Business

కొనుగోలుదారులకు షాక్ ఇచ్చిన బంగారం ధర – TNI వాణిజ్యం

కొనుగోలుదారులకు షాక్ ఇచ్చిన బంగారం ధర – TNI వాణిజ్యం

* భారత్ బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధర పరుగులు పెడుతోంది. నిన్న కాస్త తగ్గిన బంగారం ధర నేడు మాత్రం షాకిచ్చింది. ఈ నెలలో ఇంత పెద్ద మొత్తంలో పెరగడం ఇది రెండో సారి. దీపావళి తర్వాత నుంచి బంగారం ధర చాలా తక్కువ రోజులు మినహా మొత్తంగా పెరుగుతూనే ఉంది. నేడు అంటే నవంబర్‌ 18న దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.750 వరకు పెరుగగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.820 వరకు పెరిగింది. ఇక వెండి ధర మాత్రం కొన్ని నగరాల్లో స్థిరంగా ఉండగా.. మరికొన్ని నగరాల్లో మాత్రం తగ్గింది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ రేసు గుర్రంలా పరుగెడుతోంది. గురువారం కొద్దిగా నష్టాల్లో ముగిసినా సెన్సెక్స్‌, నిఫ్టీ రెండూ దాదాపు ఆల్‌టైమ్‌ హైలో ట్రేడవుతున్నాయి. ఈక్విటీ సూచీలు లాభాలను అందిస్తున్నా.. కొన్ని టెక్నాలజీ ఆధారిత కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లను నిండా ముంచాయి. గత ఏడాది భారీ ప్రచారంతో మార్కెట్‌కు వచ్చిన పేటీఎం, జొమాటో, నైకా, డెలివరీ, పాలసీబజార్‌ పబ్లిక్‌ ఇష్యూలే ఇందుకు నిదర్శనం. ఇందులో మదుపు చేసిన ఇన్వెస్టర్లు నిండా మునిగిపోయి లబోదిబోమంటున్నారు. గత ఏడాదిన్నర కాలంలో ఈ ఐదు కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ అయితే ఏకంగా 1,800 కోట్ల డాలర్లు (సుమారు రూ.1.47 లక్షల కోట్లు) హరించుకుపోయింది. ఇందులో పేటీఎం (మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌), నైకా (ఎఫ్‌ఎ్‌సఎన్‌ ఈ-కామర్స్‌ వెంచర్స్‌) పాలసీబజార్‌ (పీబీ ఫిన్‌టెక్‌) ఇష్యూలైతే ఇన్వెస్టర్లను పీకల్లోతు నష్టాల్లో ముంచాయి.

* గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన బిర్లా పెయింట్స్‌ విభాగానికి ప్యాకేజింగ్‌ మెటీరియల్‌ ను తయారు చేయడానికి చెన్నై సమీపంలో మోల్డ్‌టెక్‌ ప్యాకేజింగ్‌ కో-లొకేటెడ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందు కు లెటర్‌ ఆఫ్‌ అవార్డును పొందినట్లు వెల్లడించింది. దాదాపు రూ.30 కోట్లతో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది.

* అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI) తన అర్ధ వార్షిక (ఏప్రిల్-సెప్టెంబర్) ఫిర్యాదుల నివేదికను తాజాగా విడుదల చేసింది. ఏఎస్‌సీఐ మార్గదర్శకాలను ఉల్లంఘించినట్టుగా భావిస్తున్న 2,764 వాణిజ్య ప్రకటనలపై 3,340 ఫిర్యాదులను ప్రాసెస్ చేసింది. వీటిలో 55 శాతం డిజిటల్ రంగంలో వచ్చినవి కాగా, 39 శాతం ప్రింట్‌లో, 5 శాతం టీవీల్లో వచ్చినవి ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి ఫిర్యాదుల సంఖ్య 14 శాతం పెరగడం గమనార్హం. అలాగే, ప్రాసెస్ చేసిన ప్రకటనల సంఖ్యలోనూ 35 శాతం పెరుగుదల చోటుచేసుకుంది. ఇక, ఫిర్యాదుల్లో 27 శాతం విద్యారంగానికి చెందినవి కావడం గమనార్హం. ఫలితంగా అత్యధిక ఉల్లంఘనలు చోటుచేసుకున్న రంగంగా ఇది నిలిచింది. వీటిలో 22 శాతం క్లాసికల్ ఎడ్యుకేషన్ విభాగానికి, 5శాతం ఎడ్‌టెక్ రంగానికి సంబంధించినవి.

* ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన గౌతమ్‌ అదానీకి కూడా భారత్‌పై నమ్మకం కుదరడం లేదు. రోజు రోజుకీ పెరిగిపోతున్న తన ఆస్తుల నిర్వహణ కోసం విదేశాల్లో ఒక కార్యాలయం ఏర్పాటు చేసే విషయాన్ని ఆయన చురుగ్గా పరిశీలిస్తున్నట్టు సమాచారం. దుబాయ్‌ లేదా న్యూయార్క్‌ ఇందుకు వేదిక కావచ్చని భావిస్తున్నారు. ఇందుకోసం ఆయా ప్రాంతాల్లో పన్నుల విధానంపై నిపుణులతో అదానీ చర్చిస్తున్నారు. ఈ కుటుంబ ఆఫీసు ద్వారా అదానీలు తమ వ్యక్తిగత పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకుంటారు. స్టాక్‌ మార్కెట్‌ ర్యాలీ పుణ్యమాని గత ఏడాది అదానీ కుటుంబ వ్యక్తిగత ఆస్తుల విలువ 5,800 డాలర్లు పెరిగింది. దీంతో విదేశాల్లోనూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని వేగంగా విస్తరించాలని అదానీ కుటుంబం భావిస్తోంది. దుబాయ్‌ లేదా న్యూయార్క్‌లో ఫ్యామిలీ ఆఫీసు ఏర్పాటు చేయడం ద్వారా ఈ విషయంలో ముందుకు వెళ్లాలని గౌతమ్‌ అదానీ భావిస్తున్నట్టు సమాచారం.