Health

వెదురు బియ్యం.. మహాభాగ్యం

వెదురు బియ్యం.. మహాభాగ్యం

ఇంటి నిర్మాణంలో వెదురు వినియో గం తెలియనిది కాదు. ఎంతోకాలం మన్నిక ఉండే ఇదే వెదురు చెట్టు నుంచి బియ్యం వ స్తే.. అవి ఆరోగ్యానికి మేలు చేస్తాయని తెలిస్తే.. ఇంతకన్నా మహాభాగ్యం ఏం ఉంటుంది ? ఇతర వృక్షజాతుల కంటే 35 శాతం అధికంగా ప్రాణవాయువు ఇచ్చే ఈ పచ్చ బంగారం దీర్ఘకాలిక వ్యాధులనూ నయం చేస్తున్నది. అరుదుగా లభించే వెదురు బియ్యంతోపాటు టీ పౌడర్‌ వంటి ఉత్పత్తులు ఆన్‌లైన్‌ మార్కెట్‌లో విక్రయిస్తుండగా, ఇతర ఉత్పత్తులు అటవీ ప్రాంతాల్లో విరివిగా లభిస్తున్నాయి.

50 ఏండ్లకు వెదురు బియ్యం
వెదురు మొక్కకు 50 ఏండ్లు నిండాక కంకులు వేసి (పుష్పించి) వాటిలో నుంచి ధాన్యం మాదిరి వడ్లు వస్తాయి. వాటి నుంచి బియ్యం సేకరిస్తారు. ఒక్కో వెదురు చెట్టు 50 ఏండ్ల వయసులో ఒకసారి మాత్రమే 1-2 కిలోల బియ్యం వరకు ఇస్తుంది. ఈ బియ్యంతో అన్నం, పాయసం, పొంగలి చేసుకోవచ్చు. వీటి వినియోగంతో వెన్నునొప్పి, కీళ్లనొప్పులతో పాటు కొలెస్ట్రాల్‌ స్థాయి తగ్గుతున్నదని అధ్యయనాల్లో వెల్లడైంది. వీటిలో తక్కువగా ఉండే ైగ్లెసిమిక్‌ ఇండెక్స్‌ మధుమేహాన్ని అదుపులో ఉంచుతున్నది. అధికంగా ఉండే ఐరన్‌, ఫాస్పరస్‌ వంటి మూలకాలు గుండెకు మేలు చేయడంతోపాటు రక్తపోటును నియంత్రిస్తాయి. ఈ బియ్యంలో క్యాల్షియం, భాస్వరం, ఇనుముతోపాటు మాంసకృత్తులు, విటమిన్‌ బీ-6, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఎముకలను దృఢంగా ఉంచటంలో సహాయపడుతాయి. నల్లమల అటవీ ప్రాంతంలో లభించే ఈ వెదురు బియ్యాన్ని ఆదివాసీల నుంచి ఈ -కామర్స్‌ సంస్థలు కొనుగోలు చేసి విక్రయిస్తున్నాయి.

రెమ్మ రెమ్మకో రోగం నయం
వెదురు బియ్యమే కాదు.. వీటి రెమ్మలు కూడా వివిధ వ్యాధులను నయం చేస్తాయి. వెదురు మొలకలు (వెదురు దుంప నుంచి మొలకెత్తేవి), రెమ్మలు, చిగుళ్లతో వివిధ వంటకాలు తయారు చేసుకోవచ్చు. వీటిని నేరుగా కూడా తినొచ్చు. ఇటీవల కాలంలో సూప్‌లలో వీటిని విరివిగా వినియోగిస్తున్నారు. తాజా పిలకలు, చిగుళ్లతో ఊరగాయలు తయారు చేస్తున్నారు. వెదురు రెమ్మలను తింటే గుండెజబ్బులు రాకుండా చూసుకోవచ్చని కార్డియాలజిస్టులు సైతం సిఫార్సు చేస్తున్నారు. వీటిలో క్యాన్సర్‌ నిరోధక, యాంటీ బయాటిక్‌, యాంటీ వైరల్‌ లక్షణాలు ఉన్నట్టు పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అంతేకాదు వెదురు పిలకలు, చిగుళ్లతో చేసిన వంటకాలను తినడం ద్వారా ఊబకాయాన్ని నియంత్రించొచ్చని చెబుతున్నారు.

వెదురు ఉప్పు.. బహుప్రియం
వెదురు ఉప్పును కొరియాలో విరివిగా వినియోగిస్తుంటారు. అందుకే దీన్ని కొరియన్‌ సాల్ట్‌ అని పిలుస్తారు. మూడేండ్ల వయసున్న వెదురును సేకరించి, వాటిని సమానంగా కత్తిరించి, అందులో సముద్రపు ఉప్పు నింపి బాగా కాలుస్తారు. ఈ క్రమంలో వెదురు నుంచి వెలువడిన ద్రవాలు ఉప్పుతో కలుస్తాయి. ఇలా తొమ్మిదిసార్లు చేస్తే ఉప్పు ఉదారంగులోకి మారుతుంది. అందుకే దీన్ని ‘పర్పుల్‌ సాల్ట్‌ ’ అని కూడా అంటుంటారు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన లవణాల్లో ఇదొకటి. దీని ధర పావు కిలో రూ.8వేలకు పైనే. వెదురు ఉప్పులో క్యాన్సర్‌ను నిరోధించే గుణాలు ఉండటంతోపాటు చర్మ, దంత సౌందర్యానికి ఉపకరిస్తుంది.