Devotional

నిమిషాల్లో అమ్ముడుపోయిన శ్రీవారి దర్శన టికెట్లు.. – TNI ఆధ్యాత్మికం

నిమిషాల్లో అమ్ముడుపోయిన శ్రీవారి దర్శన టికెట్లు..  –  TNI ఆధ్యాత్మికం

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి డిసెంబరు నెలకు సంబంధించిన రూ.300 దర్శన కోటాను టీటీడీ శుక్రవారం ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేసింది. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి డిసెంబరు నెలకు సంబంధించిన రూ.300 దర్శన కోటాను టీటీడీ శుక్రవారం ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేసింది. కోటా విడుదలైన 80 నిమిషాల్లోనే 5,06,600 టికెట్లను భక్తులు బుక్‌ చేసుకున్నారు. డిసెంబరు నెల టికెట్ల కోటాను అక్టోబరులోనే విడుదల చేయాల్సి ఉంది. అయితే వీఐపీ బ్రేక్‌ దర్శన సమయాన్ని డిసెంబరు నుంచి మార్పు చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకున్న క్రమంలో స్లాట్ల సర్దుబాటులో భాగంగా జాప్యం జరిగింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌ ద్వారా 5,06,600 టికెట్లను వివిధ స్లాట్లలో విడుదల చేసింది. 11.20 గంటల సమయానికంతా భక్తులు తమకు కావాల్సిన తేదీల్లో టికెట్లను వేగంగా బుక్‌ చేసుకున్నారు. జియో ప్లాట్‌ఫామ్‌ లిమిటెడ్‌ క్లౌడ్‌ టెక్నాలజీ ద్వారా టికెట్ల కోటాను విడుదల చేయడంతో ఎలాంటి సాంకేతి సమస్య లేకుండా భక్తులు సులభతరంగా టికెట్లను పొందారు. ఈ టికెట్ల విక్రయం ద్వారా టీటీడీకి దాదాపు రూ.15.20 కోట్ల ఆదాయం సమకూరింది

2. యాదాద్రికి పెరిగిన విదేశీయుల రాక
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి విదేశీ పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఒకప్పుడు నూతన సంవత్సర వేడుకల సమయంలోనే కనిపించే విదేశీ భక్తులు.. నూతన ఆలయ పునఃప్రారంభం తర్వాత వారానికి రెండు, మూడు సార్లు కొండపై కనిపిస్తున్నారు. శుక్రవారం జర్మన్‌కు చెందిన నలుగురు మహిళలు స్వామివారిని దర్శించుకుని ఆలయ పునర్నిర్మాణం మహాద్భుతంగా ఉందని కితాబిచ్చారు. అమెరికాతోపాటు యూఏఈ, ఆస్ట్రేలియా, జర్మన్‌, న్యూజిలాండ్‌, యూరప్‌, కెనడా, ఖతార్‌, సింగపూర్‌, స్కాట్లాండ్‌కు చెందిన భక్తులు స్వామివారిని దర్శించుకొంటున్నారు. పూర్తి కృష్ణ శిలలతో నిర్మితమైన స్వామివారి ఆలయం దేశంలో గొప్ప దేవాలయంగా పేరొందుతుందని అభిప్రాయపడుతున్నారు. మీడియా ప్రసారాలతో పాటు ప్రవాస భారతీయ భక్తుల రాక, సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారంతో ప్రపంచవ్యాప్తంగా స్వామివారికి విదేశీ భక్తులు పెరిగారు. ఈ ఏడాది అక్టోబర్‌ 10 నుంచి ఈ నెల 10 వరకు అధికంగా 678 అమెరికా డాలర్లు, 230 యూఏఈ దిరామ్స్‌తో పాటు వివిధ దేశాలకు చెందిన కరెన్సీ భారీగా స్వామివారి ఖజానాకు సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

3. నిబంధనల మేరకే తితిదే లడ్డూ బరువు
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం బరువు, నాణ్యత విషయంలో భక్తులు ఆందోళన చెందాల్సిన పనిలేదని.. నిబంధనల మేరకే బరువు, నాణ్యత ఉన్నాయని తూనికలు, కొలతల శాఖ డిప్యూటీ కంట్రోలర్‌ సీహెచ్‌ దయాకర్‌రెడ్డి తెలిపారు. శ్రీవారి లడ్డూ విక్రయ కేంద్రాన్ని అసిస్టెంట్‌ కంట్రోలర్‌ పి.సుధాకర్‌తో కలిసి శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. కౌంటర్లలో లడ్డూలను తూకం వేసిన అధికారులు బరువును పరిశీలించారు. వారి పరిశీలనలో 160 నుంచి 194 గ్రాముల మధ్య లడ్డూ బరువు ఉన్నట్లు గుర్తించారు. డిప్యూటీ కంట్రోలర్‌ మాట్లాడుతూ.. లడ్డూ విక్రయకేంద్రాన్ని తరచూ తూనికలు కొలతల శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారని తెలిపారు. ఆ సమయంలో ఎటువంటి తేడాలు లేవని పేర్కొన్నారు. లడ్డూ బరువుపై ఇటీవల సోషల్‌ మీడియాలో వచ్చిన భక్తుని వీడియోను పరిశీలించామని చెప్పారు. బరువు తక్కువ చూపించిన తూనిక యంత్రాన్ని పరిశీలించగా అందులో ఓ వైరు మధ్యలో పడటంతో తేడా వచ్చినట్లు గుర్తించామని, దీనిపై సంబంధిత కౌంటర్‌ సిబ్బందికి అవగాహన లేకపోవడంతో వివాదం నెలకొందని తెలిపారు.

4. బొమ్మనహాళ్‌ మండలంలోని ఉంతకల్లు, ఉద్దేహాళ్‌, దేవగిరి క్రాస్‌, హరేసముద్రం తదితర గ్రామాలలో గజగౌరీ, కడ్లేగౌరమ్మ ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. శుక్రవారం వేకువజామున నుంచి గజగౌరీ, కడ్లేగౌరమ్మలను భారీ ఊరేగింపు నిర్వహించారు. వేదావతి హగరి, హెచ్చెల్సీ కాలువలలో గౌరీదేవికు పూజలు నిర్వహించి నిమజ్జనం చేశారు. అలాగే ఉద్దేహాళ్‌ గ్రామంలో గజగౌరీ ఉత్సవాల్లో
భాగంగా శుక్ర వారం జిల్లా పరిషత్‌ హైస్కూలు మైదానంలో ఉల్లాసంగా, ఉత్సాహంగా రాతిదూలం లాగుడు పోటీలు నిర్వహించారు

5. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. క్యూలైన్లు కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపలకు వచ్చాయి. సర్వ దర్శనం టోకెన్ పొందిన భక్తులకు వారికి కేటాయించిన టైం నుంచి 6 గంటల సమయం పడుతోంది. శుక్రవారం 61,304 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.66 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 32,351 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు

6. కార్తీక వన భోజనం కార్యక్రమాన్ని ఆదివారం నాడు తిరుమలలో జరుగనున్నది. గోగర్భం సమీపంలో గల పార్వేట మండపంలో వన భోజనం నిర్వహిస్తారు. పవిత్రమైన కార్తీకమాసంలో వనభోజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. విశేష సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశాలు ఉన్నందున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా టీటీడీ సర్వం సిద్దం చేసింది.
ఇందులో భాగంగా ఉదయం 8.30 గంటలకు శ్రీ మలయప్పస్వామి చిన్న గజవాహనంపై, ఉభయనాంచారులు పల్లకిపై ఆలయం నుంచి బయలుదేరి ఊరేగింపుగా పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. ఉదయం 11 నుంచి 12 గంటల నడుమ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామికు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల నడుమ కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ఉత్సవం కారణంగా శ్రీవారి అలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. వనభోజనం కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొంటారు

7. కార్తిక శనివారం పురస్కరించుకుని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయం, అనుబంధ రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ సాగుతున్నది. ఉదయం నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ఆలయ తిరువీధులు, ముఖ మండపం, క్యూ కాంప్లెక్, క్యూ లైన్లు భక్తులతో నిండి పోయాయికార్తిక మాసం సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు సాగుతున్నాయి. శివాలయంలో శివుడికి దీపారాధన, ప్రత్యేక పూజలు చేశారు. కొండ కింద వ్రత మండపంలో సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అర్చకులు సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం చేశారు. స్వామి, అమ్మవార్లను పట్టువస్ర్తాలతో అలంకరించి గజవాహన సేవ చేశారు. అనంతరం తూర్పుకు అభిష్టంగా స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి నిత్య తిరుకల్యాణోత్సవం సాగుతున్నది.