NRI-NRT

సగానికి సగం విద్యార్థి వీసాలు తిరస్కరణ.. బ్రిటన్ వైపు చూస్తున్న పంజాబీలు

సగానికి సగం విద్యార్థి వీసాలు తిరస్కరణ.. బ్రిటన్ వైపు చూస్తున్న పంజాబీలు

విదేశీ చదువు, ఉద్యోగం, ఉపాధి ఇలా ఏదైనా సరే పంజాబీల ఫస్ట్ ఛాయిస్ కెనడానే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ దేశంతో వారికి దశాబ్ధాల అనుబంధం ఉంది. దీంతో పాటు బంధువులు, కుటుంబ సభ్యులు, మిత్రుల్లో ఎవరో ఒకరు కచ్చితంగా ఇక్కడే స్థిరపడటంతో పంజాబీ యువత చాలా మంది కెనడా వెళ్లేందుకు మొగ్గుచూపుతుంటారు. అయితే, తాజాగా వారికి ఓ సమస్య వచ్చి పడింది. అదే కెనడియన్ స్టూడెంట్ వీసాల తిరస్కరణ. ఇప్పుడు ఇది ఏకంగా 50శాతం దాటింది. ఇలా కెనడియన్ విద్యార్ధి వీసాల విషయంలో తిరస్కరణ రేటు పెరుగుతుండడంతో పంజాబీలు రూట్ మారుస్తున్నారట. ఇప్పుడు వీరిలో చాలామంది బ్రిటన్ వైపు చూస్తున్నట్లు తాజాగా వెలువడిన గణాంకాలు పేర్కొంటున్నాయి.

బ్రిటీష్ హైకమీషన్ వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం.. 2022 జూన్ వరకు భారతీయ విద్యార్ధులకు 1.20 లక్షల స్పాన్సర్డ్ స్టడీ వీసాలు జారీ అయ్యాయి. వీటిలో 40 శాతం వీసాలు (Visas) పంజాబీ విద్యార్ధులే దక్కించుకోవడం గమనార్హం. ఇక యూకేలో స్టడీ వీసా పొందడం కూడా కొంచెం సులువనే చెప్పాలి. ఈ వీసా పొందాలంటే IELTS పరీక్షలో కేవలం 6 బ్యాండ్స్‌లో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. వీటిలో చదవడం, రాయడం, మాట్లాడటం, వినడం వంటివి ఉంటాయి. ఈ విషయమై ఓ ఇమ్మిగ్రేషన్ కన్సల్టెంట్ మాట్లాడుతూ.. IELTS పరీక్షలో సులభంగా పాస్ అవ్వడం ద్వారా యూకేలో 100 శాతం వీసాలు లభిస్తాయని అన్నారు.

దీనికి తోడు అక్కడి యూనివర్సిటీలు విద్యార్ధులకు పలు రకాలైన స్కాలర్‌షిప్‌లను అందిస్తుండటంతో విద్యార్ధులు అటుగా వెళ్తున్నారని కన్సల్టెంట్ తెలిపారు. అలాగే బ్రిటన్‌లోని అనేక యూనివర్శిటీలు అంతర్జాతీయ విద్యను ప్రోత్సహించడానికి భారతీయ విద్యా సంస్థలతో సంబంధాలను మెరుగు పరచుకోవడంపై దృష్టి సారించాయని అన్నారు. ఇక కెనడాలో విద్యార్థి వీసాల మంజూరుకు చాలా సమయం పడుతుండటం, తిరస్కరణ రేటు 50శాతం దాటడంతో పంజాబీ స్టూడెంట్స్ యూకే వైపు వెళ్లి పోతున్నారని చెప్పుకొచ్చారు.