Devotional

పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకానికి ఏర్పాట్లు – TNI ఆధ్యాత్మిక వార్తలు

పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకానికి ఏర్పాట్లు – TNI ఆధ్యాత్మిక వార్తలు

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 2023 శోభకృత సంవత్సరంలో శ్రీరామ నవమి తరువాత నిర్వహించే పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవానికి దేవస్థానం వైదిక కమిటీ, పరిపాలన అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచల పుణ్యక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని చిరస్థాయిగా నిలిచేలా నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఉత్సవాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించాలనే యోచనలో దేవస్థానం వర్గాలు ఉన్నట్లు సమాచారం. అలాగే రాష్ట్ర గవర్నర్‌, ముఖ్యమంత్రులను సైతం సంప్రదాయ రీతిలో ఆహ్వానించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని చినజీయర్‌స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్ణయించాలని యోచిస్తున్నారు. అలాగే వివిధ వైదిక సంప్రదాయాలకు చెందిన పీఠాధిపతులను రోజుకు ఒకరిని ఆహ్వానించాలని భావిస్తున్నారు.
**తీర్థజలాల సేకరణకు ప్రత్యేక బృందాలు
పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవానికి దేశంలోని 12నదుల నుంచి తీర్థ జలాలను సేకరించి తేవాలని, ఇందుకోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా దేవస్థానం పరిపాలన, వైదిక సిబ్బందిలో 12మంది చొప్పున విభాగాలను రూపొందించి ఆ బృందాలకు రామాయణం ఇతి వృత్తంతో ముడిపడి ఉన్న పేర్లను పెట్టాలని భావిస్తున్నారు. అలాగే భద్రాచలం పట్టణంలోని అన్ని ఇళ్లపై తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక ధ్వజాలను ఎగురవేయాలని నిర్ణయించారు. కాగా 1987లో జరిగిన మహాసామ్రాజ్య పట్టాభిషేకం కోసం చేయించిన వెండి సింహాసనమే ఇప్పటి వరకు స్వామి వారికి వినియోగిస్తుండటంతో త్వరలో స్వామి వారికి స్వర్ణ సింహాసనాన్ని సిద్దం చేయాలనే యోచనలో ఉన్నట్లు దేవస్థానం వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఒక సావనీర్‌ను కూడా రూపొందించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి నిర్వహించే పుష్కరసామ్రాజ్య పట్టాభిషేకం ఒక ప్రత్యేకతను సంతరించుకునేలా నిర్వహించాలని, తద్వారా భద్రాద్రి అభివృద్ధికి అవకాశం ఉంటుందని దేవస్థానం వర్గాలు భావిస్తున్నాయి.
*ఏర్పాట్లపై కసరత్తు
పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకానికి భక్తుల రాక భారీగా ఉండే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసేందుకు దేవస్థానం అధికారులు, వైదిక సిబ్బంది ప్రాథమికంగా కసరత్తు నిర్వహించగా కీలక అంశాలపై మరికొన్నిసార్లు సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. కరోనా కారణంగా గడిచిన రెండేళ్లుగా దేవస్థానం ఆధ్వర్యంలో భారీగా ఉత్సవాలు నిర్వహించలేకపోవడంతో ఈ ఏడాది శ్రీరామనవమి ఉత్సవాలతో పాటు పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాన్ని భారీ స్థాయిలో నిర్వహించిఒ భక్తులకు మరింతగా చేరువ కావాలనే భావనతో దేవస్థానం అధికారులు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారు

1. 30 రకాల శివలింగాలు
సాధారణంగా మనకు తెలిసినవి శిలా నిర్మితమైన లింగాలు మాత్రమే. అందులో కూడా నల్ల రాతి శివలింగాలే అధికం. కానీ మనకు తెలీని శివ లింగాలు ఇంకా అనేకం ఉన్నాయి. అందులో 30 రకాల శివలింగాలు మరీ ముఖ్యమైనవి, అపురూపమైనవి. ఆయా లింగాలు ఇచ్చే ఫలితాలు అనంతం. అందుకే వాటి గురించి తెలుసుకుందాం.
రకరకాల పదార్ధాలతో రూపొందిన శివలింగాల గురించి పురాణాలు వివిధ సందర్భాల్లో వర్ణించాయి. ఏయే శివలింగాలను పూజిస్తే ఏయే ఫలితాలు కలుగుతాయి.
01. గంధలింగం రెండు భాగాలు కస్తూరి. నాలుగు భాగాలు గంధం, మూడు భాగాలు కుంకుమను కలిపి ఈ లింగాన్ని చేస్తారు. దీనిని పూజిస్తే శివ సాయిజ్యం లభిస్తుంది.
02. పుష్పలింగం నానావిధ సుగంధ పుష్పాలతో దీనిని నిర్మిస్తారు. దీనిని పూజిస్తే రాజ్యాధిపత్యం కలుగుతుంది.
03. నవనీతలింగం వెన్నతో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయి. 04. రజోమయలింగం పుప్పొడితో నిర్మించిన ఈ లింగాన్ని పూజించడం వల్ల విద్యాధరత్వం సిద్ధిస్తుంది.
శివ సాయుజ్యాన్ని పొందగలం.
05. ధాన్యలింగం వలు, గోధుమలు, వరిబియ్యపు పిండితో ఈ లింగాన్ని నిర్మిస్తారు. దీనిని పూజించడం వల్ల సంపదల వృద్ధి, సంతానం కలుగుతుంది.
06. తిలిపిష్టోతలింగం నూగుపిండితో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే ఇష్టసిద్ధి కలుగుతుంది.
07. లవణలింగం హరిదళం, త్రికటుకం, ఉప్పు కలిపి చేసిన ఈ లింగాన్ని పూజిస్తే వశీకరణ శక్తి.
08. కర్పూరాజ లింగం ముక్తిప్రదమైనది.
09. భస్మమయలింగం భస్మంతో తయారు చేస్తారు. సర్వ సిద్ధులను కలుగచేస్తుంది.
10. శర్కరామయలింగం సుఖప్రదం
11. సద్భోతలింగం ప్రీతిని కలిగిస్తుంది.
12. పాలరాతి లింగం ఆరోగ్యదాయకం
13. వంశాకురమయ లింగం వంశవృద్ధిని కలిగిస్తుంది. దీనిని వెదురు మొలకలతో తయారు
చేస్తారు.
14. కేశాస్థిలింగం వెంట్రుకలు, ఎముకలతో తయారు చేస్తారు. ఇది శత్రునాశనం చేస్తుంది.
15. పిష్టమయలింగం ఇది పిండితో తయారు చేయబడుతుంది. ఇది విద్యలను ప్రసాదిస్తుంది.
16. దధిగ్ధలింగం కీర్తిప్రతిష్టలను కలిగిస్తుంది
17. ఫలోత్థలింగం ఫలప్రదమైనది
18. రాత్రిఫలజాతలింగం ముక్తిప్రదం.
19. గోమయలింగం కపిలగోవు పేడతో ఈ లింగాన్ని తయారు చేస్తారు. దీనిని పూజిస్తే ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది. భూమిపై పడి మట్టి కలసిన పేడ పనికిరాదు.
దూర్వాకాండజలింగం
20. తయారుచేయబడిన ఈ లింగం అపమృత్యుభయాన్ని తొలగిస్తుంది.
21. వైడూర్యలింగం శత్రునాశనం, దృష్టిదోషహరం 22. ముక్తాలింగం ముత్యంతో తయారుచేయబడిన
ఈ లింగం ఇష్టసిద్ధిని కలిగిస్తుంది.
23. సువర్ణనిర్మితలింగం బంగారంతో చేసిన ఈ లింగం ముక్తిని కలిగిస్తుంది.
24. రజతలింగం సంపదలను కలిగిస్తుంది.
25. ఇత్తడి – కంచులింగం ముక్తిని ప్రసాదిస్తుంది.
26. ఇనుము – సీసపులింగం శత్రునాశనం చేస్తుంది.
27. అష్టథాతులింగం చర్మరోగాలను నివారిస్తుంది. సర్వసిద్ధిప్రదం.
28. తుష్టోత్థలింగం మారణక్రియకు పూజిస్తారు.
29. స్పటిక లింగం సర్వసిద్ధికరం, అనుకున్న కార్యాలను సఫలీకృతం చేస్తుంది.
30. సీతాఖండలింగం పటికబెల్లంతో తయారు చేసింది. ఆరోగ్యసిద్ధి కలుగుతుంది.

2. ఈనెల 18న తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం మైదానంలో కార్తిక దీపోత్సవం నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లకు సంబంధించి టీటీడీ జేఈవో సదాభార్గవి బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్తిక దీపోత్సవ విశిష్టతను, దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ మ‌హాల‌క్ష్మీ అమ్మవారిని ప్రార్థిస్తూ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు.18న సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు దీపోత్సవం జ‌రుగుతుంద‌న్నారు . మైదానంలో 1800 మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేసిన‌ట్లు తెలిపారు. దీపోత్సవాన్నికి విచ్చేసే మ‌హిళ‌ల‌కు తులసి మొక్కలు అందించాలని సూచించారు. ఇంజినీర్ విభాగం స్టేజీ, బారికేడ్లు, ఇతర ఇంజినీర్ పనులను ముందుస్తుగా పూర్తి చేయాల‌ని ఆదేశించారు. మైదానంలో ఎల్ఇడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేయాలన్నారు.పారిశుధ్య నిర్వహణకు అద‌న‌పు సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆమె వెంట తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, ఎస్వీబీసీ సీఈవో షణ్ముఖ‌ కుమార్, ఎస్ఇ – 2 జ‌గ‌దీశ్వర్ రెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు.

3. యాదాద్రిలో సువర్ణమూర్తులకు బంగారు పుష్పార్చన
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ముఖమండపంలో సువర్ణమూర్తులకు బంగారు పుష్పార్చనలు అత్యంత వైభవంగా జరిగాయి. బుధవారం మన్యుసూక్త పారాయణం జరిపి ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చన జరిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా జరిగిన సువర్ణపుష్పార్చనల్లో భక్తులు పాల్గొని పూజలు చేశారు. స్వయంభూ నారసింహుడికి నిత్యోత్సవాలను అర్చకులు తెల్లవారుజాము నుంచే ప్రారంభించారు. స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధనలు, నిజాభిషేకం జరిపిన అర్చకులు తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన నిర్వహించారు. సాయంత్రం స్వామివారిని గరుఢ వాహనం, అమ్మవారి తిరుచ్చివాహనం వేంచేపు చేసి సేవలు కొనసాగించారు.దర్బార్‌ సేవలో భాగంగా ప్రధానాలయ ముఖ మండపంలో స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా అలంకరించి వేంచేపు చేశారు. స్వామివారికి పారాయణం, స్వామివారి స్వస్తి మంత్రార్థ వంటి మంత్రాలతో శాంతిపజేసి అనంతరం స్వామివారిని గర్భాలయానికి వేంచేపు చేశారు. పాతగుట్ట ఆలయంలో స్వామివారి నిత్యోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. కార్తిక మాసం సందర్భంగా సత్యనారాయణ వ్రతాలు, కార్తిక దీపారాధనలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. సుమారు 17వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఖజానాకు రూ.20,26,825 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్‌.గీత తెలిపారు

4. శ్రీశైలం భ్రమరాంబికామల్లికార్జున స్వామివారి ఆలయ ఆర్జిత సేవల్లో అదికారులు మార్పులు చేశారు. ఈ నెల 23 వరకూ గర్భాలయ సామూహిక అభిషేకాలను నిలిపివేశారు. కార్తీక మాసం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలోనే భక్తుల రద్దీ దృష్ట్యా రాత్రి 9 గంటల తరువాతే స్పర్శ దర్శనం నిర్వహించనున్నారు. శని, ఆది, సోమవారాల్లో స్వర్శ దర్శనాలను ఆలయ అధికారులు రద్దు చేయనున్నారు.

5. టీడీ ఆధ్వర్యంలోని స్థానికాలయాల్లో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తున్నది. తిరుమలతోపాటు స్థానికాలయాల్లో వైకుంఠ ఏకాదశి వచ్చే ఏడాది జనవరి 2 న జరుపనున్నారు. ఏర్పాట్లపై టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం పలు విభాగాల అధికారులతో వర్చువల్ విధానంలో సమీక్షించారు. ఈ సమీక్షకు టీటీడీ ఎస్ఈ-3 సత్యనారాయణ, ఎస్ఈ ఎలక్ట్రికల్ వెంకటేశ్వర్లు, తిరుపతి వీజీఓ మనోహర్, డిప్యూటీ ఈఓలు గుణ భూషణ్ రెడ్డి, గోవిందరాజన్, తదితర అధికారులు పాల్గొన్నారు