Movies

తాను చేస్తున్న బిజినెస్‌ గురించి ప్రియాంక చోప్రా ఏం చెబుతోంది?

తాను చేస్తున్న బిజినెస్‌ గురించి ప్రియాంక చోప్రా ఏం చెబుతోంది?

మాడల్‌, నటి, గాయని, వ్యాపారవేత్త, నిర్మాత.. ఇన్ని బాధ్యతలకు న్యాయం చేస్తూనే భార్యగా, అమ్మగా పరిపూర్ణ జీవితాన్ని ఆస్వాదిస్తున్నది మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా. పెండ్లి తర్వాత హాలీవుడ్‌పై ఫోకస్‌ చేసింది ప్రియాంక. నటిగా, వ్యాపారవేత్తగా ఎన్నో అవార్డులు సాధించి అత్యంత శక్తిమంతమైన మహిళగా నిలిచింది. తన సొంత హెయిర్‌కేర్‌ బ్రాండ్‌ ‘అనామలి’తో మరోసారి వార్తల్లో నిలిచింది. తన వ్యాపారం గురించి, జీవితం గురించి ప్రియాంక ముచ్చట్లు..

మనకు నచ్చినట్టుగా మనం బతకడమే జీవితం. ఎదుటివాళ్లకు నచ్చేలా బతకడం కుదిరే పనికాదు. ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చకపోవచ్చు. అందుకే ఒక నటిగా, మహిళగా ఈ సమాజంలో బాధ్యతగల వ్యక్తిగా నాకు ఇష్టమైన మార్గం వైపే మొగ్గు చూపుతాను. నేనేమిటో నాకు తెలుసు. ఏదో ఒకరోజు ప్రపంచానికీ తెలుస్తుందని నమ్ముతాను. అందుకే విమర్శలకు, పుకార్లకు కుంగిపోను.

మల్టీ టాస్కింగ్‌ అనేది మహిళల రక్తంలోనే ఉంది. అందుకే నటిగా క్షణం కూడా తీరికలేని సమయంలోనే వ్యాపారంలోకి అడుగుపెట్టాను. నిర్మాతగా మారాను. వివిధ బ్రాండ్లలో పెట్టుబడులు పెట్టాను. ఇప్పుడు నా సొంత బ్రాండ్‌ ప్రారంభించాను. ఇల్లాలిగా, అమ్మగా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాను. ప్రస్తుతం కుటుంబానికే నా తొలి ప్రాధాన్యం.

నాకు చిన్నప్పటినుంచీ పొడవాటి జుట్టు ఉంది. పదిహేడేండ్ల వయసులో ఇండస్ట్రీకి వచ్చాను. తొలినాళ్లలో నా కేశాలను సింగారించుకోవడానికే రెండుమూడు గంటలు పట్టేది. మన జుట్టు తీరుపైనే మన ఆత్మవిశ్వాసం ఆధారపడి ఉంటుందని నేను నమ్ముతాను. దాదాపు అన్ని అంతర్జాతీయ బ్రాండ్ల ఉత్పత్తులనూ కేశాలంకరణకు వాడాను. ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్ధ కేశ నిపుణులతో పనిచేశాను. జుట్టు ఆరోగ్యానికి ఎలాంటి జాగ్రత్తలు అవసరమో నాకు బాగా తెలుసు. అందుకే ‘అనామలి’ అనే సంస్థను ప్రారంభించాను.

అంతర్జాతీయ బ్రాండ్స్‌ వాడటం ఖరీదైన వ్యవహారం. మా సంస్థ ఉత్పత్తులను మాత్రం వాటికంటే అయిదు రెట్ల తక్కువ ధరకే అందుబాటులో ఉంచాం. అలా అని నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ ఉండదు. హంగూ ఆర్భాటాల జోలికి పోకుండా సాధారణ ప్యాకింగ్‌తో, తక్కువ ధరలో మధ్య తరగతికి అందుబాటులో ఉండే ఉత్పత్తులను అందించడమే మా లక్ష్యంగా పెట్టుకున్నాం.

మాసంస్థ ఉత్పత్తుల కోసం సముద్రం నుంచి వెలికితీసిన ప్లాస్టిక్‌ వ్యర్థాలను రీసైకిల్‌ చేసి వినియోగిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణ చాలా ముఖ్యం. ప్రకృతి ప్రేమికురాలిగా ఇలాంటి సంస్థను ప్రారంభించడం నా బాధ్యతగా భావిస్తున్నా.

ప్రయాణం ప్రారంభమై ఇరవై రెండేండ్లు గడిచిపోయింది. ఇరవైలలోని ఆలోచనలు ఇప్పుడు లేవు. అందులోనూ నలభైకి వచ్చాక చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. జీవితంలో నేర్చుకున్న పాఠాలు నన్ను పరిపూర్ణ మహిళగా తీర్చిదిద్దాయి. తప్పులు చేయడం సహజం. కానీ వాటిని సరిదిద్దుకోగలగాలి. కష్టాలు, తప్పులు, విజయాలు, కీర్తి.. అన్నీ కలగలిస్తేనే జీవితం.

ఆరేండ్లుగా రకరకాల వ్యాపకాల్లో బిజీగా ఉన్నా. దీంతో భారతీయ సినిమాల్లో కనిపించలేకపోయాను. వచ్చే రెండుమూడేండ్లలో వరుస సినిమాలతో నా అభిమానులను తప్పకుండా పలకరిస్తా. ప్రస్తుతం హాలీవుడ్‌ సినిమాలు, పుస్తక రచన, వ్యాపారం, సేవా కార్యక్రమాల్లో తలమునకలుగా ఉన్నా.