Business

TNI వాణిజ్యం.. చరిత్రను సృష్టిస్తున్న TATA లు

TNI  వాణిజ్యం.. చరిత్రను సృష్టిస్తున్న TATA లు

ఇటీవల ప్రభుత్వం నుంచి విమానయాన సంస్థ ఎయిరిండియాను (Air India) తిరిగి దక్కించుకున్నాక టాటా గ్రూప్ దూకుడు పెంచింది. పలు ఎయిర్‌లైన్స్‌ను తనలో విలీనం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చరిత్రకు మరో అడుగు దూరంలో నిలిచింది. దాదాపు 500 విమానాల కోసం టాటా గ్రూప్‌కు చెందిన ఎయిరిండియా ఆర్డర్ చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఆ సన్నాహాలు ప్రారంభించిందని, దాదాపు ఖరారైందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఎయిరిండియా పునరుజ్జీవం కోసం టాటా గ్రూప్ తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ఇదేనని అంటున్నాయి. ఇక ఈ డీల్ విలువ చరిత్రలో నిలిచిపోతుందని వార్తా సంస్థలు నివేదిస్తున్నాయి. ఏకంగా 100 బిలియన్ డాలర్లపైనే.. అంటే భారత కరెన్సీలో రూ.8.2 లక్షల కోట్లకుపైనే ఉంటుందని తెలుస్తోందిఈ 500 విమానాల్లో ఎక్కువగా 400 వరకు నారో- బాడీ జెట్స్, మిగతా 100 లేదా అంతకంటే ఎక్కువ వైడ్- బాడీ విమానాలు ఈ ఆర్డర్‌లో ఉన్నట్లు సమాచారం. ఇందులో డజన్ల కొద్దీ ఎయిర్‌బస్ A350s, బోయింగ్ 787s, 777s రేంజ్ విమానాలు కూడా ఆర్డర్‌లో ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.ధర, వాల్యూమ్ ఇలా ఏ పరంగా చూసినా.. ఎయిరిండియా ఇవ్వబోయే ఆర్డర్ విమానయాన చరిత్రలో నిలిచిపోతుందని నిపుణులు అంటున్నారు. ఇప్పటివరకు ఒక విమానయాన సంస్థ ఇంత పెద్ద మొత్తంలో ఆర్డర్ ఇవ్వలేదని చెబుతున్నారు. సరిగ్గా దశాబ్దం క్రితం అమెరికా ఎయిర్‌లైన్స్ నుంచి 460 ఎయిర్‌బస్, బోయింగ్‌కు వచ్చిన ఆర్డర్ ఇప్పటివరకు అతిపెద్దదిగా ఉంది.ఇక ఇంత పెద్ద మొత్తం ఆర్డర్ చేసినప్పుడు అదే రీతిలో డిస్కౌంట్ లభిస్తుంది. అయినప్పటికీ ఈ డీల్ విలువ 100 బిలియన్ డాలర్లపైనే ఉండనుంది. పెద్ద మొత్తంలో రాయితీకి అవకాశం ఉన్నందునే ఒకేసారి ఎక్కువ విమానాలను కూడా ఆర్డర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు దీనిపై ఎయిర్‌బస్, బోయింగ్ స్పందించేందుకు నిరాకరించాయి. టాటా గ్రూప్ కూడా ఎలాంటి కామెంట్ చేయలేదుఇటీవల సింగపూర్ ఎయిర్‌లైన్స్, టాటా గ్రూప్ సంయుక్తంగా నిర్వహిస్తున్న విస్తారాను.. ఎయిరిండియాలో విలీనం చేశారు. దీంతో భారత్‌లో అతిపెద్ద ఫుల్ సర్వీస్ క్యారియర్‌గా అవతరించింది. దీంతో మొత్తం విమానాల సంఖ్య 218కి చేరింది. ఇక దేశంలోనే అతిపెద్ద ఇంటర్నేషనల్ క్యారియర్, దేశీయ మార్కెట్‌లో రెండో అతిపెద్ద క్యారియర్‌గా నిలిచింది. JRD టాటా స్థాపించిన ఎయిరిండియా ఆర్థిక సమస్యలతో కొన్నేళ్ల కిందట భారత ప్రభుత్వం చేతికి వెళ్లింది. అయితే ఈ జనవరిలో మళ్లీ టాటా గ్రూప్ తిరిగి దక్కించుకుంది. అప్పటినుంచి తన కార్యకలాపాలను క్రమంగా విస్తరించుకుంటూ వెళ్తోంది. భారత్‌లో సహా ప్రపంచంలోనే అత్యుత్తమ సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.