DailyDose

TNI నేటి తాజా వార్తలు

TNI  నేటి తాజా  వార్తలు

* సిద్దిపేటలోని కొండపాకలో శ్రీ సత్యసాయి సంజీవని బాలల గుండె చికిత్స, పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం పట్ల మంత్రి హరీశ్‌ రావు ఆనందం వ్యక్తంచేశారు. దక్షిణ భారతదేశ ప్రజలకు ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు చేయడానికి ఈ సెంటర్‌ను నెలకొల్పడంతో తెలంగాణ ప్రత్యేకతను సాధించిందన్నారు. కొండపాకలో కొత్తగా నిర్మించిన శ్రీ సత్యసాయి సంజీవని బాలల గుండె చికిత్స, పరిశోధన కేంద్రాన్ని సద్గురు మధుసూదన్‌సాయితో కలిసి మంత్రి హరీశ్‌ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌ రావు మాట్లాడుతూ.. ప్రతి వంద మంది చిన్నారుల్లో ఒకరు గుండె సంబంధిత వ్యాధితో మృత్యువాతపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని సద్గురు మధుసూదన్‌ సాయి గారిని కోరగానే సానుకూలంగా స్పందించారని, కొండపాకలో బాలల గుండె శస్త్ర చికిత్స కేంద్రాన్ని నెలకొల్పారన్నారు.

* కేంద్ర బొగ్గు గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం యాదగిరిగుట్టకు చేరుకున్న ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ప్రహ్లాద్‌ జోషీకి.. అర్చకులు ఆశీర్వచనం అందించగా, ఆలయ అర్చకులు స్వామివారి లడ్డు ప్రసాదం అందజేశారు. అంతకుముందు ఆయనకు ఆలయ అధికారుల, అర్చకులు ఆలయం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

* ప‌దివేల మంది ఉద్యోగుల‌ను తొల‌గిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ తాజాగా కొలువుల కోత‌కు మ‌రో మార్గాన్ని ఎంచుకుంది. స్వ‌చ్ఛందంగా కంపెనీని వీడాల‌ని కొంద‌రు ఉద్యోగుల‌ను అమెజాన్ కోరుతున్న‌ట్టు స‌మాచారం. ప‌లు విభాగాల్లోని కొంద‌రు ఉద్యోగుల‌కు స్వ‌చ్ఛందంగా రాజీనామా చేసేందుకు ఆఫ‌ర్లు ముందుకు తెచ్చింద‌ని తెలిసింది.

* తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ప్రతిష్టాత్మక నిర్మాణపనులు రికార్డుస్థాయిల్లో పూర్తవుతున్నాయని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జిల్లాలోని అప్పనపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న రెండో బ్రిడ్జి పనులను సంబంధిత అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు.

** బీహార్‌కు చెందిన ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి స‌మీర్ కుమార్ మ‌హాసేత్ ఇంట్లో ఇవాళ ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఐటీశాఖ‌కు చెందిన సుమారు 25 మంది స‌భ్యులు మంత్రి ఇంట్లో త‌నిఖీలు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న ఇంటితో పాటు ఆఫీసులోనూ సోదాలు జ‌రుగుతున్నాయి.త‌నిఖీల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇంకా వెల్ల‌డికాలేదు.

* కేంద్ర రోడ్డు ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. ప‌శ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఆయ‌న ఇవాళ పాల్గొన్నారు. అక్క‌డ గ‌డ్క‌రీ అస్వ‌స్థ‌త‌కు లోనైట్లు తెలుస్తోంది. సిగిగురిలో స్టేజ్‌పై ఆయ‌న సొమ్మ‌సిల్లారు. డాక్ట‌ర్లు ఆయ‌న్ను ప‌రీక్షించారు. షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గిన‌ట్లు ప‌రీక్ష‌ల ద్వారా డాక్ట‌ర్లు పేర్కొన్నారు.

* అక్రమంగా డబ్బు సంపాదించేందుకు నకిలీ స్టాంపులు, రైల్వే బోర్డు అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసిన ఇద్దరిని గోపాలపురం పోలీసులు అరెస్ట్‌ చేశారు. సికింద్రాబాద్‌ పార్శిగుట్ట సంజీవయ్యపురానికు చెందిన బండారు కుమార్‌ (67), తిరుమలగిరి రామకృష్ణపురం గీతానగర్‌కు చెందిన జీ నాగరాజు (49) ఇతను రైల్వేలో చీఫ్‌ టెలీఫోన్‌ ఆపరేటర్లు. ఇద్దరు స్టేషన్‌ పరిధిలో ఉన్న ట్రావెల్స్‌ ఏజెంట్లతో కలిసి ప్రయాణికులకు రైల్వే టికెట్‌లు కన్‌ఫాం చేస్తామని చెబుతున్నారు. ఇందుకోసం నకిలీ స్టాంపులు, రైల్వే బోర్డ్‌ అధికారి సంతకాలను ఫోర్జరీ చేసి ఎమర్జెన్సీ కోటా (ఈక్యూ) కింద కన్‌ఫాం చేయిస్తారు. ఒక్కొక్క టికెట్‌పై రూ.700 నుంచి రూ. 1500 వరకు కమీషన్‌ తీసుకుంటారు. ఈక్యూ కోటా కింద టికెట్లు అధిక సంఖ్యలో రావడంతో అనుమానం వచ్చిన రైల్వే అధికారులు సికింద్రాబాద్‌ ఆర్పీఎఫ్‌ పోలీసులకు పంపించారు.

* దేశంలోనే సిల్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ మిగిలిపోయారని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… సొంత కూతురు, ఎమ్మెల్యేలను అమ్ముకునే పరిస్థితికి కేసీఆర్ (Telangana CM)వచ్చారని విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ భ్రష్టు పట్టడానికి కారణం కొడుకు, బిడ్డలే అని అన్నారు. తెలంగాణను సీఎం కేసీఆర్ స్వయంగా అంధకారంలోకి నెట్టి వేస్తున్నారని ఆరోపించారు. పవర్ సెక్టార్‌ను గాలికొదిలేసి పాలకులు గంజా, డ్రగ్స్ పార్టీల్లో బిజీగా ఉన్నారన్నారు. బిడ్డ బ్యూటీ పార్లర్ మీద సంపాదించిన డబ్బుతో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నట్లు కేసీఆర్ ఫీలవుతున్నారని ఆయన వ్యాఖ్యలు చేశారు.

* నిజామాబాద్: జిల్లాలో పాత కక్షలు భగ్గుమన్నాయి. ఫిబ్రవరిలో దాడి చేసిన గ్యాంగ్ సభ్యుడిని ప్రత్యర్థి వర్గం కిడ్నాప్ చేసి ఆపై హత్యాయత్నానికి పాల్పడింది. డైరీ ఫారం వద్ద మొన్న రాత్రి రిజ్వాన్‌ను పాగల్ ఇర్ఫాన్ మరి కొంతమందితో కిడ్నాప్ చేశాడు. అనంతరం నటరాజ్ థియేటర్ సమీపంలో రీజ్వాన్‌పై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రిజ్వాన్‌ను స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు. గతంలో జంగిల్, ఇబ్బు అనే రౌడీషీటర్‌ల మధ్య జరిగిన దాడి ఘటనే ఈ కిడ్నాప్‌కు కారణంగా తెలుస్తోంది. ఇబ్బూ దొరకకపోవడంతో అతని తమ్ముడు రీజ్వాన్‌ను మరో వర్గం కిడ్నాప్ చేసింది. ప్రస్తుతం రిజ్వాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

* మార్గదర్శి చిట్‌ఫండ్స్‌‌పై వరుసగా మూడో రోజు తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏపీజీఎస్‌టీ , ఏపీడీఆర్‌ఐ, చిట్ రిజిస్టార్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల నుంచి ఆయా బ్రాంచ్‌లకు ఆరుగురు చొప్పున అధికారులు వెళ్లి తనిఖీలు చేపట్టారు. రికార్డుల తనిఖీలో జీఎస్‌టీపై న అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. మార్గదర్శ కార్యాలయాల్లో తనిఖీలు సందర్భంగా పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల నుంచి వస్తున్న ఆదేశాల ఆధారంగా అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నారు.

* ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, యూట్యూబర్ కుండబద్దల సుబ్బారావుపై అనంతపురం పోలీసులు పెట్టిన కేసుపై హైకోర్టు స్టే ఇచ్చింది. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, కాపు రామచంద్రారెడ్డిని విమర్శించారని.. వారిని సీఎం జగన్మోహన్ రెడ్డికి దూరం చేసే అసత్య ప్రచారాలు చేస్తున్నారని కే.రామాంజనేయులు అనే వ్యక్తి గుమ్మగట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు పలు సెక్షన్ల కింద కుండబద్దల సుబ్బారావుపై కేసు నమోదు చేశారు.

* ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కి ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు సలహా ఇచ్చారు. ప్రభుత్వ, రాష్ట్ర వ్యవహారాలు, ఉద్యోగుల సమస్యలతో సజ్జల సతమతం అవుతున్నారన్నారు. ‘‘మీరు వత్తిడి తగ్గించుకోవాలి.. ఉద్యోగులు మాకు పాడే కట్టినా… ప్రభుత్వం ఏదో ఒక రోజు ఉద్యోగులకు మేలు చేస్తోందని ఆశిస్తున్నాం.. 11వ పీఆర్సీలో మమ్మల్ని చంపి 12వ పీఆర్సీలో బ్రతికించడి’’ అంటూ బొప్పరాజు వ్యాఖ్యానించారు

* అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ కంపెనీ అమెజాన్(Amazon) భారీ సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సిద్ధమైంది. వ్యయ భారాన్ని తగ్గించుకునే వంకతో గత కొన్ని రోజులుగా ఐటీ కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపునకు పూనుకున్న సంగతి తెలిసిందే. అమెజాన్ కూడా తాజాగా ఇదే బాటను ఎంచుకుంది. ఒకరిద్దరిని కాదు ఏకంగా ప్రపంచవ్యాప్తంగా అమెజాన్‌లో పనిచేస్తున్న పది వేల మంది ఉద్యోగులను ఉన్నపళంగా ఉద్యోగాల నుంచి తొలగించాలని అమెజాన్ సంస్థ నిర్ణయానికొచ్చినట్లు సమాచారం. ఈ వారంలోనే అమెజాన్‌లో ఈ ఉద్యోగాల కోత ప్రక్రియ మొదలుకానున్నట్లు తెలిసింది. బుధవారమే ఈ ప్రక్రియ మొదలైనప్పటికీ అమెజాన్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. ఎట్టకేలకు అమెజాన్ తాజాగా ఈ వార్తలను ధ్రువీకరించింది. ఉద్యోగాల తొలగింపు వాస్తవమేనని స్పష్టం చేసింది. అమెజాన్‌లో ఆర్థికంగా ఏర్పడిన అనిశ్చితి కారణంగా వర్క్‌ఫోర్స్‌ను తగ్గించుకోవాలని నిర్ణయించినట్లు ఆ సంస్థ వెల్లడించింది.

* ఎదుటి వ్యక్తిపై ప్రతికారం తీర్చుకోవడానికి దుండగులు నానా వేషాలు వేస్తున్నారు. ఎవరూ గుర్తుపట్టకుండా ముఖానికి మాస్కులు వేసుకుని దాడులకు పాల్పడ్డ దారుణ ఘటనలు అనేకం చూస్తున్నా సరికొత్తగా భక్తుల వేషాధారణలో వచ్చి హత్యాయత్నాలకు పాల్పడుతుండడం కలకలం రేపుతుంది. ఏపీలోని కాకినాడ జిల్లా తునిలో టీడీపీ నాయకుడు శేషగిరిరావుపై భవాని మాలలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో శేషగిరి రావు చేతికి, తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. కుటుంబసభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

* దేశంలో తొలి ప్రైవేటు రాకెట్‌ ప్రయోగానికి అంతా సిద్ధమైంది. ఇప్పటివరకు ఇస్రో తయారుచేసిన రాకెట్లను ప్రయోగించడం మాత్రమే మనం చూశాం. కానీ మొదటిసారిగా ఓ ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన రాకెట్ నింగిలోకి దూసుకెళ్లడానికి రెడీగా ఉంది. తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్ షార్‌ నుంచి శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ప్రయోగించనున్నారు. హైదరాబాద్ కి చెందిన స్పేస్ స్టార్టప్ అయిన స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన ఈ రాకెట్‌కు విక్రమ్‌-ఎస్‌ అని నామరకణం చేశారు. కాగా, దీనిని ఈ నెల 12నే ప్రయోగించాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించకపోవడంతో శాస్త్రవేత్తలు వాయిదావేస్తూ వస్తున్నాయి. అయితే నవంబర్‌ 18న ఈ రాకెట్‌ను నింగిలోకి పంపించాలని తాజాగా నిర్ణయించారు.

* ఖానాపూర్ అటవీ ప్రాంతంలో పులి దాడిలో గిరిజనుడు సిడాం భీము మరణించిన ఘటనపై అటవీశాఖ విచారణ చేపట్టింది. అటవీ మార్గంలో 20 కెమెరాలను అధికారులు ఏర్పాటు చేశారు. పులి కదలికలను గుర్తించేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లా అటవీశాఖ అధికారి దినేష్ కుమార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దాడి జరిగిన తీరును బట్టి పులి కాకపోవచ్చని అటవీశాఖ అంచనా వేస్తోంది. మృతుడి రక్త నమూనాలు, వెంట్రుకలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. అటవీ గ్రామాల ప్రజలు ఒంటరిగా పంట చేలకు వెళ్ళొద్దని అటవీ అధికారుల సూచించారు.

* అక్రమంగా డబ్బు సంపాదించేందుకు నకిలీ స్టాంపులు, రైల్వే బోర్డు అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసిన ఇద్దరిని గోపాలపురం పోలీసులు అరెస్ట్‌ చేశారు. సికింద్రాబాద్‌ పార్శిగుట్ట సంజీవయ్యపురానికు చెందిన బండారు కుమార్‌ (67), తిరుమలగిరి రామకృష్ణపురం గీతానగర్‌కు చెందిన జీ నాగరాజు (49) ఇతను రైల్వేలో చీఫ్‌ టెలీఫోన్‌ ఆపరేటర్లు. ఇద్దరు స్టేషన్‌ పరిధిలో ఉన్న ట్రావెల్స్‌ ఏజెంట్లతో కలిసి ప్రయాణికులకు రైల్వే టికెట్‌లు కన్‌ఫాం చేస్తామని చెబుతున్నారు. ఇందుకోసం నకిలీ స్టాంపులు, రైల్వే బోర్డ్‌ అధికారి సంతకాలను ఫోర్జరీ చేసి ఎమర్జెన్సీ కోటా (ఈక్యూ) కింద కన్‌ఫాం చేయిస్తారు. ఒక్కొక్క టికెట్‌పై రూ.700 నుంచి రూ. 1500 వరకు కమీషన్‌ తీసుకుంటారు.

* రైతు వద్ద బహిరంగంగా రూ. 5వేలు లంచం డిమాండ్ చేసిన సంఘటనలో పెనుమూరు మండలం తహసీల్దార్ రమణిపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. తహసీల్దార్ పదవి నుంచి ఆమెకు రివర్స్‌న్ ఇస్తూ చర్యలు తీసుకున్నారు. మరో సంఘటనలో పాత వీఆర్‌వో దొరస్వామి పెనుమూరు తహసీల్దార్ కార్యాలయంలో డీటీపై చిందులు వేశారు. తాను డీటీకి లక్షా 70 వేల రూపాయలు ఫోన్ పే చేశానని.. అతనే తన బదిలీకి కారణం అంటూ వీఆర్‌వో దొరస్వామి డీటీపై చిందులు వేశారు. తాను వీఆర్వోగా పనిచేస్తున్న సమయంలో ఎమ్మార్వోకు తన సొంత డబ్బులు పెట్టి కుర్చీ కొనిచ్చానని చెబుతూ.. ఆ కుర్చీని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారంపై కూడా కలెక్టర్ సీరియస్ అయ్యారు.

* జగన్ రెడ్డి గొడ్డలిపోటును వైసీపీ నేతలు వారసత్వంగా తీసుకున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తుని నియోజకవర్గం టీడీపీ సీనియర్ నాయకులు, తుని ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మాజీ అధ్యక్షులు పోల్నాటి శేషగిరిరావుపై వైసీపీ గూండాల దాడిని ఖండిస్తున్నామన్నారు. వైసీపీ సర్కార్ ఆగడాలకు అడ్డుపడితే అణచివేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కాపు సామాజికవర్గంపై జగన్ రెడ్డి, వైసీపీ నాయకులు గొడ్డళ్లతో వేటాడుతున్నారన్నారు. హత్యలు చేసే ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాలని అచ్చెన్నాయుడు అన్నారు.

* సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై ఆరోపణలు చేస్తూ… సీఎం హోదాలో జగన్‌మోహన్‌రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా సీజేఐకి లేఖ రాయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన రిట్‌ పిటిషన్ విచారణ వాయిదా పడింది. డిసెంబర్ 12న దీనిపై జస్టిస్ ఎం.ఆర్ షా, జస్టిస్ ఎం ఎం సుందరేశ్‌ల ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు‌పై దాఖలైన పిటిషన్లతో కాకుండా విడిగా విచారిస్తామని ధర్మాసనం వెల్లడించింది.

* విశ్వశాంతి కోరుతూ దత్త విజయానంద తీర్థ స్వామిజీ ఆధ్వర్యంలో ఆరువందల మందితో మహా పాదయాత్ర నిర్వహించారు. మచిలీపట్నం నుంచి విజయవాడ వరకు నాలుగు రోజులు పాటు 70 కిలోమీటర్ల పాటు ఆధ్యాత్మిక మహా పాదయాత్ర సాగింది. గణపతి సచ్చిదానంద స్వామిజీ ఆశ్రమంలో విజయానంద తీర్ధ స్వామిజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామీజీ మీడియాతో మాట్లాడుతూ… సనాతన ధర్మం, సనాతన సంప్రదాయం ప్రకారం అనేక మంది గురువులు పాదయాత్రలు చేస్తున్నారని తెలిపారు. విశ్వశాంతి కోసం, లోక కళ్యాణం కోసం తాము ఆధ్యాత్మిక మహా పాదయాత్ర చేపట్టామన్నారు. భగవన్నామ స్మరణ చేస్తూ మచిలీపట్నం నుంచి విజయవాడ వరకు మహా పాదయాత్ర చేశామని స్వామీజీ తెలిపారు.

* ఏపీ ప్రభుత్వ సిట్ పై హైకోర్టు విధించిన స్టేపై సుప్రీంకోర్టు లో వాదనలు ముగిసాయి. ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఏపీ హైకోర్టు విధించిన స్టేపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. గత ప్రభుత్వ విధాన నిర్ణయాలు, ఆర్థిక నిర్ణయాలు, ఇతర అంశాలపై ఏపీ సిట్‌ ఏర్పాటు చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య (Varla Ramaiah), ఆలపాటి రాజా (Alapati Raja) హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేసిన న్యాయస్థానం ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పై స్టే విధించింది. దీంతో ఏపీ సర్కార్‌ హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.

* దేశంలో అత్యంత చిన్న, చవక ఎలక్ట్రిక్‌ కారు మార్కెట్లోకి విడుదలైంది. ముంబైకి చెందిన విద్యుత్‌ వాహన తయారీ స్టార్టప్‌ పీఎంవీ ఎలక్ట్రిక్‌.. ‘ఈఏఎ్‌స-ఈ’ పేరుతో తొలి ఎలక్ట్రిక్‌ కారును బుధవారం లాంచ్‌ చేసింది. దీని ధర రూ.4.79 లక్షలు. తొలి 10,000 మంది కస్టమర్లకే ఈ ప్రారంభ ధర వర్తిస్తుందని తెలిపింది. అధికారిక లాంచింగ్‌కు ముందే దాదాపు 6,000 బుకింగ్స్‌ లభించాయని వెల్లడించింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా రూ.2,000 చెల్లించి కారును బుక్‌ చేసుకోవచ్చని పీఎంవీ ఎలక్ట్రిక్‌ తెలిపింది. కేవలం ఇంట్రాసిటీ (నగరంలోనే) ప్రయాణం కోసం డిజైన్‌ చేసిన ఈ బుల్లికారులో ఇద్దరు పెద్దవారిరు ఒక బాలుడు లేదా బాలిక కూర్చునే వీలుంటుంది.

* వైద్య, ఆరోగ్యశాఖలో నియామకాల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య నియామకాల కోసం ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు (ఏపీ ఎంఎస్ఆర్బీ) ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ బోర్డులో చైర్మన్ గా వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి, మెంబర్ సెక్రటరీగా డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి, సభ్యుడిగా జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి ఉంటారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

* ఏపీలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు చలితో వణుకుతున్నాయి. గత రెండు రోజులుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో నిన్న 8.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం 13 డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రతలు బుధవారం ఒక్కసారిగా పడిపోవడంతో జనం చలితో గజగజలాడుతున్నారు. ఇక, పాడేరు మండలంలోని మినుములూరు కాఫీ బోర్డులో 10.1 డిగ్రీలు, పాడేరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అంతేకాదు, తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు మన్యం మొత్తం పొగమంచుతో తడిసి ముద్దవుతోంది. కన్ను చించుకున్నా పరిసరాలు కనిపించడం లేదు. దీంతో ఉదయం బయటకు రావాలంటనే జనం భయపడుతున్నారు. కాగా, మన్యంలో ఉష్ణోగ్రతలు మున్ముందు మరింత కనిష్ఠానికి పడిపోయే అవకాశం ఉందని వాతావరణ విభాగం అధికారులు చెబుతున్నారు.

* ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ వాయుగుండంగా బలపడే అవకాశం…దక్షిణ కోస్తాంధ్రపై ప్రభావం చూపనుంది వాయుగుండం…ఈనెల 19నుంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉంది. రానున్న రెండు రోజుల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వానలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.

*మరో ప్రయోగానికి ఇస్రో సన్నద్ధమైంది. శ్రీహరికోట లోని అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి మొట్టమొదటి ప్రైవేటు రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. స్కైరూట్ అంతరిక్ష పరిశోధన సంస్థకి చెందిన రాకెట్‌ను రేపు(శుక్రవారం) ఇస్రో(ISRO) ప్రయోగించనుంది. షార్‌లోని సౌండింగ్ రాకెట్ కాంప్లెక్స్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది. ఈ రాకెట్‌కి ‘విక్రమ్ ఎస్’గా శాస్త్రవేత్తలు నామకరణం చేశారు.

*పంజాబ్ రాష్ట్రంలోని పొలాల్లో వదిలిన కారులో ఓ వివాహిత మృతదేహం లభ్యమవడం సంచలనం రేపింది. చండీగడ్ సమీపంలోని జిరాక్‌పూర్‌లోని(Zirakpur) సతాప్‌గఢ్ గ్రామంలోని పొలాల్లో పార్క్ చేసిన కారులో 35 ఏళ్ల వివాహిత మృతదేహాన్ని(Womans Body) పోలీసులు కనుగొన్నారు. పీబీ 100 కె 0322 నంబర్ గల కారును నడుపుతున్న గుర్తు తెలియని వ్యక్తి వాహనాన్ని అక్కడికక్కడే వదిలి పరారయ్యాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. వివాహిత(Married Woman) డేరా బస్సీవాసిగా పోలీసులు గుర్తించారు.
* భారత మార్కెట్‌పై ఎఫ్‌పీఐలు తిరిగి మోజు ప్రదర్శిస్తున్నారు. ఇటీవల కాలంలో స్టాక్‌మార్కెట్‌ సూచీలు మంచి వృద్ధిని నమోదు చేయడానికి ఇదే కారణం. వర్తమాన ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ముగిసే నాటికి ఎఫ్‌పీఐ పెట్టుబడులు 56,600 కోట్ల డాలర్లకు (రూ.46.41 లక్షల కోట్లు) చేరాయి. ఒక్క నవంబరు నెలలోనే ఇప్పటివరకు ఎఫ్‌పీఐలు 353 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్‌ చేశారు. అయితే ఈ పెట్టుబడులు మార్చి త్రైమాసికంలో నమోదైన 61,200 కోట్ల డాలర్లు, 2021 డిసెంబరు త్రైమాసికంలో నమోదైన 65,400 కోట్ల డాలర్ల కన్నా తక్కువే. 2021 సెప్టెంబరు త్రైమాసికం నాటికి ఎఫ్‌పీఐ పెట్టుబడులు 66,700 కోట్ల డాలర్లున్నాయి.

* హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం రాత్రి మళ్లీ భూకంపం సంభవించింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండీ, కాంగ్రా పరిసర ప్రాంతాల్లో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.బుధవారం రాత్రి 9:32 గంటలకు సంభవించిన భూకంప కేంద్రం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండీకి ఉత్తర వాయువ్యంగా 27 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఈ భూకంపం వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

* కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నెల రోజులకే మల్లికార్జున ఖర్గేను సవాళ్లు చుట్టుముడుతున్నాయి. పార్టీ పునర్నిర్మాణంలో ఆయనకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గుజరాత్‌ ఎన్నికల స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో సీనియర్‌ నేత శశి థరూర్‌ పేరు లేకపోవడం, రాజస్థాన్‌ ఇన్‌చార్జి పదవి నుంచి అజయ్‌మాకెన్‌ తప్పుకోవడం, పార్టీ అధ్యక్ష కార్యాలయ సమన్వయకర్తల నియామక వివాదం ఇందులో ప్రధానమైనవి. వీటితోపాటు మున్ముందు మరిన్ని సవాళ్లను ఖర్గే ఎదుర్కోవాల్సి ఉంటుందని, వాటిని అధిగమించడం అంత ఈజీ కాదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

*కరోనా సమయంలోనూ భారత్‌కు విదేశీయుల రాక కొనసాగిం ది. 2021లో 15 లక్షల మంది విదేశీయులు సందర్శించినట్లు హోంశాఖ అధికారులు వెల్లడించారు. ‘‘విదేశీయుల్లో అత్యధికులు అమెరికా, బంగ్లాదేశ్‌, యూకే, కెనడా, నేపాల్‌కు చెందినవారు.

* కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి ఢిల్లీకి వచ్చారు. అయితే, ఆయన కమలం పార్టీ నేతలతో కలిసి ఢిల్లీకి వచ్చారని, కాంగ్రె్‌సను వీడి బీజేపీలో చేరబోతున్నారని మీడియా, సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై బుధవారం శశిధర్‌రెడ్డి స్పందించారు. తాను పార్టీ మారుతున్నానని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తాను ఢిల్లీకి రావడం కొత్తేమీ కాదని, మనవడి స్కూల్‌ ఫంక్షన్‌లో పాల్గొనడానికి వచ్చానని తెలిపారు. ‘‘నేను ఇంకా రాజకీయాల్లోనే ఉన్నా. రిటైర్డ్‌ కాలేదు. నేను ఢిల్లీకి వచ్చిన విమానంలో అన్ని పార్టీల నేతలు ఉన్నారు. బీజేపీలో చేరడానికే నేను ఢిల్లీకి వచ్చానన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు’’అని ప్రకటించారు.

*అన్నదాతలను ఆదుకుంటానని మాటిచ్చి.. తప్పిన సీఎం జగన్‌ ఏ పరదాల మాటున దాక్కుంటున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ప్రశ్నించారు. టమోటా పరిస్థితి అమ్మబోతే అడివి.. కొనబోతే కొరివిలా ఉందన్నారు. ‘మార్కెట్లో కిలో రూ.20కిపైగా అమ్ముతున్న టమోటాను రైతు దగ్గర రూపాయికే కొంటుంటే… అన్నింటికీ జిందా తిలిస్మాత్‌లా పని చేస్తాయని చెప్పిన జగన్నాటక రైతు భరోసా కేంద్రాలు ఏం చేస్తున్నాయి? సీఎం తీసుకువచ్చిన రైతు రాజ్యం, రూ.3,500 కోట్ల ధరల స్థిరీకరణ నిధిని ఎలుకలు కొట్టేశాయా? ఉడతలు ఊదేశాయా? టమోటా రైతుకు మద్దతు ధర రాకపోతే పంట భద్రపరచటానికి ఏర్పాటు చేస్తానన్న కోల్డ్‌ స్టోరేజీలు ఏవి?’’ అంటూ ప్రశ్నించారు.

* అల్లూరి సీతారామరాజు జిల్లా వాసులను చలి వణికిస్తోంది. బుధవారం చింతపల్లిలో 8.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్‌, వాతావరణ విభాగం నోడల్‌ అధికారి డాక్టర్‌ ఎం.సురేశ్‌కుమార్‌ తెలిపారు. దక్షిణ అండమాన్‌ సముద్రం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో గురువారం కల్లా అల్పపీడనం ఏర్పడనుంది. తరువాత వాయుగుండంగా బలపడి దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించనుంది. అనంతరం 21, 22 తేదీల్లో ఉత్తర తమిళనాడు తీరానికి దగ్గరగా రానుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఈ నెల 19 నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు ప్రారంభమవుతాయని పేర్కొంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో బుధవారం పొడి వాతావరణం నెలకొంది.

*‘సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉండాలి. అప్పుడే రాష్ట్రం, దేశంలో ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది. లేకుంటే భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది’’ అని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణ అన్నారు. బుధవారం సాయంత్రం బాపట్ల జిల్లా అద్దంకిలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘అప్పులు చేసి సంక్షేమ పఽథకాలు అమలు చేయటం ద్వారా భవిష్యత్‌లో మరింత భారం పడుతుంది. 12 శాతం వడ్డీకి ప్రభుత్వాలు అప్పులు తీసుకునే పరిస్థితి మరింత ఆందోళన కలిగించే విషయం’’ అని జేపీ అన్నారు.

*వరంగల్‌ సీపీ తరుణ్‌జోషి తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని, లేని పక్షంలో డీజీపీ కార్యాలయం వద్ద నిరశన దీక్ష చేపడతానని ఏఐసీసీ సభ్యుడు బక్క జడ్సన్‌ హెచ్చరించారు. గాంధీభవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓ మహిళా అధికారిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చేసిన వ్యాఖ్యలపై తాను ఫిర్యాదు చేశానని, విచారణ జరిపిన కమిషనర్‌ తాను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నట్లు నివేదికలో పేర్కొన్నారని అన్నారు. తాను చేసిన ప్రతి ఆరోపణనూ నిరూపిస్తానని, అలాగే తరుణ్‌జోషి తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలన్నారు.

* రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్థంగా మారిందని కిసాన్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ధ్వజమెత్తారు. గాంధీభవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భూ రికార్డుల సవరణ చట్టం తెచ్చి ఐదేళ్లు గడిచినా, 20 లక్షల కుటుంబాలకు భూమి హక్కు లభించలేదన్నారు. ఇందిర ఇచ్చిన అసైన్డ్‌ భూములను వేలం వేసి అమ్ముకుంటున్నారని, కౌలు రైతు చట్టాన్ని ఎత్తేశారని ఆయన ఆరోపించారు.

*ఝార్ఖండ్‌ ముక్తి మోర్చ(జేఎంఎం) చీఫ్‌, ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ బాటలో పయనిస్తున్నారు. కేంద్రంపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. అక్రమ మైనింగ్‌కు సంబంధించిన రూ.వెయ్యికోట్ల కుంభకోణంలో.. మనీలాండరింగ్‌ కోణంలో ఈడీ విచారణకు హాజరవ్వడానికి ఒక్కరోజు ముందు బుధవారం ఆయన వరుస భేటీలు నిర్వహించారు. అదే సమయంలో జేఎంఎం మిత్రపక్షం కాంగ్రెస్‌ కూడా తమ ఎమ్మెల్యేలతో వరుస సమావేశాలు నిర్వహించింది.

* బీసీ ప్రధాని అయిన నరేంద్రమోదీ గత 8 ఏళ్లలో ఓబీసీలకు ఏం చేశారంటూ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వి. హనుమంతరావు ప్రశ్నించారు. గాంధీభవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓబీసీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్‌ను ఎత్తివేయాలని, బీసీ కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను పెంచాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశాలపైన మోదీని నిలదీసేందుకు అన్ని రాజకీయ పార్టీలనూ ఏకం చేస్తానని తెలిపారు

* ఈశాన్య రతుపవనాలు మరింతగా బలపడ్డాయి. దీనికితోడు బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే రెండు రోజులుగా వర్షాలు లేకపోవడంతో ప్రజలతో పాటు అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. అయితే బంగాళాఖాతంలో కొత్తగా మరో అల్పపీడనం ఏర్పడిందని, ఈ కారణంగా ఈ నెల 20వ తేదీ వరకు బలమైన గాలులతో భారీ వర్షం కురుస్తుందని వాతావారణ శాఖ తాజాగా ప్రకటించింది

* విభజన చట్టం ప్రకారం కృష్ణా జలాల్లో వాటా తేల్చకుండా తెలంగాణ-ఏపీ రాష్ర్టాల మధ్యన మోదీ ప్రభుత్వం పంచాయతీ పెడుతున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం వికారాబాద్‌లోని మార్కెట్‌ యార్డు ప్రాంగణంలో రూ.2.02 కోట్లతో నిర్మించిన దుకాణ సముదాయాన్ని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్‌ యార్డులో ఏర్పా టు చేసిన బహిరంగ సభలో మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రాజకీయ లబ్ధికోసమే కృష్ణా జలాల వాటా తేల్చకుండా పెండింగ్‌లో పెట్టిందన్నారు. ప్రధానిగా మోదీ అధికారం చేపట్టిన సమయంలో.. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని చెప్పి మాట తప్పారన్నారు.

* శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్‌ దేశానికే రోల్‌మాడల్‌గా నిలుస్తున్నదని హోం మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో సత్ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. పోలీసులు ప్రజలకు చేరువై సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి, పోలీస్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌ గుప్తాతో కలిసి కాగజ్‌నగర్‌ రూరల్‌, రెబ్బెన, వాంకిడి, పెంచికల్‌పేట్‌, చింతలమానేపల్లి, కౌటాల పోలీస్‌ స్టేషన్లతోపాటు కాగజ్‌నగర్‌ సీఐ కార్యాలయాన్ని హోంమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాగజ్‌నగర్‌, రెబ్బెనలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మహమూద్‌ అలీ మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రస్తుతం మావోయిస్టుల ప్రభావం లేదని, ఇతరత్రా సమస్యలేవీ లేవన్నారు.

*రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట అట్టహాసంగా రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించింది. కొన్నిచోట్ల ప్రభుత్వ భవనాల్లో ఈ కేంద్రాలను కొనసాగిస్తుండగా మరికొన్నిచోట్ల అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 1,080 ఆర్‌బీకేలు ఉండగా, అందులో 655 అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ అద్దె భవనాలకు ప్రభుత్వం అద్దె నగదు చెల్లించకపోవడంతో సమస్యలు ఉత్మన్నమవుతున్నాయి. ఇప్పటివరకు గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో సుమారు రూ.5.5 కోట్లు విడుదల కావాల్సి ఉందని అధికారులే తెలియజేస్తున్నారు. గుంటూరు జిల్లాలో మొత్తం 249 ఆర్‌బీకేలు ఉండగా అందులో 155 అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. వీటికి సంబంధించి రూ.90 లక్షలు విడుదల కావలసి ఉంది. పల్నాడు జిల్లాలో మొత్తం 421 ఆర్‌బీకేలు ఉండగా అందులో 214 అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. వీటికి రూ.2.47 కోట్లు విడుదలవ్వాలి. బాపట్ల జిల్లాలో మొత్తం 410 ఆర్‌బీకేల ఉన్నాయి. వీటిలో అద్దె భవనాల్లో ఉన్నవి.. 286. వీటికి సంబంధించి రూ.2.10 కోట్లు బకాయిలు విడుదల కావాలసి ఉంది. అంటే మొత్తం రూ.5.47 కోట్ల బకాయిలు ప్రభుత్వం నుంచి రావలసిఉంది.