Devotional

TNI ఆధ్యాత్మికం నేడు దత్త జయంతి

TNI ఆధ్యాత్మికం నేడు దత్త జయంతి

అత్రి మహాముని సుపుత్రుల కోసం ఘోర తపస్సు ఆచరిస్తాడు. ఆ తపస్సు ఫలించి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ప్రత్యక్షమవుతారు. ‘మా అంశతో మీకు ముగ్గురు పుత్రులు కలుగుతారు’ అని వరమిస్తారు. ఆ ఫలితంగానే అత్రి, అనసూయ దంపతులకు బ్రహ్మ అంశతో చంద్రుడు, విష్ణు అంశతో దత్తాత్రేయుడు, రుద్రాంశతో దుర్వాసుడు జన్మిస్తారు. అలా మహావిష్ణువు అంశతో జన్మించిన అవతారమూర్తే దత్తాత్రేయుడు. చిన్నప్పటి నుంచి దత్తుడు లోకోత్తరమైన లీలలను ప్రదర్శిస్తూ ఉండేవాడు. అనేక మంది మునీశ్వరులకు అపూర్వమైన యోగవిద్యను ప్రసాదిస్తూ ఉండేవాడు. తల్లి అనసూయా దేవికి కూడా ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించాడు. కపిలుడి అవతారంలో తల్లి దేవహూతికి ఆత్మబోధ చేస్తే, దత్తావతారంలో తల్లి అనసూయకు ఆత్మబోధ చేశాడు. అనంతరం దత్తాత్రేయస్వామి భక్త రక్షణార్థం సహ్యాద్రి గుహల్లో తపస్సు ఆచరించాడు. ఒకానొకప్పుడు చతుర్ముఖ బ్రహ్మ వేదాలను మరచిపోయి దత్తాత్రేయుడిని ఆశ్రయించాడని పురాణాలు చెబుతున్నాయి. అప్పుడు స్వామి బ్రహ్మదేవుడికి వేదదానం చేశాడట. మరొకప్పుడు జంభాసురుడనే రాక్షసుడి పీడన నుంచి దేవతలను దత్తాత్రేయుడే రక్షించాడు.

కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుడి కోసం తపస్సు చేసి వెయ్యి చేతులు, నిత్యయౌవనం వరాలుగా పొందాడు. రావణాసురుడిని జలాపహరణం చేసినందుకు శపించాడనే కథ కూడా పురాణాల్లో కనిపిస్తుంది. అదే విధంగా ప్రహ్లాదుడికి అజగరవ్రతధారి మునిరూపంలో సాక్షాత్కరించి ఆత్మజ్ఞానాన్ని బోధించాడు. ఇలా అనంత కరుణా సముద్రుడై భక్తులను సతతమూ రక్షించే సనాతన శాశ్వత ఆనందమే శ్రీదత్తాత్రేయ అవతారం. స్వామి ఇహ, పర ఉభయ ఫలప్రదాత. అందుకే ఏడుకొండలపై దీనదయాళుడైన ఆ శ్రీనివాసుడిలో దత్తాత్రేయస్వామిని దర్శించుకుంటూ…. ‘తానె తానె ఇందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞానయోగి… తనరగ కపిలుడై దత్తాత్రేయుడై.. ఘనమైన మహిమ శ్రీవేంకటరాయడై!…’ అంటూ పదకవితాపితామహుడు అన్నమయ్య నీరాజనాలు అర్పించాడు.

దత్త సంప్రదాయం
భారతదేశంలో తెలుగు రాష్ర్టాలతోపాటు, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో దత్త సంప్రదాయం విస్తారంగా విరాజిల్లింది. దత్తాత్రేయుల అవతారం పరంపరగా కొనసాగటం విశేషం. దత్తాత్రేయుడి మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు తెలుగు ప్రాంతంలో జన్మించటం మన పుణ్యఫలం. శ్రీపాదుడు ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురంలో ఆవిర్భవించాడు. మానవులలో పేరుకుపోయిన మనోమాలిన్యాలను, పూర్వపాపాల సంచిత కర్మలను తన స్మరణ మాత్రం చేత తొలగించి, ధన్యతను ప్రసాదించే పుణ్యమూర్తి శ్రీవల్లభుడు.

దత్తాత్రేయుని రెండో అవతారం శ్రీనరసింహ సరస్వతి. అంబ అనే భక్తురాలికి కుమారుడుగా జన్మిస్తానని శ్రీపాదులు చేసిన వాగ్దానాన్ని అనుసరించి ఆవిర్భవించిన అవతారమిది. దత్తాత్రేయుని మూడో అవతారం మాణిక్యప్రభువు. వీరి తల్లిదండ్రులు కల్యాణి నగరంలోని మనోహర నాయకుడు, బయాదేవి దంపతులు. దత్తుని మరో రెండు అవతారాలు అక్కల్‌కోట మహారాజు, శిరిడీ సాయిబాబా. వీరి నుంచి దత్తావతారులు అవధూత మార్గాన్ని అనుసరించటం ఆరంభమైంది. వీరి జననీజనకుల వివరాలు, పుట్టిన తేదీ, ప్రదేశం వంటి వివరాలు అలభ్యం. ఇది దత్తాత్రేయస్వామి అవతారాల లీల. తుదకు వీరి పేర్లు కూడా ఇతరులు పెట్టినవే! ఉదాహరణకు శిరిడీ సాయిబాబా అవతారాన్నే తీసుకుంటే మహారాష్ట్రలోని శిరిడీలో ఒక ముస్లిం వేషధారణతో పెండ్లివారితోపాటు బండి దిగిన వ్యక్తిని చూసి, అక్కడి ఖండోబా ఆలయ పూజారి ‘ఆవో సాయీ’ అని స్వాగతం పలికాడు. ఆ విధంగా సాయిబాబా ఈ లోకానికి పరిచయమయ్యారు.

అవధూతకు అందరూ గురువులే!
దత్తాత్రేయ స్వామి ప్రకృతిలోని చరాచరాలను తన గురువులుగా ప్రకటించుకున్నారు. తనకు ఇరవై నాలుగు మంది ప్రధానమైన గురువులు అని అజగర రూపంలో ప్రహ్లాదుడికి ఇలా వివరించాడు…

కర్మబంధంలో చిక్కి స్వయంగా బాధపడే అజ్ఞానుల వల్ల.. కలిగే బాధలన్నిటినీ భరిస్తూనే, వారికి వీలైనంత మేలు చేస్తాను. దీన్ని నేను భూమాత నుంచి నేర్చుకున్నాను.
సుగంధ దుర్గంధాల్ని మోస్తూనే వాటికి అంటకుండా ఉండే వాయువును చూసి సుఖదుఃఖాల మధ్య ఉంటూనే వాటికి చిక్కకుండా ఉండటం అవగతం చేసుకున్నాను.
దేనితోనూ సంబంధం లేకుండా ఉండే ఆకాశాన్ని చూసి, ఈ జడమైన శరీరాన్ని మోస్తూనే, అది నేను కానట్లు ఉండటం తెలుసుకున్నాను.
తనను తాకిన అన్నిటినీ శుద్ధి చేసే నీటిని చూసి నా సంగంలోకి వచ్చిన వారందరికీ పవిత్రతను, మంచిని పంచటం అలవాటు చేసుకున్నాను.
తనకు ఆహుతి ఇచ్చిన అన్నిటినీ దహించే అగ్నిని చూసి ఆహారంగా ఎవరేం ఇచ్చినా స్వీకరిస్తాను.
పెరిగి తరుగుతున్నా మారని చంద్రుడిని చూసి శరీర కష్టసుఖాలను పట్టించుకోకుండా ఆనందంగా ఉండటం నేర్చుకున్నాను.
సముద్రం నుంచి నీటిని గ్రహించి వర్షం రూపంలో తిరిగి ఇచ్చే సూర్యుణ్ని చూసి… పొందిన ఉపకారాల్ని తగిన సమయంలో తగిన విధంగా తిరిగి ఇవ్వటం తెలుసుకున్నాను.
వేటగాడికి చిక్కిన తన కుటుంబాన్ని చూసి గుండె పగిలిన పావురం స్వయంగా అతనికి దొరికి బలైపోయింది. అలా సంసారంలో పడి నలిగిపోకూడదని అర్థం చేసుకున్నాను.
ఆహార అన్వేషణ చేయని కొండచిలువలా అయాచితంగా వచ్చిన ఆహారం ఏదైనా ఆనందంగా స్వీకరించి, ఆత్మచింతనలో మునిగిపోవటం తెలుసుకున్నాను.
నదులన్నీ వచ్చి కలిసినా అనంత గాంభీర్యాన్ని వదలని సముద్రాన్ని చూసి కోరికల వెంట పరుగులు తీయక స్థిరత్వాన్ని పొందాను.
ఆకర్షణల మంటలో పడి మాడి మసైపోయే శలభాన్ని చూసి ఇంద్రియ భోగాలనే మంటలకు చిక్కకుండా ఉండగలిగాను.
కూడబెట్టిన తేనెను అనుభవించలేని తేనెటీగను చూసి, రేపటి గురించి ఆలోచన మానేశాను.
స్పర్శసుఖాన్ని ఆశించి వేటగానికి చిక్కే ఏనుగును చూసి కామాన్ని, ఐహిక సుఖాల్ని, భోగవాంఛల్ని త్యజించాను.
వేటగాడి సంగీతానికి లోబడి ప్రాణాలు కోల్పోయే లేడిని చూసి, శ్రవణేంద్రియాన్ని అధిగమించాను.
తినకుండా, దానం చేయకుండా తేనెను పోగేసే తేనెటీగల్ని చూసి పోగేయాల్సింది ధనం కాదు, జ్ఞానమని తెలుసుకున్నాను.
ఎరకు ప్రలోభపడి గాలానికి చిక్కిన చేపను చూసి జిహ్వ చాపల్యాన్ని జయించాను.
విటులకై ఎదురుచూసి విరక్తి చెందిన పింగళ అనే వేశ్యను చూసి ఆశాపాశానికి బందీని కాక, ఆనందంగా స్వేచ్ఛగా ఉండటం నేర్చుకున్నాను.
కాకులు వెంటపడగా మాంస ఖండాల్ని వదిలి శాంతిని పొందిన గద్దను చూసి, లౌకిక వాంఛలను, వాటి వెన్నంటి ఉండే దూషణ భూషణాలను లెక్కచేయకుండా ఉండగలుగుతున్నాను.
శబ్దాన్ని తగ్గించేందుకు ఒక కన్య, ఒక గాజును తప్ప మిగిలిన గాజులను తీసేయటం చూసి, లోకపు కాకిగోలను నివారించేందుకు ఒంటరిగా ఉంటూ ఆత్మధ్యానంలో లీనమయ్యాను.
ఏ కారణం లేకుండానే ఆనందంగా ఉండే పసివాడిని చూసి త్రిగుణాలకు అతీతంగా ఉండటం తెలుసుకున్నాను.
బాణం మొనకు పదునుపెడుతూ పక్కనే వెళ్తున్న రాజుగారి పటాలాన్ని పట్టించుకోని బోయవాణ్ని చూసి ఏకాగ్ర చిత్తాన్ని అలవర్చుకున్నాను.
చీమలపుట్టలోకి చేరి జీవించే పామును చూసి, చెట్లను, గుహలనే నివాసంగా మార్చుకున్నా.
భ్రమరానికి చిక్కిన కీటకం భయంతో దాన్నే ధ్యానిస్తూ భ్రమరంగానే మారిపోవటం చూసి, ఆత్మనే ధ్యానిస్తూ నన్ను నేను మరచిపోయాను.
సాలెపురుగు నుంచే దాని గూడు తయారైంది. అలాగే భగవంతుడు తయారుచేసిన సృష్టిలోని ప్రతీదాన్నీ భగవన్మయంగా దర్శిస్తున్నాను.
చివరగా నా శరీరం కూడా నాకు గురువే! దానితోనే నేను ధర్మాలను ఆచరిస్తున్నాను. కానీ, ఏనాటికైనా అది మరణిస్తుందని తెలుసుకొని, పరిపూర్ణ వైరాగ్యాన్ని పొంది ఆనందంగా ఉన్నాను.