NRI-NRT

అయితే కాలిఫోర్నియా.. లేకుంటే న్యూయార్క్‌!

అయితే కాలిఫోర్నియా.. లేకుంటే న్యూయార్క్‌!

అమెరికా.. ఎంతోమంది విద్యార్థుల ఆశల సౌధం. ఉన్నత విద్య కోసం అత్యధికులు క్యూకట్టే దేశం. అక్కడ చదువుకోవడానికి వెళ్తున్నవారిలో ఎక్కువమంది కాలిఫోర్నియా బాట పడుతున్నారు. ఆ తర్వాత న్యూయార్క్‌ రాష్ర్టానికి ఓటేస్తున్నారు. 2021 -22 సంవత్సరానికి 9,48,519 మంది విదేశీ విద్యార్థులు అమెరికాకు వెళ్తే.. వారిలో 1.32 లక్షల మంది కాలిఫోర్నియాకు, 1.06 లక్షల మంది విద్యార్థులు న్యూయార్క్‌కు వెళ్లారు.ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ (ఐఐఈ) ప్రచురించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. కొవిడ్‌-19 అనంతర పరిస్థితులను ఈ నివేదికలో పొందుపరిచారు. కరోనా కారణంగా విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గినట్టుగా ఈ నివేదిక వెల్లడించింది. 2020-21, 2021-22 విద్యా సంవత్సరాల్లో ఏటా 9 లక్షల మంది మాత్రమే అమెరికా వెళ్లగా.. 2017-18 నుంచి 2019-20 సంవత్సరాల్లో 10 లక్షలకు పైగా విద్యార్థులు అమెరికా విమానం ఎక్కారు.
p1-2
న్యూయార్క్‌ వర్సిటీ టాప్‌
అత్యధిక విద్యార్థులు ఎంచుకొనే యూనివర్సిటీల్లో న్యూయార్క్‌ వర్సిటీ టాప్‌లో నిలిచింది. ఇందులో అత్యధికంగా 21,081 మంది విదేశీ విద్యార్థులు చేరారు. ఆ తర్వాత బోస్టన్‌లోని నార్త్‌ ఈస్ట్రన్‌ యూనివర్సిటీలో 17,836 విద్యార్థులు చేరారు. కొలంబియాలో 16,956, యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ కాలిఫోర్నియాలో 15,729, అరిజోనా స్టేట్‌ యూనివర్సిటీలో 15,293 మంది అంతర్జాతీయ విద్యార్థులు ప్రవేశాలు పొందారు.