DailyDose

TNI నేటి నేర వార్తలు

TNI  నేటి నేర వార్తలు

* మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయ్యి తీహార్‌ జైల్లో ఉన్న ఢిల్లీ మంత్రి సత్యేందర్‌ జైన్‌.. మసాజ్‌ చేయించుకుంటున్న వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ వీడియోపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా క్లారిటీ ఇచ్చారు.
* ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్‌లో శనివారం స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది . ఆర్‌ఎంహెచ్‌పీ డిపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా మంటలు రావడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఆందోళనకు గురయ్యారు. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగవ్యాపించడంతో ఇబ్బందులు పడ్డారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా ప్రమాద స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు.
* కైల్‌ నదిలో మునిగి నలుగురు యువకులు దుర్మరణం చెందారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని దేవల్‌ డెవలప్‌మెంట్‌ బ్లాక్‌ పరిధిలోని కల్సిరిలో పరిధి చోటు చేసుకున్నది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి నలుగురు యువకులు కనిపించకుండా పోగా.. శనివారం ఉదయం నదిలో మృతదేహాలు కనిపించాయి. ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నదిలో నుంచి మృతదేహాలను వెలికి తీశారు.
* కొచ్చిలో ఓ యువతిపై సామూహిక లైంగికదాడి జరిపిన కేసులో నలుగురు వ్యక్తులను కేరళ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నారు. వృత్తిరీత్యా మోడల్‌గా ఉన్న యువతిపై శుక్రవారం రాత్రి సామూహిక లైంగికదాడి జరిగింది. ఈ ఘటనలో 19 ఏళ్ల మోడల్‌ ప్రాణాలతో బయటపడింది. ప్రస్తుతం వీరిని సౌత్‌ ఎర్నాకుళం పోలీసులు విచారిస్తున్నారు. బాధితురాలిని పోలీసులు స్థానిక దవాఖానలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
*బొలెరో వాహనం బోల్తా పడి.. 12 మందికి గాయాలయ్యాయి. బంటుమిల్లి మండలం పాచ్ఛాపురం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. వాహనం నడుపుతూ డ్రైవర్ నిద్రపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. వెస్ట్ గోదావరి జిల్లా వీరవాసం మండలం వడ్డీ గూడెంకు చెందిన కూలీలు బొలెరో వాహనంలో ప్రయాణం చేస్తుండగా బంటుమిల్లి మండలం పాచ్ఛాపురం వద్దకు రాగానే వాహనం బోల్తా పడింది. వాహనంలో ప్రయాణిస్తున్న 12 మంది కూలీలకు గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా కడప జిల్లా ప్రొద్దుటూరులో చెరువుల పెట్టుబడికి కూలి పనిచేయడానికి వెళ్లి తిరిగి వస్తున్నారు. క్షతగాత్రులను మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
*కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శబరిమల నుంచి తిరిగి వస్తున్న ఏపీ అయ్యప్ప స్వామి భక్తుల బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. పత్తనంథిట్ట జిల్లా లాహల్యాంప్ బోటు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 15మందికి పైగా యాత్రికులు గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను పత్తనంథిట్ట జనరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది యాత్రికులు ఉన్నారు. వీరంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా మాదేపల్లి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. ఈ నెల 15న అయ్యప్ప స్వాములు శబరిమలకు వెళ్ళారు. దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. బస్సు బ్రేక్ డౌన్ వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు. విషయం తెలిసిన కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు
*పిల్లనిచ్చిన మామనే అల్లుడు పొట్టనపెట్టుకున్న ఘటన మచిలీపట్నంలో చోటు చేసుకుంది. రెండేళ్లుగా భార్య, భర్తల మధ్య వివాదం కొనసాగుతున్నాయి. భర్త తాగి వచ్చి తరచూ కొట్టడంతో భార్య పుట్టింటికి వచ్చేసింది. దీంతో తన భార్యను కాపురానికి పంపడం లేదంటూ మామ శ్రీహరితో అల్లుడు గోపాలకృష్ణ ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో అల్లుడు కర్రతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన మామ శ్రీహరి మృతి చెందాడు. హత్యకు సంబంధించి భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
*హైదరాబాద్: నగరంలోని మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి వాహనం చోరీకి గురైంది. నిన్న కేపీహెచ్‌బీ పరిధిలో బైక్‌ను దుండగుడు అపహరించాడు. దీనిపై వాహన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో గత రాత్రి మాదాపూర్ పోలీసులు నిర్వహస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో బైక్‌తో సదరు దొంగ పట్టుబడ్డాడు. వెంటనే వాహనాన్ని జప్తు చేసిన పోలీసులు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా… ఎవరు లేని సమయంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి దుండగుడు బైక్‌కు దొంగిలించి పారిపోయాడు. ఉదయం బైక్ యజమానికి ఫోన్ చేసి మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు రవాల్సిందిగా పోలీసులు కోరారు. పోలీస్ స్టేషన్ వచ్చి చూసేసరికి బైక్ కనిపించకపోవడంతో బైక్ యజమాని, పోలీసులు కంగు తిన్నారు.
*జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో విషాదం నెలకొంది. మచిల్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద మంచు చరియలు విరిగిడపడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు మఋతి చెందారు. శుక్రవారం 56 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన జవాన్ల బృందం పెట్రోలింగ్‌కు వెళ్లింది. పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా, ప్రమాదవశాత్తు మంచు చరియలు విరిగి పడటంతో.. ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
*పెరూ దేశంలోని లిమా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన లాటం ఎయిర్‌లైన్స్ విమానం శుక్రవారం రన్‌వేపై ఫైర్‌ట్రక్కును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని, అయితే ఫైర్ ట్రక్కులో ఉన్న ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది మరణించారని, మరో ఉద్యోగి గాయపడ్డాడని విమానాశ్రయ అధికారులు తెలిపారు. విమానం రన్‌వేపై ఫైర్‌ట్రక్కును ఢీకొట్టి మంటలు చెలరేగిన కొద్ది క్షణాల వీడియో సోషల్ మీడియాలో వెలుగుచూసింది. ప్రమాదం అనంతరం విమానం నుంచి మంటలు చెలరేగాయి.
*కేరళ రాష్ట్రంలో ఓ మోడల్ పై కదిలే కారులో ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన సంచలనం రేపింది. కొడంగల్లూరుకు ముగ్గురు యువకులు, ఓ మహిళ కాసర్‌గోడ్‌కు చెందిన మోడల్ అయిన ఓ బాలికను డీజే పార్టీకి ఆహ్వానించారు.బార్‌లో మద్యం తాగి వచ్చిన మోడల్‌ అయిన బాలికను నిందితులు తమ వాహనంలో తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. ఈ అత్యాచారం ఘటనలో గాయపడిన మోడల్ ను వదిలి పరారయ్యారు.ఆసుపత్రిలో చేరిన బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ అత్యాచారానికి సహకరించిన ఓ మహిళతోపాటు ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని కేరళ పోలీసులు చెప్పారు.
* తిరుమలలో పోలీసులు భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. తిరుమల నుంచి తిరుపతి వచ్చే మార్గంలో గాలి గోపురం వద్ద అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న 11 మంది స్మగర్లను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 85 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. కోటి వరకు ఉండవచ్చని పోలీసులు తెలిపారు.