Politics

కెసిఆర్ ను ఇంటికి తరిమి కొడతాం.. జేపీ నడ్డా

కెసిఆర్ ను ఇంటికి  తరిమి కొడతాం.. జేపీ నడ్డా

బీఆర్ఎస్ రానున్న రోజుల్లో వీఆర్ఎస్గా మారి అంతరించిపోతుందని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. చాలు దొర.. సెలవు దొర నినాదంతో జనంలోకి వెళ్లి కేసీఆర్ ప్రభుత్వానికి స్వస్తి పలుకుతామన్నారు. కరీంనగర్లో జరిగిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. ఉట్టికి ఎగరలేనమ్మ.. స్వర్గానికి ఎగురుతాను అన్నట్లుగా కేసీఆర్ అతిగా ఆలోచిస్తుండన్నారు.త్వరలోనే కేసీఆర్ వీఆర్ఎస్ తీసుకునే సమయం ఆసన్నమైందన్నారు. ఒకప్పుడు మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టింది కేసీఆరే అని విమర్శించారు. 3.92 లక్షల కోట్ల లోటులో ప్రస్తుతం తెలంగాణ ఉందన్నారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ వెంటే ఉంటారని నడ్డా అన్నారు. గత ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం నిధులతో తెలంగాణలో 4,996 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం జరిగిందని తెలిపారు. ‘‘బీజేపీ యాత్రను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ వాళ్లు ప్రయత్నించారు. వాళ్లకు నేనొకటి చెప్పదల్చుకున్న.. ఇది ప్రజాస్వామ్యం.. దీనిలో ఇతరుల గొంతు నొక్కే ప్రయత్నం జరగకూడదు.. ఒకవేళ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే ప్రజలు నిలువుగా బొందపెడ్తరని కేసీఆర్ తెలుసుకోవాలి’’ అని అన్నారు.బండి సంజయ్ రూపంలో కరీంనగర్ కు మంచి పార్లమెంటు సభ్యుడు దొరికాడని జేపీ నడ్డా అన్నారు. ప్రజాసంగ్రామ యాత్రను ఇంటింటికి చేరుస్తామని తెలిపారు. దళిత వర్గానికి కేంద్ర సర్కారు ఎంతో గుర్తింపు ఇస్తోందని.. పదుల సంఖ్యలో దళిత వర్గం వారికి కేంద్ర మంత్రి పదవులు ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రపతి స్థానాన్ని కూడా దళిత మహిళకు కేటాయించిన బీజేపీకే దక్కుతుందని తెలిపారు.

దర్యాప్తు సంస్థలు ఎమ్మెల్సీ కవితను ఎందుకు విచారిస్తున్నయ్
సీఎం కేసీఆర్ కు కొడుకు, కూతురు, అల్లుడు తప్ప ఎవరూ కనిపించడం లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కుటుంబవాదాన్ని వ్యాపింపజేసే ప్రయత్నంలో భాగంగానే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టారని వ్యాఖ్యానించారు. కరీంనగర్ లో జరిగిన ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ లో నడ్డా మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు అవినీతి, అక్రమాలకు తెగబడ్డారని ఆరోపించారు. ధరణి పోర్టల్ ను వాడుకొని టీఆర్ఎస్ వాళ్లు అక్రమ సంపాదన పోగేస్తున్నారని మండిపడ్డారు. దర్యాప్తు సంస్థలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎందుకు విచారిస్తున్నయ్ అని నడ్డా ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులంతా కలిసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ సాధన కోసం అమరులైన వారి ఆశయాలకు కేసీఆర్ తూట్లు పొడుస్తున్నారని కామెంట్ చేశారు.