NRI-NRT

అమ్మకానికి ఇవానా ట్రంప్ భవంతి.. రూ.215 కోట్లుగా ధర నిర్ణయం

అమ్మకానికి ఇవానా ట్రంప్ భవంతి.. రూ.215 కోట్లుగా ధర నిర్ణయం

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీ భార్య ఇవానా ట్రంప్ భవంతిని అమ్మకానికి పెట్టారు. బ్రోకింగ్ సంస్థ ఈ బంగ్లా ధరను దాదాపు రూ.215 కోట్లుగా నిర్ణయించింది. మాన్‌హట్టన్‌లో నిర్మించిన ఈ బంగ్లా 8,725 చదరపు అడుగుల విలాసవంతమైనది. 64 వ వీధిలో నిర్మించిన ఈ బంగ్లాలో 5 బెడ్‌రూమ్‌లు, 5 బాత్‌రూమ్‌లు ఉన్నాయి. భవంతి 1980 నాటి ఇంటీరియర్‌ను కలిగి ఉన్నది.

విలాసవంతమైన ఈ భవంతి అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇవానా-డొనాల్డ్ ట్రంప్‌ ముగ్గురు పిల్లలు పంచుకోనున్నారు. ఇవానా-డొనాల్డ్ ట్రంప్‌ జంటకు ముగ్గురు పిల్లలు – జూనియర్ ట్రంప్‌, ఎరిక్ ట్రంప్, ఇవాంకా ట్రంప్ ఉన్నారు. ఇవానా 1992లో రూ.20 కోట్లకే ఈ బంగ్లాను కొనుగోలు చేసింది. అదే సంవత్సరంలో ఆమె డొనాల్డ్ ట్రంప్ నుంచి విడాకులు తీసుకున్నది. కాగా, 2022 జూలై నెలలో ఇవానా ట్రంప్ తన బంగ్లాలో శవమై కనిపించింది. 73 ఏండ్ల ఇవానా మాన్‌హాటన్ అపార్ట్‌మెంట్ మెట్ల పైనుంచి పడిపోవడంతో తీవ్ర గాయాలపాలైంది. చికిత్స పొందుతూ ఇవానా మరణించింది.

చెకొస్లోవేకియాలో పుట్టిన ఇవానా.. ఉన్నత చదువుల కోసం అమెరికా వచ్చింది. అమెరికాలో చదువుతూనే మోడలింగ్‌ చేసింది. ఇదేసమయంలో వ్యాపారవేత్త డొనాల్డ్‌ ట్రంప్‌తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరు 1977 లో పెండ్లి చేసుకున్నారు. 15 ఏండ్లపాటు వైవాహిక జీవితాన్ని కొనసాగించిన వీరు 1992 లో విడిపోయారు. 1980 లలో అమెరికాలోని అత్యంత ఉన్నతమైన జంటల్లో ఒకటిగా ఇవానా-డొనాల్డ్‌ ట్రంప్‌ పరిగణించడం విశేషం.