Politics

కవితను ఏడు గంటలకు పైగా ప్రశ్నించిన సీబీఐ

కవితను ఏడు గంటలకు పైగా ప్రశ్నించిన సీబీఐ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6.30 వరకు.. దాదాపు ఏడున్నర గంటల పాటు సీబీఐ అధికారులు కవితను ప్రశ్నించారు. మహిళా అధికారులతో కూడిన ఆరుగురు సభ్యుల సీబీఐ టీం.. 160 సీఆర్పీసీ కింద కవిత స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియా రికార్డింగ్ కూడా నిర్వహించినట్లు సమాచారం. ఉదయం నుంచి అడ్వొకేట్ సమక్షంలో అధికారుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం భోజన సమయం తర్వాత సీబీఐ అధికారులు అడ్వొకేట్ను బయటకు పంపి.. కవితను విడిగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ కవిత పేరు ప్రస్తావించిన తర్వాత.. కవితకు సీబీఐ నోటీసు ఇచ్చింది. నిందితులైన బోయినపల్లి అభిషేక్ రావు, అరుణ్ రామచంద్ర పిళ్లై, ఇండో స్పిరిట్ ఎండీ సమీర్ మహేంద్రు స్టేట్మెంట్ ఆధారంగా కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.