Movies

20 ఏళ్ల నట ప్రస్థానం

20 ఏళ్ల నట ప్రస్థానం

రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు నట వారసుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి, స్వయంకృషి, పట్టుదలతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగారు ప్రభాస్‌. నవంబరు 11కు తెలుగు సినీ పరిశ్రమలో ఆయన నట ప్రస్థానానికి 20 ఏళ్లు. ప్రభాస్‌ హీరోగా అరంగేట్రం చేసిన ‘ఈశ్వర్‌’ చిత్రం 2002లో విడుదలైంది. తెలుగు పరిశ్రమలో ఆయనకు కథానాయకుడిగా శుభారంభం అందించింది. ఒక్కో చిత్రంతో తన స్థాయిని పెంచుకుంటూ స్టార్‌ హీరోగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ‘వర్షం, ఛత్రపతి, భిల్లా, మిస్టర్‌ ఫర్ఫెక్ట్‌, మిర్చి, బాహుబలి’ లాంటి చిత్రాలతో బాక్సాఫీసు దగ్గర సత్తా చాటారు. ప్రస్తుతం ప్రభాస్‌ నటిస్తున్న ‘ఆదిపురుష్‌, సలార్‌, ప్రాజెక్ట్‌ కె’ చిత్రాలు సెట్స్‌పైన ఉన్నాయి. ఇవ న్నీ పాన్‌ ఇండియా స్థాయిలో ఆయన రేంజ్‌ని మరింత పెంచే చిత్రాలే. ఇష్టపడి సినిమాలు చేయడమే తప్ప విజయంపై ఎలాంటి లెక్కలు వేసుకోలేదు ప్రభాస్‌. జయాపజయాలు ఎదురైనా, మనసుకు నచ్చిన సినిమాలు చేస్తూ వచ్చారు. కెరీర్‌లో మంచి స్థాయిలో ఉన్న సమయంలో ‘బాహుబలి’ చిత్రం కోసం నాలుగైదేళ్లు కేటాయించి సాహసం చేశారనే చెప్పాలి. ఆ సినిమా కోసం ప్రభాస్‌ పడిన కష్టాన్ని పలు సందర్భాల్లో దర్శకుడు రాజమౌళి ప్రశంసించారు. స్టార్‌ ఇమేజ్‌ను పక్కనపెట్టి, నలుగురితో ఆత్మీయంగా కలసిపోవడం, ఒదిగి ఉండే వ్యక్తిత్వం ప్రభాస్‌ సొంతం. ఆ గుణమే ఇప్పుడు అందరి హీరోల అభిమానులు ఇష్టపడే కథా నాయకుణి ్ణ చేసింది.