DailyDose

TNI నేటి తాజా వార్తలు

TNI  నేటి తాజా  వార్తలు

*హిమాచ‌ల్ ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు ఇవాళ జ‌రుగుతున్నాయి. సిరాజ్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఆ రాష్ట్ర సీఎం జైరామ్ థాకూర్ ఓటేశారు. ఆయ‌న ఫ్యామిలీ కూడా ఇవాళ ఓటింగ్‌లో పాల్గొన్న‌ది. మండీలోని 44వ పోలింగ్ స్టేష‌న్‌లో ఆయ‌న ఓటేశారు. ఎన్నిక‌ల్లో విజ‌యం సాధిస్తామ‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. ఫీడ్‌బ్యాక్ అద్భుతంగా ఉంద‌న్నారు. ప్ర‌జ‌లు శాంతియుతంగా ఓటింగ్‌లో పాల్గొంటున్నార‌ని ఆయ‌న తెలిపారు.

*ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రామగుండంపై పర్యటనపై కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… ‘‘నువ్వేం పొడిచావని రామగుండం వస్తున్నావు నరేంద్ర మోదీజీ. 1980లో కాంగ్రెస్ హయాంలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే దాని బీజేపీ ప్రభుత్వం 1999 మూసింది. మళ్ళీ 2014లో అప్పటి తెలంగాణ ప్రాంత ఎంపీల చొరవతో ఫ్యాక్టరీ పునఃప్రారంభం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం’’ అంటూ పొన్నం ప్రభాకర్ ట్వీట్ చేశారు.

*నెల్లూరు: జిల్లాలోని డైకాస్ రోడ్డు ఓవెల్ స్కూల్‌లో దారుణం జరిగింది. తొమ్మిదేళ్ల విద్యార్థినిపై పీఆర్వో బ్రహ్మయ్య లైంగిక దాడికి పాల్పడ్డాడు. కొన్ని రోజులుగా తరగతి గదుల్లోకి తీసుకెళ్లి విద్యార్థినిని బ్రహ్మయ్య ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. బ్రహ్మయ్య వేధింపులు శృతి మించడంతో బాధిత విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందించింది. దీంతో తల్లిదండ్రులు స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ విషయంపై ప్రశ్నించగా స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెబుతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో బ్రహ్మయ్యపైన అనేక ఆరోపణలు ఉన్నట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. బాధిత విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు బ్రహ్మయ్యను అదుపులోకి తీసుకున్నారు. బ్రహ్మయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు

*హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో గత నాలుగు దశాబ్దాలుగా ఏ పార్టీ కూడా రెండోసారి అధికారంలోకి రాలేదు. అయితే, ఈసారి మాత్రం సంప్రదాయానికి భిన్నంగా ఓటర్లకు తమకు వరుసగా రెండోసారి కూడా పట్టం కడతారని బీజేపీ చెబుతోంది. అయితే, ఓటర్ల సంప్రదాయంపై నమ్మకం పెట్టుకున్న కాంగ్రెస్ మాత్రం ఈసారి తాము అధికారంలోకి రావడం తథ్యమని చెబుతోంది. మరోవైపు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కూడా హిమాచల్ ప్రదేశ్‌పై ఆశలు పెట్టుకుంది.

*గంజాయి పెంచు తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసిన సంఘటన నేరేడ్‌మెట్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం… డిఫెన్స్‌ కాలనీలో సాయిజ్యోతి అపార్టుమెంట్‌లో నివాసముండే తోటకూర సతీష్‌ (50) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. తన అపార్టుమెంట్‌లోని పెంట్‌ హౌజ్‌లోని పూల కుండీలో నాలుగు గంజాయి మొక్కలను పెంచుతున్నాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్‌వోటీ స్‌వోటీ పోలీసులు, నేరేడ్‌మెట్‌ పోలీసులు, తహసీల్దార్‌, ఇద్దరు మధ్యవర్తులతో కలిసి సతీష్‌ ఇంటిపై దాడి చేశారు. ఇంటి ఆవరణలోని అతను పెంచుతున్న నాలుగు గంజాయి మొక్కలను, 5 మీ.మీ. ఒక హష్‌ అయిల్‌టిన్‌ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరసింహ స్వామి తెలిపారు

*కృష్ణాజిల్లా తాహాసిల్దార్ అరెస్ట్ పెనమలూరు తాహాసిల్దార్ బద్రునాయక్ అరెస్ట్ ఆదాయానికి మించిన ఆస్తులు కేసులో బద్రునాయక్ అరెస్ట్ రెండు కోట్ల 58 లక్షల ఆస్తులు గుర్తింపు.బహిరంగ మార్కెట్లో 10 కోట్లు ఉంటుందని అంచనా 17 ఎకరాల వ్యవసాయ భూమి, ప్లాట్లు, వాహనాలు, బంగారం గుర్తింపు..

* తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు మర్యాద లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని మోదీ కి స్వాగతం పలకాలన్న సంస్కారం కూడా లేదన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ ను ఆధునీకరిస్తున్నామని తెలిపారు. కేసీఆర్‌కు తెలంగాణ అభివృద్ధి పట్టదని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రొటోకాల్‌ పాటించకుండా గవర్నర్‌ను అవమానిస్తున్నారన్నారు. ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి లేదన్నారు. కిరాయి రౌడీలతో బ్యానర్లు కట్టినంత మాత్రాన మోదీని అడ్డుకోలేరన్నారు. మళ్లీ మళ్లీ వస్తాం.. వెయ్యి మంది కేసీఆర్‌లు వచ్చినా ఏం చేయలేరన్నారు. మీ తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

*కేవీ విద్యుత్తు టవర్లు నిలువునా కూలితే? ఆ ప్రమాదాన్ని ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది!! ఔటర్‌ రింగ్‌ రోడ్డు చౌరస్తా-గజ్వేల్‌ వైపున సర్వీస్‌ రోడ్డుకు ఆనుకొని ఉన్న 220 కేవీ, 132 కేవీ డబుల్‌ సర్క్యూట్‌ లైన్లతో కూడిన రెండు టవర్లు కూల్చేందుకు భారీ కుట్రే జరిగింది! ఈ టవర్లకు అడుగు భాగంలో, మధ్య భాగంలో మూడేసి స్తంభాలకు ఉన్న వందలకొద్దీ బోల్టులను దుండగులు మాయం చేశారు. ఎందుకీ పని చేసినట్లు? అంటే.. టవర్లు కూలిపోతే గనక ఆ స్థానంలోనే టవర్లు పెట్టరని.. ఫలితంగా భూముల విలువ పెరుగుతుందని, తేలిగ్గా అమ్ముకోవచ్చునని భావించే దుండగులు ఈ పనికి తెగించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఏ కేవీ టవర్‌ అయినా నాలుగు స్తంభాలతో ఉంటుంది. అందులో మూడు స్తంభాలకున్న బోల్టులను ఊడదీస్తే టవర్‌ ఉంటుందా? బహుశా ఏ చిన్న గాలి వీచినా రెండూ నిలువునా కూలిపోయేవే! అయితే దీన్ని ట్రాన్స్‌కో అధికారులు గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

*తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ జనవరి 27 నుంచి రాష్ట్రవ్యాప్త పాదయాత్ర ప్రారంభించనున్నారు. రాయలసీమ నుంచి ఆయన తన యాత్రను ప్రారంభించి ఉత్తరాంధ్రలో ముగించనున్నట్లు పార్టీ వర్గాలు ధ్రువీకరించాయి. జనవరిలో సంక్రాంతి తర్వాత యాత్ర ప్రారంభించాలని ఆయన ఇంతకు ముందే నిర్ణయించుకొన్నారు. 24, 27 తేదీల్లో ఒక రోజును ఎంపిక చేసుకోవాలని పండితులు సూచించగా, రిపబ్లిక్‌ దినోత్సవం మర్నాడు 27 తేదీ శుక్రవారం నుంచి చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్రానికి ఒక కొసన ఉన్న కుప్పం నుంచి ఈ యాత్ర ప్రారంభమై ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళంతో ముగియనుంది. కనీసం ఏడాదిపాటు ఇది కొనసాగుతుందని టీడీపీ వర్గాలు తెలిపాయి. 2024 ఏప్రిల్‌, మే నెలల్లో సాధారణ ఎన్నికలు జరగాల్సి ఉంది. దీనికి కొద్దిగా ముందు ఫిబ్రవరి లేదా మార్చి నెల వరకూ పాదయాత్రను నడిపించాలన్న పట్టుదలతో లోకేశ్‌ ఉన్నారు. ఈ లెక్కన సుమారు 400 రోజులపాటు ఈ యాత్ర సాగుతుంది.
* మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు మరో షాక్ తగిలింది. ఠాక్రే శివసేన జాతీయ కార్యవర్గ సభ్యుడైన ఎంపీ గజానన్ కీర్తికర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే వర్గంలోకి ఫిరాయించారు.సీఎం షిండే, ఇతర నేతల సమక్షంలో ఎంపీ కీర్తికర్ ఠాక్రే శివసేన నుంచి షిండే శిబిరంలో చేరారు.( అనంతరం కీర్తికర్ ను తమ ఠాక్రే వర్గ శివసేన నుంచి బహిష్కరించినట్లు ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.
*ఇంటర్మీడియట్‌ పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్‌లైన్‌ పద్ధతిలో వాల్యుయేషన్‌ను నిర్వహించడానికి ఇంటర్‌ విద్యామండలి ఆమోదం తెలిపింది. తద్వారా మూల్యాంకనం త్వరగా పూర్తవడంతోపాటు మార్కులు, ఆన్సర్‌ షీట్ల వెరిఫికేషన్‌ సులువవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విధానం ఇప్పటికే పలు యూనివర్సిటీల్లో అమల్లో ఉంది. దాంతో ఇంటర్‌లో కూడా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అన్ని సబ్జెక్టులకు ఒకేసారి కాకుండా ముందుగా లాంగ్వేజీలకు మాత్రమే ఈ విధానాన్ని అమలు చేయనుంది. ఇందులో విజయవంతమైతే మిగతా సబ్జెక్టు పేపర్లకు కూడా వర్తింపజేయనుంది.

*గ్రానైట్‌ కంపెనీల్లో ఈడీ జరిపిన సోదాల్లో కొత్త విషయాలు బయటపడ్డాయి. మంత్రి గంగుల కమలాకర్‌, ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు సంబంధించిన కంపెనీలతోపాటు హైదరాబాద్‌, కరీంనగర్‌లోని సంస్థలు ఫెమా (విదేశీ ద్రవ్య నిర్వహణ చట్టం) నిబంధనలను అతిక్రమించినట్లు ఈడీ తేల్చింది. ఈ సంస్థలన్నీ చైనా, హాంకాంగ్‌తోపాటు ఇతర దేశాల్లోని కంపెనీలకు చెల్లించిన రాయల్టీకి మించిన పరిమాణంలో ముడి గ్రానైట్‌ ఎగుమతి చేసినట్లు పూర్తి ఆధారాలతో ఈడీ నిర్ధారించింది. లెక్కల్లోకి రాని మొత్తం ఆ దేశాల నుంచి హవాలా మార్గంలో తరలించినట్లు గుర్తించింది. ఇక చైనాకు చెందిన లీవెన్‌ హ్యూ అనే వ్యాపారి ఖాతా నుంచి గ్రానైట్‌ సంస్థల యజమానుల ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో నగదు జమైనట్లు కూడా అధికారులు గుర్తించారు. అంతర్జాతీయంగా పన్ను ఎగవేతదారుల వివరాలతో పనామా లీక్స్‌ విడుదల చేసిన జాబితాలో లివెన్‌ హ్యూ పేరు ఉండటం విశేషం.

* అర్ధరాత్రి దాటాక కూడా బార్‌ ముసుగులో పబ్‌ నిర్వహిస్తున్న ఎస్‌ఆర్‌నగర్‌లోని ఓ బార్‌ నిర్వాహకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. హన్మంతు కృష్ణారావు ఎస్‌ఆర్‌నగర్‌లో కొంత కాలంగా బార్‌ ముసుగులో పబ్‌ నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఎస్‌ఐ స్వప్న తన సిబ్బందితో కలిసి బార్‌కు వెళ్లి పరిశీలించగా, అధిక శబ్ధాల హోరులో డ్యాన్స్‌లు చేయడం గమనించారు. సీఐ సైదులు ఆదేశాల మేరకు నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. సౌండ్‌ సిస్టం, లైట్లు, ఇతర సామగ్రిని సీజ్‌ చేశారు.

*అండమాన్ నికోబార్ దీవుల్లో ఓ యువతిపై సామూహిక అత్యాచారం కేసులో మాజీ ప్రధాన కార్యదర్శి జితేంద్ర నరైన్‌ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. అండమాన్ అండమాన్ నికోబార్దీ వుల మాజీ చీఫ్ సెక్రటరీ జితేంద్ర నరైన్,ఇతరులు తనపై సామూహిక అత్యాచారం చేశారని 21 ఏళ్ల మహిళ దాఖలు చేసిన ఫిర్యాదుపై పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.ఈ కేసులో జితేంద్ర నరైన్ ను జిల్లా సెషన్స్ కోర్టు రిమాండుకు తరలించింది.రిమాండ్‌లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారితో పాటు కేంద్రపాలిత ప్రాంతాన్ని కుదిపేసిన ఈ కేసులో ఇంకా దొరకని ఇతర సహ నిందితులపై విచారణ కొనసాగించాలని పోలీసులను కోర్టు కోరింది.ముందస్తు బెయిల్ కోసం స్థానిక కోర్టు తిరస్కరించడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.అరెస్టు తర్వాత తాను కుట్రకు బలి అయ్యానని నరేన్ పేర్కొన్నాడు.ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నరైన్‌ను మూడుసార్లు ప్రశ్నించింది.

*లక్డీకాపూల్‌ మెట్రో స్టేషన్‌లోని సిగ్నలింగ్‌ వ్యవస్థలో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది. కారిడార్‌ – 1 ఎల్‌బీనగర్‌ – మియాపూర్‌ మార్గంలోని లక్డీకాపూల్‌ స్టేషన్‌లో శుక్రవారం ఉదయం 11.15 గంటలకు సిగ్నలింగ్‌ వ్యవస్థ పని చేయలేదు. దాదాపు 45 నిమిషాల పాటు సిగ్నల్‌ కనెక్ట్‌ కాకపోవడంతో స్టేషన్‌కు వచ్చిన రైలు అక్కడే ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. సిబ్బంది సమస్యను పరిష్కరించడంతో రైలు అక్కడి నుంచి బయలుదేరింది. లక్డీకాపూల్‌లో సమస్య కారణంగా పంజాగుట్ట, ఎంజీబీఎస్‌ స్టేషన్‌లో కూడా రైళ్లు ఆగిపోయాయి.

*తైవాన్‌ కంపెనీలన్నీ ఒకేచోట ఏర్పాటు చేసేందుకు తెలంగాణ – తైవాన్‌ పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. పరిశ్రమలకు నిర్దిష్ట కాలవ్యవధిలో అనుమతులు ఇచ్చేందుకు టీఎస్‌ ఐపాస్‌ లాంటి విప్లవాత్మక విధానం అమలు చేస్తున్నామని, దీంతో కేవలం 15 రోజుల్లోపే అనుమతులు పొందవచ్చని పేర్కొన్నారు. హైదరాబాద్‌ – తైవాన్‌ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ (టీమా), తైపీ ఎకనామిక్‌ అండ్‌ కల్చరల్‌ సెంటర్‌ (టీఈసీసీ) బృందం ప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌ శుక్రవారం ప్రగతిభవన్‌లో సమావేశం అయ్యారు.

*రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఆయన నివాసంలో కలుసుకున్నారు. శుక్రవారం సాయంత్రం వీరి భేటీ జరిగింది. ప్రధాన న్యాయమూర్తిని ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా కలిశారని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

*స్టేట్‌ ఇన్‌చార్జి ఆడిట్‌ డైరెక్టర్‌ ఒంటెత్తు పోకడకలకు నిరసనగా వారం రోజుల్లో మళ్లీ నిరసనకు సిద్ధమవుతున్నట్లు ఏపీ స్టేట్‌ ఆడిట్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు రవిశంకర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

* ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పెనమలూరు తహసిల్దార్‌ గుగులోతు భద్రు నాయక్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఏసీబీ అధికారులు శుక్రవారం.. భద్రు, ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులకు సంబంధించిన ఆరు ప్రదేశాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. కానూరులో భద్రు నివాసం ఉంటున్న మనోహరి హైట్స్‌, పెనమలూరు తహసీల్దార్‌ కార్యాలయం, గుంటుపల్లి, కుమ్మరకుంట్ల, కుదప తండా, కొండపల్లిలో సోదాలు నిర్వహించారు. భద్రు, ఆయన కుటుంబసభ్యుల పేరుతో ఒక ఫ్లాటు, ఒక ఇల్లు, ఒక ఖాళీ నివేసన స్థలం, 17.35 ఎకరాల వ్యవసాయ భూమి, విలాసవంతమైన కారు, రెండు మోటారు సైకిళ్లు, సుమారు 230 గ్రాముల బంగారాన్ని ఏసీబీ అధికారుల సోదాల్లో గుర్తించారు. వీటి విలువ రూ.2.54 కోట్లు ఉంటుందని అంచనా. భద్రు ఆదాయానికి మించి సుమారు రూ.2.05 కోట్ల విలువైన ఆస్తిని కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రూ.20 కోట్లు పైమాటేనని అంచనా. ఆయన్ను ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నా

*నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్రంలో నిర్మిస్తున్న ఇళ్లను త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేయాలని రాష్ట్ర గృహనిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టరుగా పనిచేసి ఇటీవలే ముఖ్యమంత్రి కార్యాలయానికి బదిలీపై వెళ్లిన నారాయణ భరత్‌గుప్తా వీడ్కోలు సభలో శుక్రవారం అజయ్‌జైన్‌ ప్రసంగించారు. హౌసింగ్‌ కార్పొరేషన్‌ ప్రస్తుత ఎండీ లక్ష్మీషా, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

*భూముల సర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీని ఈ నెల 25 నుంచి చేపట్టాలని సర్కారు నిర్ణయించినట్లు తెలిసింది. రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. శ్రీకాకుళం లేదా నర్సన్నపేట నుంచి లాంఛనంగా చేపట్టే అవకాశం ఉంది. సీఎం జగన్‌ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అదేరోజు పట్టాదారు పుస్తకాల పంపిణీతోపాటు 2వేల గ్రామాల నూతన రెవెన్యూ రికార్డులను రైతులకు అంకితం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 25నే ఎల్‌పీఎన్‌ పుస్తకాలను కూడా సీఎం ఆవిష్కరించనున్నారు.

* హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో రోడు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కమలాపూర్‌ మండలంలోని శనిగరం శివారులో లారీ, కారు ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు

* ప్రధాని మోదీ నేడు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ పోలీసులు హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సోమాజిగూడ‌, మోన‌ప్ప ఐలాండ్, రాజ్‌భ‌వ‌న్ రోడ్, ఖైర‌తాబాద్ జంక్షన్ ప‌రిధిలో మ‌ధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి

* ఈడబ్ల్యూఎస్‌ కోటాపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రిజర్వేషన్ల అంశంపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తున్న వేళ.. జార్ఖండ్‌ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రంలో వివిధ వర్గాలకు కల్పిస్తున్న రిజర్వేషన్లను 60 శాతం నుంచి 77 శాతానికి పెంచుతూ సీఎం హేమంత్‌ సొరేన్‌ సర్కార్‌ అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన అసెంబ్లీ ప్రత్యేక సెషన్‌లో జార్ఖండ్‌లో పోస్టులు, సేవల ఖాళీల రిజర్వేషన్‌ చట్టం-2001 సవరణలతో కూడిన బిల్లును పాస్‌ చేసింది.

* ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం నల్లమల అడవి
ప్రాంతంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న సంఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. చెట్టును ఢీకొనగానే కార్లో ఉన్న బెలూన్లు తెరుచుకోవడంతో కారులో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి గాయాలు అవ్వలేదు. ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసుల సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.

* వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు.శుక్రవారం వికేంద్రీకరణపై అనంతపురం గుత్తి రోడ్డులోని కేటీఆర్ ఫంక్షన్ హాల్లో ‘అభివృద్ధి వికేంద్రీకరణ జేఏసి’ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విశ్వేశ్వరరెడ్డి, అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి అధ్యక్షుడు కేవీ రమణ,బార్ కౌన్సిల్ మెంబర్ ఆలూరురామిరెడ్డి,ఏపీపీఎస్సి మాజీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి వికేంద్రీకరణ ఒక్కటే ఏకైక మార్గమని చెప్పారు. రాజధానికి సంబంధించి శివరామకృష్ణన్‌ కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలను అప్పటి ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకుండానే ముందుకెళ్లడంతోనే ఈ సమస్య తలెత్తిందన్నారు.రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పాలన వికేంద్రీకరణ అవసరమని పేర్కొన్నారు. 29 గ్రామాల కోసం సమస్య సృష్టించడం సరికాదన్నారు. అమరావతి అభివృద్ధికి ఐదు నుంచి పదేళ్లు పడుతుందని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్‌ రూ.2 లక్షల కోట్లు అయితే అమరావతి అభివృద్ధికి రూ.5 లక్షల కోట్లు అవసరమవుతాయన్నారు. మూడు రాజధానుల అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలో చర్చ జరగాలన్నారు.మేధావులందరూ ఐక్య కార్యాచరణతో మూడు రాజధానులపై ప్రజావాణి వినిపించాలని కోరారు. సమావేశంలో వికేంద్రీకరణ సాధన సమితి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

* తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం వస్తుందని, టీడీపీ పుట్టిందే తెలంగాణ గడ్డపైనే అంటూ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు టీ పాలిటిక్స్‌లో చర్చకు దారి తీశాయి. ఈ క్రమంలో చంద్రబాబు వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల స్పందించారు.

* హైదరాబాద్ లో మంత్రి హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ లో చేరిక. కృష్ణతో పాటు పదిమంది మండల బిజెపి కార్యకర్తలు పార్టీలో చేరారు వారందరికీ టిఆర్ఎస్ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన మంత్రి హరీష్ రావు. దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి టిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఎన్నికల సమయంలో బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో విఫలమైనందువల్ల టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు కృష్ణ తెలిపారు, ఇకపై టిఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.

* హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీకి ఎన్నికలు సాఫీగా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు 56 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుననది. రాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం 68 స్థానాలకు పోలంగ్‌ జరుగుతున్నది.లాహౌల్ స్పితిలో అత్యధికంగా 62.75 శాతం ఓటింగ్ నమోదైంది. రెండో స్థానంలో 60.38 శాతం ఓటింగ్‌తో సిర్మౌర్ ఉన్నది. సీఎం జైరామ్ ఠాకూర్ సొంత జిల్లా మండిలో 58.90 శాతం ఓటింగ్‌ పోలైంది. చంబా జిల్లాలో అత్యల్పంగా 46 శాతం పోలింగ్ జరిగింది.హిమాచల్‌ అసెంబ్లీ బరిలో మొత్తం 412 మంది అభ్యర్థులున్నారు. రాష్ట్రంలోని దాదాపు 56 లక్షల మంది ఓటర్లు తమ భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. వీరిలో పురుషులు 28,54,945 మంది, మహిళలు 27,37,845 మంది, థర్డ్ జెండర్ ఓటర్లు 38 మంది ఉన్నారు. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనున్నది. 2017లో రాష్ట్రంలో 75.57 శాతం ఓటింగ్ నమోదైంది.