DailyDose

వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో 11,000 ఉద్యోగాల కోత

వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో 11,000 ఉద్యోగాల కోత

ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ల యాజమాన్య సంస్థ మెటా తన ఉద్యోగులలో 13 శాతం మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది.ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థకు 87,000 మంది ఉద్యోగులు ఉండగా వారిలో 11,000 మందికి ఉద్వాసన పలకనున్నారు.
‘మెటా చరిత్రలోనే ఈ ఉద్వాసనలు అత్యంత క్లిష్టమైన మార్పులు’ అని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్‌బర్గ్ అన్నారు.
ట్విటర్ తన ఉద్యోగులతో సగంమందికిపైగా ఉద్వాసన పలికిన అనంతరం ఇప్పుడు మెటా కూడా అదే బాటలో నడుస్తోంది.‘ఇది చాలా కష్టసమయం అని నాకు తెలుసు. ఉద్యోగాలు పోగొట్టుకున్నవారికి నా క్షమాపణలు’ అని జుకర్‌బర్గ్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.సంస్థ ఖర్చులు తగ్గించుకోవడంపై దృష్టిపెడుతున్నట్లు ప్రకటించిన ఆయన వచచే ఏడాది తొలి త్రైమాసికం వరకు కొత్తగా నియామకాలు ఉండవని తెలిపారు.ప్రకటనల ఆదాయం తగ్గడం వల్ల కఠిన నిర్ణయాలు తప్పడం లేదని, దీనికి తానే బాధ్యుడినని చెప్పారు జుకర్‌బర్గ్.16 వారాల వేతనం… హెల్త్ ఇన్స్యూరెన్స్ 6 నెలల వరకు వర్తింపు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వర్టైజింగ్, మెటావర్స్ వంటి అధిక ప్రాధాన్య వృద్ధి అవకాశాలపై మరింత దృష్టి పెడతామని జుకర్‌బర్గ్ చెప్పారు.అవకాశం ఉన్న ప్రతి చోటా ఖర్చు తగ్గించుకుంటామని.. భవనాలు, కార్యాలయాల ఖర్చులు తగ్గిస్తామని.. డెస్క్ షేరింగ్ అనేది పెంచుతామని ఆయన చెప్పారు.ఉద్యోగాలు కోల్పోయిన మెటా ఉద్యోగులకు త్వరలోనే ఈమెయిల్ ద్వారా సమాచారం ఇస్తారని జుకర్‌బర్గ్ చెప్పారు. వారికి ఎలాంటి సందేహాలున్నా అడగొచ్చన్నారు.జాబ్ కోల్పోయిన అమెరికాలోని మెటా ఉద్యోగులకు 16 వారాల వేతనంతో పాటు ఇంతవరకు ఎన్ని సంవత్సరాలు పనిచేశారో అన్ని వారాల అదనపు వేతనం అందిస్తారు.వారి కుటుంబానికి కల్పించే ఆరోగ్య బీమా ఉద్యోగం పోయిన ఆరు నెలల వరకు కొనసాగుతుంది.ఇతర దేశాల్లోని మెటా ఉద్యోగులకూ ఇదే వర్తించినా అక్కడి చట్టాల ప్రకారం స్వల్ప మార్పులు ఉండొచ్చని సంస్థ వెల్లడించింది.