Devotional

బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన తిరుచానూరు – TNI ఆధ్యాత్మిక వార్తలు

బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన తిరుచానూరు – TNI ఆధ్యాత్మిక వార్తలు

*రేపు అంకురార్పణ-ఎల్లుండి వాహన సేవలు ప్రారంభం
తిరుమల వెంకన్న పట్టపురాణి పద్మావతీ దేవి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుచానూరు సర్వాంగసుందరంగా ముస్తాబైంది. కొవిడ్‌ కారణంగా గత రెండు సంవత్సరాలు బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించగా ఈ సారి తిరుమల తరహాలో వైభవోపేతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సుదీర్ఘ విరామం తరువాత తిరుమాడ వీధుల్లో అమ్మవారి వాహనసేవలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శిల్పారామం నుంచి తిరుచానూరు వరకు విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. దేవతామూర్తుల కటౌట్లు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాల్లో రంగవల్లులు వేశారు. శుద్ధమైన నీటితో పుష్కరిణిని నింపారు. భక్తులు వర్షానికి ఇబ్బంది పడకుండా నవజీవన్‌ ఆస్పత్రి నుంచి తిరుచానూరు అవతల పూడిరోడ్డు వరకు ప్రధాన రహదారిపై రేకులతో షెడ్లు నిర్మించారు. బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి ఈనెల 28వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం ఆలయంలో పుణ్యాహవచనం, రక్షాబంధనం, సేనాధిపతి ఉత్సవం నిర్వహించి అంకురార్పణ చేయనున్నారు. అదేరోజు ఉదయం 8నుంచి 12గంటల వరకు ఆలయంలో లక్ష కుంకుమార్చన జరగనుంది.

1. రుద్రాభిషేకం
శివ.. శివ అంటే చాలు మంగళం, శుభం, సర్వకార్యజయం, సర్వపాపహరం అని వేదార్థాలు. మహాదేవున్ని శివుడని పరమశివుడని పలు పేర్లతో పిలుస్తారు. పండితుడు నుంచి పామరుడు వరకు, మహా చక్రవర్తి నుంచి కటిక పేదవాడి వరకు మనఃపూర్వకంగా ఒక్కసారి శివ అంటే చాలు కోరిన కోర్కిలు తీర్చే భోళాశంకరుడు ఆయన. శివున్ని అభిషేక ప్రియుడు అంటారు. శివునికి నిత్యం అభిషేకం చేస్తే చాలు అన్ని ఉన్నట్లే. శివలింగం చల్లగా ఉంటే ఊరు చల్లగా ఉంటుంది. దేశం శాంతిగా ఉంటుందని వేదోక్తి. అయితే శివుడికి అభిషేకాలు చేస్తుంటాం….అభిషేకాలు ఎన్నిరకాలు ఏ విధంగా శివాభిషేకాలు చేస్తారో తెలుసుకుందాం…..
శివాభిషేకాలు మంత్రపూర్వకంగా అంటే రుద్రభిషేకాలుగా వర్ణిస్తారు. అదేవిధంగా చేసే ద్రవ్యాలను బట్టి అభిషేకాలకు పేర్లు ఉన్నాయి. కానీ శాస్త్రం ప్రకారం రుద్రాభిషేకాలు రకాలనే పరిగణనలోకి తీసుకుంటాం. పదార్థాలు మన కామ్యాలు అంటే కోరికలు తీరడానికి ఆయా పదార్థాలతో, పుష్పాలతో చేస్తాం.
**రుద్రాభిషేకాలు 8 విధములు అవి….
రుద్రం అంటే నమకాలు -11, చమకాలు-11 అనువాకాలుగా (సింపుల్‌గా చెప్పాలంటే 11 స్టాన్జాలు అని ఇంగ్లిష్ మీడియం వారికి) సాధారణంగా రుద్రాభిషేకం అంటే 11 నమకాలను, 11/1 చమకాన్ని చెప్పితే ఒక అభిషేకంగా ఇంట్లో నిత్యం చేసుకునేవారు చేసే పద్ధతి.
**ఇక అసలు అభిషేక సంప్రదాయ పరిశీలిస్తే…
1. రాభిషేకం- నమకం 11 అనువాకాలను చెప్పి చమకంలో ఒక్కొక్క అనువాకం చొప్పున చెప్పవలెను. ఆ విధంగా నమకం 11 సార్లు (11X11) చెప్పిన, చమకం 11 అనువాకాలకు పూర్తగును. (నమకం 11సార్లు, చమకం 1 సారి) దీన్ని వారాభిషేకం అంటారు.
2. ఆవృత్తి – నమకం 121 సార్లు, చమకం 11 సార్లు చెప్పితే ఆవృత్తి అంటారు.
3. రుద్రం- నమకం 121 సార్లు, చమకం – 11 సార్లు
4. ఏకాదశ రుద్రం- నమకం 14,641 ర్లు, చమకం-1331 సార్లు
5. శతరుద్రం- నమకం 1,61,051 సార్లు,చమకం 14,641 సార్లు
6. లఘురుద్రం- నమకం 17,71,561 సార్లు, చమకం- 1,61,051 సార్లు
7. మహారుద్రం- నమకం 1,94,87,171 సార్లు, చమకం- 17,71,561 సార్లు
8. అతిరుద్రం- నమకం 21,43,58,881 సార్లు, చమకం -1,94,87,171 సార్లు
ఇలా 8 రకాలుగా రుద్రాభిషేకాలను చేస్తారు.

2. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు స్వామివారిని దర్శించుకునేందుకు 23 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. గురువారం తిరుమల శ్రీవారిని 65.062 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.04 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నేడు స్వామివారికి 25,761 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

3. అమర్‌నాథ్ శివలింగ్ మాదిరిగా, ప్రపంచం నలుమూలల నుండి భక్తులు ప్రతి సంవత్సరం దర్శనం కోసం సందర్శించే మరో శివలింగం ఉందని మీకు తెలుసా? ఆస్ట్రియాలోని సాల్జ్‌బర్గ్ సమీపంలో 40 కిలోమీటర్ల పొడవైన మంచు గుహ ఉంది, ఇది సహజమైన శివలింగం లాంటి ఆకారాన్ని కలిగి ఉంది మరియు అమర్‌నాథ్ శివలింగ్ కంటే చాలా రెట్లు పెద్దది. ఈ గుహలో ఒక కిలోమీటరు వరకు మెట్లు ఉన్నాయి, తద్వారా ‘శివలింగం వరకు సులభంగా చేరుకోవచ్చు. మరియు ఈ ‘శివలింగ్’ ఎత్తు 75 అడుగులు. గుహ లోపలికి వెళ్లడానికి ప్రజలు ప్రమాదకరమైన మార్గాల ద్వారా వెళ్ళాలి. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన మంచు గుహ మరియు 1879 సంవత్సరంలో కనుగొనబడింది. ఇక్కడ మీరు శివలింగలా కనిపించే అనేక ఆకారాలను కనుగొంటారు. మంచు గుహ మే నుండి అక్టోబర్ వరకు తెరిచి ఉంటుంది. దానిలోకి ప్రవేశించిన తరువాత, మీరు వేరే మరియు క్రొత్త ప్రపంచంలోకి ప్రవేశించినట్లు మీకు అనిపిస్తుంది.

4. లక్ష్మీదేవికి గుడ్లగూబ వాహనం ఏ విధంగా అయింది ?.అద్భుత విశిష్టత.
గొప్ప సంగీత విద్వాంసుడు, మధురమైన గానంతో కౌశికుడు అనే విష్ణుభక్తుడు తన భక్తి, గానమాధుర్యంతో విష్ణువుని మెప్పించి ప్రసన్నం చేసుకున్నాడు. కౌశికుడు మరణించిన తరువాత వైకుంఠం చేరుకున్నాడు. మహావిష్ణువు కౌశికుడిని తన అంతరంగిక సంగీత సభను ఏర్పాటు చేశాడు. త్రిలోకసంచారి నారదునికి ఆ సభలోకి ప్రవేశించడానికి అనుమతి లభించలేదు. తుంబురుడికి స్వాగత సత్కార్యాలు లభించడం చూసిన నారదుడు తన శత్రువైన తుంబురుడికి లభించిన స్థానం తనకు ఎందుకు దక్కలేదని మండిపడుతూ లక్ష్మీదేవి మందిరంలో నుండి లోనికి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. కానీ లక్ష్మీదేవి చెలికత్తెలు నారదుణ్ణి లోనికి అనుమతించలేదు. కోపగించిన నారదుడు లక్ష్మీదేవిని శపించాడు. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మీదేవి, మహావిష్ణువు నారదుడి ఎదుట ప్రత్యక్షమై తన పొరపాటును మన్నించమని వేడుకున్నారు. దాంతో నారదుడు శాంతించాడు.
*నారదుడు చల్లబడడం చూసిన మహావిష్ణువు నారదునితో ఇలా అన్నాడు.. నారదా నీకోపానికి కారణం నాకు తెలుసు. నిజానికి భక్తిజ్ఞానంలో, శీలవర్తనలో తుంబురుడు నీకన్నా గర్విష్టి కాదు. కపట భక్తిని ప్రదర్శించేవారు ఎన్ని తీర్థాలు సేవించినా అవి వ్యర్థం అవుతాయి. భక్తిశ్రద్ధలతో నన్ను కొలిచేవారికి నేను ఎప్పుడూ దాసుడనే. సంగీతంతో నన్ను చేరవచ్చు అనే సత్యాన్ని చాటిచెప్పడానికే నేను తుంబురుడిని, కౌశికులను సత్కరించాను. నీవు ఇచ్చిన శాపం లోకానికి మేలే జరుగుతుంది అని చెప్పాడు. దీంతో జ్ఞానోదయమైన నారదుడు. ఓ దేవా నా తప్పులను క్షమించు. అవివేకుడిలా ప్రవర్తించాను. నన్ను కాపాడు. తుంబర, కౌశికుల సంగీత పరిజ్ఞానం నాలో లేదు అందుకే ఇంతకీ విపరీతం జరిగి ఉండేది కాదు అంటూ తీవ్ర దుఃఖభారంతో కన్నీళ్లు కారుతుండగా నారదుడు మహావిష్ణువు పాదాలపై పడ్డాడు.
*ష్ణువు నారదుణ్ణి పైకి లేపి ధైర్యం చెప్పాడు. సంగీతం నేర్చుకోవాలనే సంకల్పం నిజంగా నీకు ఉంటే నేను చెప్పినట్లు చేయి. ఉత్తరాన మానస సరొవరానికి అవతలివైపు ఒక పర్వత శిఖరం ఉంది. దానిమీద ఒక ఉలూకపతి ఉన్నాడు. అతనికి శుశ్రుష చేసి సంగీతంలో మేటివి అవమని దీవించాడు. మహావిష్ణువుకి కృతజ్ఞతలు తెలిపి మనోవేగంతో మానస సరోవరం చేరుకున్నాడు నారదుడు. అక్కడికి చేరుకున్న నారదుడికి కమ్మని సంగీతం అస్పష్టంగా వినిపించింది. గాలిలో తెరలు తెరలుగా వస్తున్న ఆ గానమాదుర్యాన్ని అనుసరించి అవతల ఉన్న శిఖరాన్ని చేరుకున్నాడు. అక్కడ గాంధర్వ, కిన్నెర, కింపురుష, అప్సరసలు ఎందఱో సంగీత అభ్యాసం చేస్తూ కనిపించారు. వారి మధ్యలో దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న ‘గానబంధు’ నారదుణ్ణి చూసి ఎదురేగి ఆదరంగా ఆహ్వానించి ఆసనం చూపించి కుశలప్రశ్నలు వేశాడు. వచ్చిన కారణం ఏమిటని అడిగాడు.
*నారదుడు ‘గానబందు’ వినయానికి, సంగీత పరిజ్ఞానానికి ఆశ్చర్యపోయి తనకు తెలియని ఈ సంగీత సామ్రాట్టు ఎవరు అని ఆలోచించసాగాడు. అతను ఎవరైతే తనకెందుకు తనకు కావలసింది సంగీత విద్య. నారదుడు ఉలూకపతికి నమస్కరించి తానూ వచ్చిన కారణం తెలుపుతూ తుంబుర, కౌశికులు తమ గానమాధుర్యంతో విష్ణువుని ప్రసన్నం చేసుకున్నారని తనకు కూడా అలాంటి దివ్యగాన విద్యని ప్రసాదించమని వేడుకున్నాడు. నారదుడి ఆంతర్యం కనిపెట్టిన గానబంధు ముందుగా తానూ ఎవరో వివరించసాగాడు.ర్వకాలంలో ధర్మవర్తనుడు, జాలిగుండెగల భువనేశుడనే రాజు ఉండేవాడు. అతను సంప్రదాయాలను అనుసరించి ధర్మకార్యాలు అన్నీ క్రమం తప్పకుండా నిర్వహిస్తూ ఉండేవాడు. అటువంటి ఉత్తమపాలకుడు సంగీతాన్ని మాత్రం నిషేధించాడు. తన రాజ్యంలో ఎవరైనా గానం ఆలపిస్తే మరణశిక్ష విధించమని మంత్రులకు ఆజ్ఞ ఇచ్చాడు. భగవంతుణ్ణి కూడా భక్తీ గీతాలతో స్తుతించకూడదని చాటింపు వేయించాడు.
*ఒకరోజు హరిమిత్రుడు అనే భక్తుడు రాజు ఆజ్ఞను విస్మరించి భగవంతుణ్ణి కీర్తిస్తూ గానం చేశాడు. ఆ గానమాదుర్యంలో మునిగిపోయిన ప్రజలు కూడా పాడకూడదు అన్న విషయాన్ని మరచిపోయారు. వెంటనే రాజభటులు వచ్చి హరిమిత్రున్ని తీసుకువెళ్ళి రాజు ముందు నిలబెట్టారు. రాజు ఆలోచనలో పడ్డాడు. గానం ఆలపించినవాడు బ్రాహ్మణుడు. అతన్ని చంపితే బ్రాహ్మహత్యా దోషం కలుగుతుంది, అందుకే హరిమిత్రుని సంపదను స్వాధీనం చేసుకుని, మరణశిక్షకు సమానమైన దేశబహిష్కరణ శిక్షను విధించాడు.కొంతకాలానికి రాజు మరణించాడు. మానవుడిగా మరణించిన రాజు మరుసటి జన్మలో గుడ్లగూబగా జన్మించాడు. గుడ్లగూబ రాత్రిళ్ళు మాత్రమే ఆహారాన్ని సంపాదించుకోవాలి. అందుకు తిండి ఒక సమస్యగా తయారయింది గుడ్లగూబకు. గతజన్మ దోషఫలితం వల్ల ఒకసారి నాలుగు రోజులు అయినా ఆహారం లభించలేదు. ఆకలితో అలమటిస్తూ ఆఖరికి మరణాన్ని ఆహ్వానించాడు. గుడ్లగూబగా జన్మించిన రాజు గతజన్మలో తాను చేసిన కొన్ని పుణ్యకార్యాలవల్ల యమధర్మరాజు వచ్చి ఎదురుగా నిలబడ్డాడు.
*యమున్ని చూసి … యమధర్మరాజా ఎందుకు ఈ విధంగా నన్ను బాధపెడుతున్నావు. నేను గతజన్మలో రాజుగా ప్రజలపై ఎంతవరకు దయాదాక్షిణ్యాలు చూపించాలో అంతవరకూ చూపించాను. నీవు ఎందుకు నాపై దయ చూపావు అన్నాడు. భువనేశుడి స్థితికి జాలిపడ్డాడు యమధర్మరాజు. తాము చేసిన తప్పు తెలియకుండా ఎవరైనా శిక్ష అనుభవించడం ధర్మం కాదు, తెలిసినప్పుడే కదా పశ్చాత్తాపం కలిగేది అని ఆలోచించిన యమధర్మరాజు భువనేశుడికి అతను చేసిన తప్పు ఏమిటో చెప్పాడు. గానబంధు! నీవు రాజుగా ఉన్నప్పుడు అనేక సత్కార్యాలు చేసిన మాట నిజమే. కానీ పరమాత్ముణ్ణి వేదమంత్రాలతో మాత్రమె స్తుతించాలని శాసించడం నీ మూర్ఖత్వం. పరమపావనమైన సన్తేఎతమ్తొ హరికీర్తన చేసిన హరిమిత్రున్ని శిక్షించిన పాపం ఏమైనా తక్కువా. ఆ పాప ఫలితం కొండంత అయి నీకు లభించిన పుణ్యఫలాన్ని మించిపోయింది. అదే నేడు నిన్ను పట్టిపీడిస్తుంది. విష్ణుభక్తులకు చేసిన చేసిన కీడు నీకు ఈ అవస్థ తెచ్చిపెట్టింది. దీనినుండి బయటపడటం ఎవరికీ సాధ్యం కాదు.
*యమధర్మరాజు చెప్పింది విన్నాక గాని గుడ్లగూబకు తానూ చేసిన తప్పు ఏమిటో అర్థం కాలేదు. ఏ మార్గంలోనైనా భగవంతుణ్ణి స్తుతించవచ్చు అన్న జ్ఞానం కలిగి తానూ చేసిన తప్పును క్షమించి ఈ సంకటం నుండి ఎలాగైనా బయటపడే మార్గాన్ని చూపించమని యమధర్మరాజు పాదాలపై పడి వేడుకున్నాడు.యమధర్మరాజు హృదయం ద్రవించి … ఉలూకరాజా చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పాడు. ఈ పాపానికి మించిన శిక్ష అనుభవించినట్లయితే శిక్ష కాస్తంత తగ్గుతుంది. నీవు అంగీకరిస్తే అక్కడ నున్న గుహలోకి వెళ్ళు. అందులో నీ గతజన్మ దేహం ఉంది. అందులోనుండి రోజూ కొంత మాంసాన్ని చీల్చుకుని భుజించు. అది పూర్తి అయిన అనంతరం నీకు శుభం కలుగుతుంది అని దీవించి అంతర్థానం అయ్యాడు.ఈ వివరాలు నారదుడికి చెప్పిన గుడ్లగూబ ఓ మహర్షీ ఆ దురదృష్టవంతుడిని నేనే. ఆ తరువాత నేను ఒకరోజు నా శవం దగ్గర కూర్చుని ఉండగా, దివ్య తేజస్వి అయిన ఒక బ్రాహ్మణుడు రథంలో వెళ్తూ నా ముందు ఉన్న శవాన్ని చూసి రథాన్ని ఆపి దగ్గరకి వచ్చి చూసి ఇది భువనేశుని శవంలా ఉంది. ఇక్కడెందుకు పడి ఉంది? దీన్ని ఈ పక్షి తినడం ఏమిటి? అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించాడు.
*అప్పటికి నేను ఆ బ్రాహ్మణుడిని గుర్తించాను. అతను నా చేత దేశబహిష్కరణకు గురైన హరిమిత్రుడు. వెంటనే అతని పాదాలపై పడి ప్రార్థించాను. తప్పును క్షమించమని వేడుకున్నాను. దుఃఖ అశ్రువులు నేలపై పడుతుండగా యమధర్మరాజు తెలిపిన విషయం అంతా హరిమిత్రుడికి వివరించాను, హరిమిత్రుడు అది విని చలించిపోయి తన అంతరంగం భావాలకు అనుగుణంగా ఇలా పలికాడు.నీ బాధలు చూస్తుంటే నాకు ఎంతో విచారం కలుగుతుంది. నీవు నాపట్ల చూపిన కాఠిన్యాన్ని నేను ఆరోజే మరచిపోయాను. నీవు అనుభవించిన బాధలు ఇక చాలు. ఈ క్షణం నుండి నీకు బాధ అనేది లేకుండుగాక. గొప్ప సంగీత విద్వాంసుడవై లోకంలో ఉత్తమ సంగీత విద్యను బోధింతువుగాక అంటూ హరిమిత్రుడు నా కృతజ్ఞతను స్వీకరించి వైకుంఠానికి చేరుకున్నాడు. అతని దీవెనలు ఫలించి నేను ఇలా ఉన్నాను అంటూ గానబందు తన కథను వివరించాడు.
*ఆపై నారదుడు గానబందు విద్వాంసుని శిష్యుడు అయ్యాడు. తొలిరోజునే సంగీతం ఎలా నేర్చుకోవాలో అనే విషయం మీద పాఠం చెప్పాడు. సంగీతం ఒక దివ్యకళ అన్నాడు. తపంతోగాని, తామసంతో కాని సంగీతం పట్టుబడదు అని చెప్పాడు. కళ కోసం జీవితాన్నే అర్పించాలి అని అన్నాడు. కష్టపడి నిరంతరం సాధనచేస్తే ఎవరైనా అపురూపమయిన ఈ కలలో ఆధిక్యం సాధించవచ్చు అన్నాడు. నారదుడు గానబంధుపై గౌరవభావం మోహంలో ఉట్టిపడుతుండగా వినయంగా తలవంచుకుని విన్నాడు.వెయ్యేళ్ళు సంగీత సాధనలో గడిచిపోయాయి. కఠోరదీక్షతో నారదుడు 3,60,006 రాగాలలో మంచి ప్రావీణ్యం సంపాదించాడు. సహచరులు పొగుడుతూ ఉంటే సంగీతంలో ఇక తనకు తిరుగులేదని అనే గర్వంతో ఉబ్బిపోయాడు నారదుడు. అమితానందంతో గురువైన గుడ్లగూబను చేరుకొని కృతజ్ఞతలు తెలుపుతూ గురుదక్షిణ చేల్లిస్తాను. ఏం కావాలో సెలవివ్వమన్నాడు. ఎలాంటి కోరికనైనా సంశయం లేకుండా అడగమన్నాడు.
*శిష్యుడి మాటలు విన్న గురువు సంతోషంతో ఓ మహర్షీ! దేవరుషులు అయిన మిమ్మల్ని నేను ఏమి కోరిక కోరగలను. గుడ్లగూబకు కావలసిన అవసరాలు ఏమి ఉంటాయి? నీవు శిష్యుడివి కాబాట్టి ఏదో ఒకటి కోరుకోక తప్పాడు. ఈ భూమి నిలిచి ఉన్నంతకాలం సంగీత కళతో పాటు నేను సహితం లోకంలో గుర్తుండిపోయేలా వరం ప్రసాదించు అని మనసులోని మాట బయట పెట్టడు.నారదుడు నవ్వి గురువర్యా! ఇది మరీ చిన్న కోరిక.. ఈ చిన్ని కోరిక మీకు ఉన్న సంగీత పాండిత్యం తీర్చగలదు. శిష్య ప్రశిష్యకోటి వలన భూతలంలో సంగీతకళ నిలిచి ఉన్నంత వరకు మీ కీర్తికి భంగం కలగదు. మీరు చేసిన ఈ మహోపకార్యానికి గురుదక్షిణగా లక్ష్మీనారాయణుల కటాక్షం, వారి సేవాభాగ్యాన్ని, శాశ్వత సన్నిధానాన్ని ప్రసాదిస్తున్నాను. ప్రళయం సంభవించిన వేళ శ్రీమహావిష్ణువుకి గరుత్మంతునిలా శ్రీమహాలక్ష్మీదేవికి నీవు వాహనమై తరించుగాక అంటూ శిష్యునిగా కానుకను, దేవర్షిగా వరాన్ని సమర్పించి గుడ్లగూబ దగ్గర సెలవు తీసుకుని స్వర్గలోకానికి చేరుకున్నాడు. ఈ విధంగా గానబందు అనే గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనం అయింది

5. కేదార్ నాథ్:
కేదార్ నాథ్ ఆలయం గర్భగుడిలో అందరూ ఊహించినట్టు శివలింగం ఉండదు. కేవలం ఒక ఎద్దు వెనుకభాగంలా మాత్రమే కనిపిస్తుంది. దాన్నే భక్తులందరూ ఎంతో నిష్ఠతో పూజిస్తారు. దీని వెనక ఓ కథ ఉంది. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు ఎంతో పశ్చతాపంలో ఉంటారట. యుద్ధంలో ఎందరినో హత్య చేశాం కాబట్టి ఆ పాతకం తమకు అంటుకుంటుందని, దాన్నుంచి పాపవిమోచనం కోసం శివుడిని దర్శించుకోవాలనుకుంటారు. ద్రౌపదితో కలిసి అయిదుగురు హిమాలయాలకు బయల్దేరతారు.
ఎన్నో రోజులు కష్టించి గాలించినా శివదర్శనం కాదు. చివరికి కేదార్ నాథ్ ఉండే చోటుకు వస్తారు. అయితే పాండవులకు దర్శనం ఇవ్వడానికి శివుడికి మనసొప్పదు. దీంతో శివుడు ఓ ఎద్దులా మారిపోతాడు. తనను గుర్తు పట్టకుండా మరిన్ని ఎద్దులను సృష్టిస్తాడు. శివుడిని వెతుక్కుంటూ వచ్చిన పాండవులకు ఆవులు, ఎద్దులు కనిపిస్తాయి. ఇంత మంచులో ఆవులు, ఎద్దులు ఎందుకు ఉన్నాయన్న అనుమానం ధర్మరాజుకు వచ్చి భీముడితో కాలు పైకెత్తమని చెబుతాడు. మరో వైపు నుంచి పాండవులంతా ఆవులను ముందుకు ఉరికిస్తారు.
ఒక్కో ఆవు/ఎద్దు భీముడి కాలు కింది నుంచి బయటకు వెళ్తాయి. చివరి వంతు ఎద్దు రూపంలో ఉన్న శివుడిది. అయితే పాండవులు పాపం చేశారు కాబట్టి వారికి దర్శనం ఇవ్వడానికి శివుడికి మనసొప్పదు. తప్పనిసరి పరిస్థితుల్లో పాండవులకు కనిపించొద్దన్న ఉద్దేశంతో, భీముడి కాళ్ల కింది నుంచి వెళ్లలేడు కాబట్టి .. హఠాత్తుగా మంచులోకి దూసుకుపోతాడు. పాండవులు గమనించి పట్టుకునేందుకు ప్రయత్నించగా.. ఎద్దు వెనక భాగం మాత్రం అందుతుంది…అలా ధర్మరాజు చేతికి అంటిన మిగిలిన భాగమే ఇప్పుడు కేదార్ నాథ్ లో కనిపిస్తుంది. మంచులో కూరుకుపోయిన తల భాగం హిమాలయాల అవతలి వైపు అంటే ఖాట్మాండులో ప్రత్యక్షమవుతుంది. అందుకే కేదార్ నాథ్ లో దర్శనం తర్వాత నేపాల్ వెళ్లి ఖాట్మాండు పశుపతినాథ్ ఆలయాన్ని దర్శించుకుంటే అద్భుతమని మనకే తెలుస్తుంది.

6. తిరుమల శ్రీవారికి టీవీఎస్ మోటార్స్ సంస్థ నూతన మోడల్ రొనిన్ ద్విచక్ర వాహనాన్ని విరాళంగా శుక్రవారం అందించింది. 225 CC సామర్థ్యం గల ఈ వాహనం ధర రూ.1,81,845 అని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ముందుగా అలయం వద్ద ఈ వాహనానికి పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీవీఎస్‌ సంస్థ చైర్మన్ వేణుశ్రీనివాసన్, ఎండీ సుదర్శన్ వేణు తరఫున సంస్థ ప్రతినిధి కె.వరదరాజన్ వాహనం పత్రాలను టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు సిద్ధార్థ్, తిరుపతి శ్రీనివాస టీవీఎస్‌ డీలర్ రాజా రెడ్డి, తిరుమల డీఐ జానకీరామ్ రెడ్డి పాల్గొన్నారు.