Politics

అంబటి కి చెక్ పెట్టే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్..

అంబటి కి రాంబాబుకు చెక్ పెట్టే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్

మంత్రి అంబటి ఇలాకాలో పవన్ కల్యాణ్ – రాంబాబుకు చెక్ పెట్టేలా కొత్త నిర్ణయం..!!

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రానున్న ఎన్నికల దిశగా పార్టీలు కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. వైసీపీ వర్సస్ టీడీపీ గా ఎన్నికల యుద్దం కనిపిస్తున్నా.. జనసేన కీలకంగా మారుతోంది. రెండు పార్టీల గెలుపు – ఓటములను డిసైడ్ చేసేలా అడుగులు వేస్తోంది. టీడీపీతో పొత్తు ఖాయమనే అంచనాలు ఉన్నా.. జనసేన అమలు చేస్తున్న వ్యూహాలు కొత్త చర్చకు కారణమవుతున్నాయి. ఇదే క్రమంలో పార్టీలో బలమైన నేతల చేరికల దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందుకోసం పవన్ కల్యాణ్ ముందుగా మంత్రి అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లిని ఎంచుకున్నారు. పవన్ సత్తెనపల్లి పర్యటన జనసేన ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది.

18న సత్తెనపల్లికి పవన్ కల్యాణ్
జనసేన అధినేత ఈ నెల 18న సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ప్రస్తుతం ఆ నియోజకవర్గం నుంచి మంత్రి అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొంత కాలంగా పవన్ వర్సస్ అంబటి పొలిటికల్ డైలాగ్ వార్ పతాక స్థాయికి చేరింది. పవన్ పలు సందర్భాల్లో అంబటి గురించి వ్యాఖ్యలు చేసారు. మంత్రి అంబటి మీడియా సమావేశాలు..ట్వీట్ల ద్వారా పవన్ ను టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో అంబటి నియోజకవర్గంలో పవన్ పర్యటన రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 268 మంది కౌలు రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున పరిహారం అందించాలని పవన్ నిర్ణయించారు. ఇందు కోసం సత్తెనపల్లి వేదికగా సభ ఏర్పాటు చేసారు. ఆ సభలో పవన్ రాజకీయంగా కీలక అంశాలను ప్రస్తావించనున్నట్లు సమాచారం. అదే సమయంలో అక్కడి నుంచే అంబటి రాంబాబు లక్ష్యంగా పవన్ మాట్లాడే అవకాశం ఉంది.

పార్టీలో చేరికలకు వేదికగా..!?
ఇప్పుటి వరకు జనసేనలో నామమాత్రంగానే ముఖ్య నేతలు ఉన్నారనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు జనసేనలో చేరేందుకు ఇతర పార్టీల నేతలు ముందుకొస్తున్నారు. అందులో భాగంగా..సత్తెన పల్లి వేదికగా జనసేనలోకి అక్కడి మాజీ ఎమ్మెల్యే ఒకరు పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. ఇప్పటికే జిల్లాకు చెందిన సీనియర్ నేత ప్రస్తుతం బీజేపీలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ జనసేనలో చేరుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. తాజాగా జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్వయంగా కన్నా ఇంటికి వెళ్లటం..ఇద్దరి మధ్య చర్చలతో ఈ వాదనకు బలం చేకూరింది. అయితే, బీజేపీ – జనసేన మధ్య పొత్తు ఉండటంతో చేరిక అంశం పైన అటు కన్నా..ఇటు జనసేన నేతలు ఓపెన్ అవ్వటం లేదు. కానీ, కన్నా జనసేనలో చేరుతారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. గతంలో కన్నా పెదకూరపాడు, గుంటూరు పశ్చిమ నుంచి ఎమ్మెల్యే గా గెలుపొందారు. సుదీర్ఘ కాలం మంత్రిగా పని చేసారు. ఇక, నర్సరావుపేట ఎంపీగానూ పోటీ చేసారు. ఇదే సమయంలో సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే కూడా పవన్ సమక్షంలో పార్టీలో చేరుతారనే చర్చ సాగుతోంది. దీని ద్వారా అంబటి పైన పోటీకి తమ పార్టీ అభ్యర్ధిని పవన్ సిద్దం చేసుకుంటున్నట్లు స్పష్టం అవుతోంది.

రాజకీయంగా కీలక ప్రకటనకు ఛాన్స్…
ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. బీజేపీతో జనసేన పొత్తు కొనసాగుతున్నా..నామ్ కే వాస్తే అన్నట్లుగా మారింది. టీడీపీతో పొత్తు వ్యవహారం పైన క్లారిటీ లేదు. దీని పైన అటు టీడీపీ – ఇటు జనసేన కేడర్ లో డైలమా నెలకొంది. ఈ క్రమంలో సత్తెనపల్లి వేదికగా పవన్ తన రాజకీయ కార్యాచరణ పైన ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక, పార్టీలోకి చేరికలను సత్తెనపల్లి నుంచి ప్రారంభించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. పొత్తుల సంగతి పైన స్పష్టంగా ప్రకటన చేయకపోయినా..జనసేన బలం చాటేలా ముందుగా చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ… పొత్తు కుదిరినా, తాము కోరుకున్న విధంగా సీట్లు దక్కించుకొనే విధంగా పవన్ కల్యాణ్ వ్యూహం సిద్దం చేస్తన్నట్లు తెలుస్తోంది. దీంతో, మంత్రి అంబటి రాంబాబు నియోజకవర్గంలో పవన్ ఎటువంటి నిర్ణయాలు ప్రకటించబోతున్నారనేది ఆసక్తి గా మారుతోంది.