుతుంది. ‘ఓం శాంతి ఓం’ చిత్రం ద్వారా హిందీలో అరంగేట్రం చేసిన ఈ మంగళూరు సోయగం భిన్న పాత్రల్లో తనను తాను ఆవిష్కరించుకుంటూ అగ్ర నాయికగా ఎదిగింది. ప్రేమ కథాంశాలు మొదలుకొని చారిత్రక చిత్రాల వరకు ఎన్నో అపూర్వ విజయాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ భామ హాలీవుడ్‌ యవనికపై కూడా సత్తా చాటుతున్నది. ఇక వివిధ అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది దీపికాపడుకోన్‌. అత్యధిక పాపులారిటీ కలిగిన గ్లోబల్‌ బ్రాండ్స్‌కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న ఆసియా తారగా ఈ సుందరి రికార్డులకెక్కింది. తాజాగా ఆమె పదిహేనేళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో ఓ వీడియోను పంచుతుంది. సినీ రంగంలో సాధించాల్సింది చాలా ఉందని, ఇంకా తాను కన్న కలలు మిగిలే ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఈ పదిహేనేళ్ల ప్రయాణంలో ఏరోజూ నిరుత్సాహపడిన సందర్భాలు లేవని, అలుపులేని పరుగును తాను ఆస్వాదిస్తున్నానని దీపికా పడుకోన్‌ ఆనందం వ్యక్తం చేసింది.