DailyDose

కోర్టుల్లో పోరాటాలు తగ్గించుకోవాలి..-కొత్త చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌ స్పష్టీకరణ

కోర్టుల్లో పోరాటాలు తగ్గించుకోవాలి..-కొత్త చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌ స్పష్టీకరణ

దేశంలో పెండింగ్‌ కేసుల పరిష్కారానికి న్యాయమూర్తుల సంఖ్య పెంచడంతో పాటు కేసుల నిర్వహణ, నాణ్యత కూడా బాగుండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ స్పష్టం చేశారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో అత్యధికం ప్రభుత్వానికి సంబంధించినవేనని.. సర్కారే అతిపెద్ద లిటిగెంట్‌ అని గురువారం ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వివాదాల పరిష్కారానికి ప్రభుత్వం ఓ విధానం తీసుకురావాలని, కోర్టుల్లో పోరాటాన్ని తగ్గించుకోవాలని సూచించారు. కోర్టు వెలుపల పరిష్కారాలు, మధ్యవర్తిత్వం, టెక్నాలజీ వాడకం వంటి ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కార విధానాలు పాటించాలని సూచించారు. పెండింగ్‌ కేసులు తగ్గించేందుకు.. తరచూ వాయిదాల సంస్కృతికి అడ్డుకట్ట వేయాలని, నిరర్థక కేసులు ఏరివేయాలని తెలిపారు. హైకోర్టుల్లో 1,108 మంది న్యాయమూర్తులు ఉండాలని.. ఇందులో 30 శాతం పోస్టులు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయని చెప్పారు. పెండింగ్‌ కేసులను ఎదుర్కోవాలంటే యుద్ధ ప్రాతిపదికన వాటిని కూడా భర్తీ చేయాలన్నారు. ప్రతి రాజ్యాంగ కోర్టు న్యాయమూర్తి తన పదవీస్వీకార ప్రమాణానికి అనుగుణంగా.. భయం, పక్షపాతం లేకుండా విధులు నిర్వహించాలని.. కేసును పరిష్కరించేటప్పుడు రాజ్యాంగ విలువలైన వ్యక్తి గౌరవం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. పౌరుల హక్కుల సంరక్షకులమన్న విషయం గుర్తెరగగాలని హితవు పలికారు. ఏ కేసూ చిన్నది కాదని తెలుసుకోవాలన్నారు.