NRI-NRT

చలో అమెరికా…పైచదువుల కోసం విద్యార్థుల క్యూ

చలో అమెరికా…పైచదువుల కోసం విద్యార్థుల క్యూ

భారతీయ విద్యార్థులు అమెరికాకు క్యూ కడుతున్నారు. 2021-22 విద్యా సంవత్సరంలో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు అమెరికాలో వివిధ యూనివర్సిటీల్లో చేరారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది సుమారు 40 వేల మంది అధికంగా వెళ్లడం విశేషం. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సోమవారం విడుదల చేసిన ఓపెన్‌ డోర్స్‌ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం… 2021-22 విద్యా సంవత్సరంలో పలు దేశాలకు చెందిన 9,48,519 మంది విద్యార్థులు అమెరికాలో చదువుకునేందుకు వెళ్లారు. వీరిలో 1,99,182 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. అంటే మొత్తం విద్యార్థుల్లో సుమారు 21 శాతం భారతీయులే. ఈ విషయంలో చైనా అగ్రస్థానంలో ఉంది. ఆ దేశం నుంచి 2,90,086 మంది విద్యార్థులు అమెరికా వెళ్లారు. మూడేళ్ల క్రితం (2018-19లో) అత్యధికంగా 2,02,014 మంది భారతీయ విద్యార్థులు అమెరికా వెళ్లడం గమనార్హం. ఆ తర్వాత కరోనా కారణంగా రెండేళ్లపాటు విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. అలాగే 2021-22లో స్పెయిన్‌ నుంచి అమెరికా వెళ్లిన విద్యార్థుల సంఖ్య ఏకంగా 41 శాతం పెరిగింది. బంగ్లాదేశ్‌ విద్యార్థులు కూడా భారీగా అమెరికాకు తరలివెళ్లారు. పాకిస్తాన్‌ విద్యార్థుల సంఖ్య 17 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.

*21శాతం స్టూడెంట్స్‌ మనవాళ్లే
అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో 52 శాతం మంది చైనా, భారత్‌కు చెందినవారేనని ఓపెన్‌ డోర్స్‌ నివేదిక తెలిపింది. అక్కడి విదేశీ విద్యార్థుల్లో 31 శాతం మంది చైనాకు చెందినవారు కాగా, 21 శాతం మంది భారతీయ విద్యార్థులున్నారు.