NRI-NRT

వలసదారులకు యూఏఈ తీపికబురు

వలసదారులకు యూఏఈ తీపికబురు

వలసదారులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీపి కబురు చెప్పింది. రెసిడెన్సీ వీసా రద్దు లేదా గడువు ముగిసిన తర్వాత దేశాన్ని విడిచి వెళ్లేందుకు గ్రేస్ పీరియడ్‌ను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు ఉన్న రెండు నెలల వ్యవధిని ఆరు నెలలకు పెంచింది. ఈ మేరకు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ (ICP) తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ సందర్భంగా తాజాగా పెంచిన 180 రోజుల గ్రేస్ పీరియడ్ అనేది ఏ కేటగిరీల వారికి వర్తిస్తుందో కూడా ఐసీపీ తెలియజేసింది. ఇది ప్రధానంగా గోల్డెన్ వీసాదారులు, గ్రీన్ వీసా హోల్డర్స్‌తో పాటు వారి వారి ఫ్యామిలీ మెంబర్స్, చదువు పూర్తైన విద్యార్థులు, నైపుణ్యం కలిగిన నిపుణులకు (మానవ వనరుల మంత్రిత్వశాఖ, ఎమిరైటైజేషన్ వర్గీకరణలోని మొదటి, రెండో స్థాయికి చెందినవారు) వర్తిస్తుంది.

ఇక 90 రోజుల గ్రేస్ పీరియడ్ అనేది నైపుణ్యం కలిగిన నిపుణులు (మానవ వనరుల మంత్రిత్వశాఖ, ఎమిరైటైజేషన్ వర్గీకరణలోని మూడో స్థాయికి చెందినవారు), ఎమిరేట్స్‌లో ఆస్తులు కలిగిన యజమానులకు వర్తిస్తుందని ఐసీపీ పేర్కొంది. అలాగే 60 రోజుల గ్రేస్ పీరియడ్ సాధారణ నివాసితులకు వర్తిస్తే.. 30 రోజుల గ్రేస్ పీరియడ్ అనేది ఇతర కేటగిరీలకు చెందినవారికి వర్తిస్తుందని ఐసీపీ చెప్పుకొచ్చింది. కాగా, సాధారణంగా ప్రవాసులు వీసా క్యాన్సిల్ అయిన తర్వాత గ్రేస్ పీరియడ్ ముగిసేలోగా దేశం నుంచి వెళ్లడం లేదా కొత్త వీసా పొందాల్సి ఉంటుంది. యూఏఈ తీసుకున్న తాజా నిర్ణయంపట్ల వలసదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమర్జెన్సీ సమయాల్లో ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారు చెబుతున్నారు.