Movies

అందరికీ చెప్పే పెళ్లి చేసుకొంటా!

అందరికీ చెప్పే పెళ్లి చేసుకొంటా!

మన్నా కెరీర్‌ చాలా ప్రత్యేకం. చిన్న సినిమాతో ఎదిగింది. స్టార్‌ హీరోల సరసన చేసింది. ప్రత్యేక గీతాల్లో మెరిసింది. కథానాయిక ప్రాధాన్యం ఉన్న కథలూ ఎంచుకొంది. ఓటీటీల్లో అడుగు పెట్టింది. చిన్న, పెద్ద హీరోలందరితోనూ జట్టు కట్టింది. ఇలా ఎలా చూసినా.. పరిపూర్ణమైన ప్రయాణం తనది. భాషాబేధం లేకుండా అన్నిచోట్లా తనదైన ముద్ర వేస్తున్న తమన్నా.. ఇప్పుడు ‘గుర్తుందా శీతాకాలం’ అంటూ మరోసారి పలకరించబోతోంది. ఈనెల 9న ఈ చిత్రం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా తమన్నాతో చిట్‌ చాట్‌.

‘గుర్తుందా శీతాకాలం’ ఎలాంటి సినిమా.. ఇందులో కొత్తగా ఏముంటుంది?కొత్తగా ఏదో చూపించాలనే ప్రయత్నంతో తీసిన సినిమా కాదిది. కొన్ని అనుభూతుల్ని పంచుదామనుకొంటున్నాం. వింటేజ్‌ లవ్‌ స్టోరీని.. ఈతరం యువతీ యువకుల ఆలోచనలకు అనుగుణంగా మలిచిన కథ ఇది. ఓ పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రం చేయాలని అనుకొంటున్నా. ఆ కోరిక ఈ సినిమతో తీరింది.
ఇదో రీమేక్‌ సినిమా కదా? ఓటీటీలు వచ్చాక రీమేక్‌లు చూస్తారంటారా?ఓటీటీ ప్రభావం ఇప్పుడు కొంత వరకూ ఉండొచ్చు. కాకపోతే.. రీమేక్స్‌కు కాలం చెల్లలేదు. నా కెరీర్‌లో నేను చాలా రీమేక్స్‌ చేశాను. ఓ మంచి కథని మరో భాషలో చెప్పాలనుకోవడం ఎప్పుడూ తప్పు కాదు. కానీ నేటివిటీ మిస్‌ కాకుండా చూసుకోవాలి. ‘గుర్తుందా శీతాకాలం’ లాంటి కథని ఏ భాషలో చెప్పినా ప్రేక్షకులు చూస్తారు. ఇలాంటి కథలకు భాషాబేధాలు ఉండవు. కాలానికి అతీతమైన కథలు ఇవి.

స్టార్‌ హీరోలతో పని చేశారు.. ఇప్పుడు సత్యదేవ్‌ లాంటి యువతరం నటుడితో పని చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో స్టార్లలోనూ, కొత్తవారిలోనూ మీరు గమనించే తేడా ఏమిటి?స్టార్‌ హీరోనా? యంగ్‌ హీరోనా? అనేది నేనెప్పుడూ చూడను. అలాంటి స్ర్టాటజీలు పని చేసే రోజులు కావివి. సత్యదేవ్‌ నటన అంటే నాకు చాలా ఇష్టం. తనతో వర్క్‌ చేయాలని ఎప్పటి నుంచో అనుకొంటున్నాను. లాక్‌ డౌన్‌ సమయంలో తన ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపశ్య’ సినిమా చూశా. చాలా సహజంగా నటించాడు. స్టార్‌ హీరోలపై ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. సినిమా అంతా వాళ్లే మోస్తారు. వాళ్లపై అంచనాలు వేరే స్థాయిలో ఉంటాయి. వాటిని మోయడం ఎంత కష్టమో.. లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు చేసేటప్పుడు నాకు తెలిసొచ్చింది.

ట్రైలర్‌ చూశాక చాలామంది ఈ సినిమాని ‘గీతాంజలి’తో పోలుస్తున్నారు? మీకూ అదే అనిపించిందా?గీతాంజలి నా అభిమాన చిత్రాలలో ఒకటి. అలాంటి గొప్ప చిత్రంతో పోలిస్తే మంచిదే. అలాగని అదేం మాపై ఒత్తిడి పెంచదు. ఇప్పటి వరకూ ఇలాంటి కథలు చాలా వచ్చి ఉండొచ్చు. కాకపోతే… ఆ కథల్లో లేని సరికొత్త భావోద్వేగాలు ‘గుర్తుందా శీతాకాలం’లో చూపిస్తున్నాం.
ఇన్నేళ్ల కెరీర్‌లో ఏం నేర్చుకొన్నారు? హిట్లూ, ఫ్లాపు ఎలా స్వీకరిస్తారు?అసలు ఇన్నేళ్లు చిత్రసీమలో ఉంటానని నేను అస్సలు అనుకోలేదు. వచ్చిన కొత్తలో వీలైనన్ని ఎక్కువ సినిమాల్లో కనిపించాలని ఉండేది. ఇప్పుడు అంత తొందర లేదు. కొత్తదనం లేని సినిమాని నేనెందుకు చేయాలి? అనే ప్రశ్న నాకు నేనే వేసుకొంటా. ‘తమన్నా వల్ల ఈ కథకు ప్లస్‌ అవుతుంది’ అనుకొన్నవాళ్లే నా దగ్గరకు వస్తున్నారు. నేను కూడా బాధ్యతతో చేస్తున్నా. ఇక హిట్లూ, ఫ్లాపూ అంటారా..? అవి నా చేతుల్లో లేని విషయాలు. మూవ్‌ ఆన్‌ అయిపోవాల్సిందే.

ఈమధ్య ఓటీటీల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. కారణమేంటి?ఓటీటీ అనేది సినిమాకి దొరికిన మరో వేదిక. అక్కడ రీచ్‌ కూడా ఎక్కువగా ఉంటుంది. కొత్త తరహా ప్రయోగాలు చేసే వీలుంది. అందుకే ఓటీటీల్లోనూ కనిపిస్తున్నా.
తరచూ మీ పెళ్లి మాట వార్తల్లో గట్టిగా వినిపిస్తోంది…అవును.. పెళ్లనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ కీలకమైన ఘట్టం. నేనూ పెళ్లి చేసుకొంటా. నా కెరీర్‌ని మీ అందరికీ ఎంత గొప్పగా పరిచయం చేసుకొంటానో.. నా కాబోయే భర్తనీ అంతే హుందాగా పరిచయం చేస్తా. పెళ్లి విషయంలో మా ఇంట్లోవాళ్లు కంగారు పడడం లేదు. నాకూ అంత తొందరలేదు. అందరికీ చెప్పే పెళ్లి చేసుకొంటా.