NRI-NRT

ఎలాన్‌ మస్క్‌ అమ్మను చూశారా?!

ఎలాన్‌ మస్క్‌ అమ్మను చూశారా?!

టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ ప్రపంచ ప్రఖ్యాత వ్యాపారవేత్తగా చాలామందికి సుపరిచితమే. అయితే ఇటీవల ట్విటర్‌ కొనుగోలు వ్యవహారం, అందులోనూ సంస్థను నష్టపరిచే దుందుడుకు నిర్ణయాలతో అతని పేరు హాట్‌ టాపిక్‌గా నిలిచింది. తన కొడుకును ఊరికే విమర్శిస్తున్నారనీ, తను ఎంతో జీనియస్‌ అనీ చెబుతూ వార్తలకెక్కారు ఆయన తల్లి మేయ్‌ మస్క్‌. దీంతో ఆమె గురించి ఆసక్తికరంగా వెతుకుతున్నారు నెటిజన్లు.

74 ఏండ్ల మేయ్‌ ఒక సూపర్‌ మోడల్‌. దాదాపు 50 సంవత్సరాల తన మోడలింగ్‌ కెరీర్‌లో వోగ్‌, టైమ్‌, న్యూయార్క్‌ టైమ్స్‌లాంటి ప్రముఖ పత్రికల కవర్‌ పేజీలపై మెరిశారు. అంతేకాదు ఆమె పౌష్టికాహార నిపుణురాలు. అయితే ఆమె జీవితం కనిపించినంత అందమైనదేం కాదు. ఇష్టపడి చేసుకున్న భర్త పెళ్లి అయినప్పటి నుంచి ఆమెను మానసికంగా హింసించడంతోపాటు కొట్టేవాడు. ఆ నరకం నుంచి బయటపడాలని అనుకున్నా అప్పుడు వీళ్లు నివాసమున్న దక్షిణాఫ్రికా చట్టాలు గృహహింసను పట్టించుకోకపోయేవి. విడాకులకు దానిని ఒక కారణంగా ఒప్పుకొనేవి కావు. దాంతో ఆమె ఎన్నో ఏండ్లు ఆ బంధంలో కూరుకుపోయారు.

చట్టాలు మారాక విడాకులు పొందిన మేయ్‌.. ఎలాన్‌ సహా ముగ్గురు పిల్లలతో ఒంటరి తల్లిగా మారారు. వాళ్లను పోషించడం కోసం రాత్రీపగలూ కష్టపడేవారు. ఒకేసారి ఐదు ఉద్యోగాలు చేశారు. సెకండ్‌ హ్యాండ్‌ దుస్తులు ధరించేవారు. ఖరీదైన తిండి కొనలేక తక్కువ ఖర్చుతో బలవర్ధకమైన ఆహారం తయారు చేయడం సొంతంగా నేర్చుకున్నారు. బయటికి తీసుకెళ్లే స్తోమత లేక పిల్లలకు క్షవరం కూడా ఆమే చేసేవారు. ఒకసారి పాలు తీసుకొచ్చినప్పుడు పిల్లల్లో ఒకరు పొరపాటున వాటిని నేలపాలు చేశారట. అప్పుడు మేయ్‌ పెద్దగా వెక్కివెక్కి ఏడ్చారట. ఎందుకంటే మళ్లీ ఆ పూట పాలు కొనడానికి తన దగ్గర డబ్బులు లేవని! జీవితంలో తాను చూసిన భయంగొలిపే ఎత్తుపల్లాలను తెలుపుతూ ‘ఎ ఉమెన్‌ మేక్స్‌ ఎ ప్లాన్‌’ పుస్తకాన్ని రాశారు మేయ్‌. మా జీవిత పాఠాలే పిల్లలకు కష్టం విలువ నేర్పాయని చెబుతారు. అన్నానికి ఇబ్బందిపడ్డ స్థితి నుంచి పిల్లల్ని అపర కుబేరులుగా తీర్చిదిద్దే క్రమంలో ఆ దారంతా ఎన్ని స్వేదధారలతో తడిసి ఉండాలి మరి!