Movies

కృష్ణ ఫ్యామిలీ విశేషాలు ఇవే..!

కృష్ణ ఫ్యామిలీ విశేషాలు ఇవే..!

హీరోగా నటశేఖరుడి సినీ ప్రస్థానం పెళ్ళి తర్వాతే మొదలైంది. కృష్ణ హీరోగా తొలి సినిమా ‘తేనే మనసులు’ ప్రారంభమయ్యే నాటికే ఇందిరా దేవితో పెళ్లయింది. పెళ్లికి ముందు కృష్ణ ‘కుల గోత్రాలు’, ‘పదండి ముందుకు’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించాడు. ఇక కృష్ణ, ఇందిరా దేవిని 1962 నవంబర్‌1న వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఏడాది కృష్ణ కీలకపాత్రలో నటించిన ‘పరువు ప్రతిష్ట’ సినిమా రిలీజైంది. ఈ చిత్రం కృష్ణకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత రెండేళ్లు గ్యాప్‌ తీసుకుని తేనె మనుసులు సినిమాతో హీరోగా మారాడు. తొలి సినిమాతోనే కృష్ణ సూపర్‌ హిట్ సాధించాడు.

కృష్ణ, ఇందిరలకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. పెద్ద కొడుకు రమేష్‌బాబు 1965 అక్టోబర్‌ 13న జన్మించాడు. చైల్డ్‌ ఆర్టిస్టుగా కెరీర్‌ ప్రారంభించిన రమేష్‌బాబు హీరోగా 15కు పైగా సినిమాల్లో నటించి, ఆ తర్వాత నిర్మాతగా మారాడు. నిర్మాతగా తొలి సినిమా అమితాబ్‌బచ్చన్‌తో సూర్యవంశం హిందీ రీమేక్‌ తెరకెక్కించాడు. ఈ సినిమా తర్వాత మహేష్‌ బాబు నటించిన అర్జున్‌, అతిథి, దూకుడు, ఆగడు వంటి సినిమాలను నిర్మించాడు. కాగా రమేష్‌బాబు ఈ ఏడాది జనవరి 8న అనారోగ్యంతో మరణించాడు.

చిన్న కొడుకు మహేష్‌ బాబు హీరోగా స్థిర పడ్డాడు. రమేష్‌బాబు హీరోగా నటించిన నీడ సినిమాతో మహేష్‌ చైల్డ్‌ ఆర్టిస్టుగా కెరీర్‌ ప్రారంభించాడు. కృష్ణ, మహేష్‌ బాబు కలిసి పది సినిమాల్లో నటించాడు. అందులో మహేష్‌ 7 చైల్డ్‌ ఆర్టిస్టుగా నటించగా, మూడు చిత్రాల్లో హీరోగా నటించాడు. అంతేకాకుండా కృష్ణ, మహేష్‌బాబును మేయిన్‌లీడ్‌లో పెట్టి బాలచంద్రుడు అనే బాలల సినిమాకు దర్శకత్వం వహించాడు.

కృష్ణ పెద్ద కూతురు పద్మావతి సినిమాలకు దూరంగా ఉంది. ఈమె ప్రముఖ వ్యాపార వేత్త, ఎంపీ గల్లా జయదేవ్‌ను 1991లో పెళ్లి చేసుకుంది. ఈమె కుమారుడు అశోక్‌ గల్లా ఇటీవలే హీరో సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.

కృష్ణ రెండవ కూతురు మంజుల సినీరంగంలో కొనసాగుతుంది. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా పలు విభాగాల్లో పనిచేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె భర్త సంజయ్‌ స్వరూప్‌ కూడా నటుడిగా సినీరంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

కృష్ణ చిన్న కుమార్తే ప్రియదర్శిని కూడా సినిమాలకు దూరంగా ఉంది. ఈమె ప్రముఖ హీరో సుధీర్‌బాబుకు భార్య. వీరిద్ధరికి 2006లో వివాహం అయింది. వీరి వివాహం తరువాతే సుధీర్‌బాబు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ప్రామిసింగ్‌ హీరోగా కొనసాగుతున్నాడు.

కృష్ణ, ఇందిరా దేవిని పెళ్లి చేసుకున్న ఏడేళ్ళకు తన సహ నటి విజయ నిర్మిలను రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే విజయ నిర్మలకు కృష్ణ మూర్తితో పెళ్లయి నరేష్‌ కూడా పుట్టాడు. 1967లో బాపు-రమణలు దర్శకత్వం వహించిన ‘సాక్షి’ సినిమాతో మొదటి సారిగా కృష్ణ, విజయ నిర్మల కలిసి నటించారు. వీళ్లిద్దరు కలిసి 50పైగాచిత్రాల్లో నటించారు. చివరిగా వీళ్ళద్దరు కలిసి ‘శ్రీ శ్రీ’ అనే సినిమాలో నటించారు. కృష్ణకు కూడా అదే చివరి చిత్రం. అంతేకాకుండా విజయ నిర్మల దర్శకత్వంలో కృష్ణ దాదాపు పదిహేను సినిమాలు చేశాడు. కాగా ఈమె 2019 జూన్‌ 27న అనారోగ్యం కారణంతో మరణించింది.