DailyDose

పెళ్లి సందడి

పెళ్లి సందడి

‘పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు/ తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ/ మూడే ముళ్ళు.. ఏడే అడుగులు/ మొత్తం కలిసీ నూరేళ్ళు’ అంటాడో సినీకవి. తాటాకులతో పందిరి వెయ్యాలి. మామిడాకులతో తోరణాలు కట్టాలి. అరటి ఆకుల్లో భోజనాలు పెట్టాలి. అదీ పెళ్లంటే అన్నది మరో సినిమాలో డైలాగ్‌. గతంలో పెళ్లిళ్లు ఇలాగే జరిగేవి. గడచిన పదేళ్లలో ఈ పెళ్లి కాన్సెప్ట్‌ మారిపోయింది. హంగూ ఆర్భాటాలకు పెళ్లిళ్లు వేదిక అవుతున్నాయి. నిశ్చయ తాంబూలాలు, ప్రీవెడ్డింగ్‌ వీడియో షూట్లు, ఆర్భాటంగా మండపాలు కట్టడం, మెహందీ, సంగీత్‌, దావత్‌లతో హడావుడి చేయడం ఒక ట్రెండ్‌గా మారింది. ఇప్పుడు పెళ్లిళ్లు ఇంటి ముందు వేసే తాటాకుల పందిళ్ల నుంచి ఫంక్షన్‌ హాళ్లకు మారాయి. ఆకాశమంత పందిరేమో గానీ, చుక్కలన్నీ వరుసకట్టి నేలమీదకొచ్చినట్లుగా విద్యుద్దీపాలు, డీజె మోతలతో అట్టహాసంగా కనిపించేవి. ఈ మధ్య పెద్దపెద్ద పెళ్లిళ్లన్నీ… ఫంక్షన్‌ హాళ్ల నుంచి రిసార్ట్స్‌కి, హోటళ్లకి మారిపోతున్నాయి. కట్నకానుకల సంస్కృతి కూడా విషవృక్షంలా వేళ్లూనుకొని పోయింది. పెళ్లంటే రెండు జీవితాలను ముడివేసే బంధం. జీవితంలో అదొక అద్భుత సందర్భం. కాబట్టి ఆ సందర్భాన్ని సంతోషంగా జరుపుకోవాలి.

‘స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే బ్రదర్‌’ అంటాడు ఆచార్య ఆత్రేయ. పెళ్ళిళ్లకైతే… ఇక ఆ వైభవాన్ని మాటల్లో చెప్పలేం. ఇప్పుడంతా మ్యారేజ్‌ కంట్రాక్టర్లు, ఈవెంట్‌ మేనేజర్లదే హవా. ఇల్లు మనం చూపిస్తే… షామియానా వాళ్లేస్తారు. బిల్లు మనం కడితే… వంటలు వాళ్లు చేస్తారు. పెళ్లివారిని మనం చూపిస్తే… మర్యాదలు వాళ్లు చేస్తారు. ముహూర్తం మనం చెబితే… ముత్తైదువులను వాళ్లు సప్లరు చేస్తారు. పెళ్లివారు చేయాల్సిందల్లా పట్టుబట్టలు కట్టుకొని ఫొటోలకు ఫోజులివ్వడమే. పెళ్లి అంటే రెండు కుటుంబాల్లో జరిగే ఒక వేడుక. మరికొంత మందికి ఇదొక వ్యాపారం. తగ్గేదేలే అన్నట్టుగా సామాన్యుల నుంచి… మధ్య తరగతి ప్రజల వరకు పెళ్ళికి భారీగా ఖర్చు పెడుతున్నారు. పెళ్లి తర్వాత అప్పుల పాలవుతున్నారు. తాజాగా పెళ్లిళ్లకు సంబంధించి ఆసక్తికర లెక్కలు బయటికొచ్చాయి.

నవంబర్‌ 4 నుంచి డిసెంబర్‌ 14 వరకు దేశ వ్యాప్తంగా 32లక్షల వివాహాలు జరగనున్నట్టు కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ (సిఎఐటి) అంచనా వేసింది. ఇక ఈ పెళ్లిళ్లకయ్యే ఖర్చు… అక్షరాలా రూ.3.75 లక్షల కోట్లని అంచనా. గతేడాది ఇదే సీజన్‌లో దేశంలో 25లక్షల పెళ్లిళ్లు జరగ్గా.. రూ.3లక్షల కోట్లు మేర వ్యాపారం జరిగిందట. స్త్రీ పురుషులిద్దరు, వారి బంధు మిత్రులతో జరుపుకోవలసిన పెళ్లి… ఇప్పుడు కార్పొరేట్‌ వ్యవహారంగా మారిపోవడం నేటి వైచిత్రి. నయా ఉదారవాద ఆర్థిక విధానాలు వచ్చాక, పెరిగిన వినిమయతత్వం గొప్పలకు పోయే ధోరణిని పెంచింది. అది వ్యాపారులకు వరంగా మారగా, చాలా కుటుంబాలకు అప్పులను మిగుల్చుతోంది. పెళ్లిళ్లలో దేనికి ఎంత ఖర్చు అవుతున్నదనే విషయంపై కూడా సిఎఐటి అంచనా వేసింది. 20 శాతం ఖర్చు పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు అయితే, మిగతా 80 శాతం ఖర్చు పెళ్లి నిర్వహణకే అవుతోందని అంచనా.

పెళ్లి సందడి జీవితంలో మధురమైన జ్ఞాపకంగా వుండాలి. అంతేగానీ అవసరానికి మించిన ఆడంబరాలకు ఖర్చుచేసి, ఎలా తీర్చాలా అని మధనపడే పరిస్థితి వుండ కూడదు. జీవితంలోని సంతోషకరమైన ఆ క్షణాలు… ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోకూడదు. అందుకే.. వున్నదాంట్లో సంతృప్తిపడాలి. ఎంతవరకు ఖర్చు పెట్టగలమో ఆలోచించుకోవాలి. ఒక్కరోజు ఆర్భాటం కోసం ఉన్నదంతా ఊడ్చిపెట్టేస్తే… ఆ జంటకు, లేదా ఆయా కుటుంబాలకు తర్వాత మిగిలేది అప్పుల చిట్టా మాత్రమే. పెళ్లికి కావాల్సింది… ఒకరికోసం ఒకరు బతకాలనుకునే ఇద్దరు వ్యక్తులు, వారి సంతోషాన్ని పంచుకోడానికి వచ్చే కొద్దిమంది బంధుమిత్రులు చాలు. ‘పెళ్లంటే ఇద్దరు వ్యక్తుల వ్యవహారం. ఇద్దరు సాక్షులూ, రిజిస్ట్రారు అవసరం’ అంటాడు చాసో. కేవలం రూ.500 ఖర్చుతో పెళ్లి చేసుకొని ఆదర్శంగా నిలిచిన వారున్నారు. రూ.500 కోట్లు ఖర్చు పెట్టి ఆడంబరంగా చేసుకున్న వారూ వున్నారు. పెళ్లి పేరుతో ఆడంబరాలకు పోయి, తాహతుకు మించి ఖర్చు చేయకుండా… తాటాకు పందిట్లోనైనా ఆహ్లాదకరంగా జరుపుకుంటే… ఆ పెళ్లి సందడి జీవితాంతం ఒక మధురమైన జ్ఞాపకంగా వుంటుంది