Agriculture

రాజధాని పరిధిలోని ఆ గ్రామాల్లోనూ గ్రామ సభలు పెట్టండి

రాజధాని పరిధిలోని ఆ  గ్రామాల్లోనూ గ్రామ సభలు పెట్టండి

రాజధాని అమరావతిలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాల పంపిణీపై గ్రామసభలు నిర్వహించకుండానే అభ్యంతర ప్రతాలు అడుగుతున్నారని రైతులు వేసిన లంచ్‌మోషన్‌ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. మిగిలిన 17 గ్రామాలకు సంబంధించి రెండ్రోజుల్లో గ్రామసభలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.రాజధాని అమరావతికి రైతులు ఇచ్చిన భూముల్లో.. రాజధానేతర ప్రాంత ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సీఆర్‌డీఏ సవరణ చట్టం (యాక్ట్‌ 13) తీసుకొచ్చింది. రెసిడెన్షియల్‌ జోన్‌-5లో అందుకు అనుగుణంగా మాస్టర్‌ ప్లాన్‌లో సవరణలు తీసుకొచ్చేందుకు గెజిట్‌ ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణకు ఆయా గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులు ప్రకటన జారీ చేశారు. ఆ ప్రకటనలను సవాలు చేస్తూ నిన్న మందడం, లింగాయపాలెం గ్రామస్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేశ్‌.. ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని సీఆర్‌డీఏ కమిషనర్, పంచాయతీల ప్రత్యేక అధికారులను ఆదేశించారు..
ఇవాళ విచారణ సందర్భంగా.. సీఆర్‌డీఏ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం పాటించలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ముందుగా రాజధాని ప్రాంతంలో ఉన్న పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన తర్వాతే మిగిలిన అంశాలు చూడాలని రైతుల తరఫు న్యాయవాది తెలిపారు. గ్రామసభలు నిర్వహించకుండా అభ్యంతర పత్రాలు అడుగుతున్నారని, వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేస్తున్నారని ధర్మాసనానికి తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. కచ్చితంగా రెండ్రోజుల్లో 17 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.